బాబు వెంటే కరువు, అనావృష్టి
రాజంపేట రూరల్: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన వెంటే కరువు, అతివృష్టి, అనావృష్టి తోడుగా వస్తాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గిట్టుబాటు ధరలేక రైతులు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. టీడీపీ మెనిఫెస్టోలో రూ.500కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని పొందుపరచారని, ఆ మాటను నిలుపుకోలేదని విమర్శించారు.
గుంటూరులో మిర్చి రైతుల కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు ఎంతో స్పందన వచ్చిందన్నారు. అలాగే రాయలసీమలో పసుపు, మామిడి, అరటి తదితర పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు కుదేలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల తరఫున పోరాడుతున్న జగన్‌పై తమ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గంచే విమర్శలు చేయించడం చంద్రబాబు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో నీటి జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోయాయన్నారు. మిర్చి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంలో చలనం వస్తోందంటే అది జగన్‌మోహన్‌రెడ్డి వల్లేనని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.