టీడీపీ విధానాలను ఎండగడతాం
రేపు చోడవరంలో విస్తృతస్థాయి సమావేశాలకు శ్రీకారం
వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీ
చోడవరం: రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడతామని వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో అనేక అమలుకాని వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాక అసలు అలాంటి హామీలే తాము ఇవ్వలేదని మంత్రులు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. రాజధాని పేరుతో మంత్రులు, అధికార పార్టీ నాయకులు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వివరాలు, వారు చేసిన భూదందా సర్వే నెంబర్లతో సహా పత్రికల్లో వస్తే రికార్డులు సైతం బ్లాక్ చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నార ని ఆరోపించారు. చోడవరం నియోజకవర్గంలో 1070మంది పింఛన్లకు అర్హులైనట్టు అధికారులు ధ్రువీకరించినప్పటికీ పార్టీల పేరుతో అర్హులకు సైతం పింఛన్లు రాకుండా జన్మభూమి కమిటీలు అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే , టీడీపీ నాయకులు క్వారీలు, ఇసుక అక్రమణాతో సహజవనరులను సైతం దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే దగాబాబుపై దండోరా కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించామని గుర్తుచేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అధికార పార్టీ పాలకవర్గం ఇష్టానుసారంగా రైతుల సొమ్మును చందాల పేరుతో సొంత ప్రచారం కోసం ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
రేపు వైఎస్సార్‌సీపీ సమావేశం
వీటన్నింటిని ఎండగట్టేందుకే నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని తమ పార్టీ అధిష్టానం, కేంద్ర కమిటీ నిర్ణయించిదన్నారు. చోడవరం నుంచి ఈ సమావేశాలు జిల్లాలో ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు చోడవరం జవహార్‌క్లబ్ ఆవరణంలో నియోజకవర్గస్థాయి వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి తమ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ధర్మశ్రీ చెప్పారు. ఈ సమావేశానికి చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అన్ని విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వేచలపు ప్రకాష్, మండల శాఖ, పట్టణ శాఖల అధ్యక్షులు అప్పికొండ లింగబాబు, ఓరుగంటి నెహ్రూ, డీసీసీబీ డైరక్టర్ మూడెడ్ల మహాల క్ష్మి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.