
వైఎస్సార్‌సీపీ నాయకుడి దుర్మరణం
వైఎస్సార్‌సీపీ డి.హీరేహాళ్ మండల ప్రధాన కార్యదర్శి ఫాస్ట్రూనాయక్(48) రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు.
- బళ్లారి నుంచి బైక్‌లో వస్తుండగా ఢీకొన్న ట్రాక్టర్
- కాళ్లు, చేతులు విరిగి.. తీవ్ర రక్తస్రావం
- నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాపు
డి.హీరేహాళ్(రాయదుర్గం) : వైఎస్సార్‌సీపీ డి.హీరేహాళ్ మండల ప్రధాన కార్యదర్శి ఫాస్ట్రూనాయక్(48) రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి సోమవారం రాత్రి తన స్వగ్రామమైన డి.హీరేహాళ్ మండలం హెచ్‌ఎస్ తండాకు బయలుదేరగా.. మార్గమధ్యంలోని శిద్దాపురం వద్ద ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో అతని కాళ్లు, చేతులు విరిగాయి. తలకూ బలమైన గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను కోమాలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే గమనించి డి.హీరేహాళ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆటలో బళ్లారి విమ్స్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మరణించారు. అంతకు ముందే రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆస్పత్రికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అయినా ఫలితం లేకుండాపోయింది. నాయక్ మృతదేహానికి కాపు నివాళులర్పించారు. మృతుని భార్య హేమాబాయి, కుమారులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ బోయ మల్లికార్జున, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్ నాయక్, మండల కన్వీనర్ వన్నూరుస్వామి, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, జగదీశ్, రహంతుల్లా, ఓబుళాపురం ఎంపీటీసీ సభ్యుడు గాదిలింగా ఉన్నారు.