ఘోరం.. అమానుషం | ysrcp leaders angry on twin murders | Sakshi
Sakshi News home page

ఘోరం.. అమానుషం

Published Sun, May 7 2017 9:59 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

ఘోరం.. అమానుషం - Sakshi

ఘోరం.. అమానుషం

– జంట హత్యలపై ప్రముఖుల ఆగ్రహం
– బా«ధితులను విచారించిన ఎస్పీ
– మృతదేహాలను సందర్శించిన గౌరు, గంగుల
– మృతదేహాలకు పోస్టుమార్టం 
 
నంద్యాల :  వైఎస్సార్‌సీపీ నేత శిరివెళ్ల మాజీ ఎంపీపీ ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన బావమరిది శ్రీనివాసరెడ్డిలను ప్రత్యర్థులు దారి కాచి బండరాళ్లు, వేట కత్తులతో దాడి చేసి హత్య చేయడం ఘోరం, అమానుషమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, పార్టీ నంద్యాల ఇన్‌చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గోవిందపల్లెలో హత్యకు గురైన ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతదేహాలను శనివారం అర్ధరాత్రి శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఆధ్వర్యంలో పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను చూడటానికి గోవిందపల్లె గ్రామస్తులు వందల సంఖ్యలో తరలి వచ్చారు.  
 
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆసుపత్రిని చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, యువనేత గంగుల నాని మృతదేహాలను చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి గ్రామంలో వివాద రహితులని, వీరిని అంతమొందించడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల ఇన్‌చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి  మృతదేహాలను పరిశీలించారు. మాజీ ఎంపీ గుంగుల ప్రతాపరెడ్డి మేనల్లుడు గోపవరం గోకుల్‌రెడ్డి తన సన్నిహితులైన ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతదేహాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.   సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. 
 
నిందితుల కోసం ప్రత్యేక బృందం–రవికృష్ణ, జిల్లా ఎస్పీ 
ప్రశాంతమైన గోవిందపల్లెలో జంట హత్యలు జరగడం బాధాకరం. హత్యలో 10 మందికి పైగా పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. వీరిని అరెస్ట్‌ చేయడానికి ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక పోలీస్‌ బృందాలు అరెస్ట్‌ చేయడానికి గాలింపు చర్యలను చేపట్టాయి. త్వరలో నిందితులను అరెస్ట్‌ చేస్తాం. 
 
 దుర్మార్గపు చర్య
గోవిందపల్లెలో  మాపార్టీ నేతలు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థులు హతమార్చడం దుర్మర్గపు చర్య. ప్రభాకర్‌రెడ్డి రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని పోతూ గ్రామాభివృద్ధికి కృషి చేశాడు. ఇలాంటి వాటికి పార్టీ కేడర్‌ భయపడదు. పోలీసులు వెంటనే   నిందితులను అరెస్ట్‌ చేయాలి.–గౌరువెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
హత్యలు అమానుషం
ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి హత్యలు బాధాకరం. వీరు సాయంత్రం వాకింగ్‌ పోయినప్పుడు ప్రత్యర్థులు దారి కాచి చంపడం అమానుషం. రాజకీయాలకు అతీతంగా ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరాం.
–గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ 
 
 24 గంటలు గడవకముందే..
వివాహానికి హాజరు కావడానికి నేను నిన్న వచ్చినప్పుడు ప్రభాకర్‌రెడ్డి కలిసి మాట్లాడారు. కాని 24 గంటలు గడవకముందే ఆయనను విగత జీవిగా చూస్తున్నందుకు బాధగా ఉంది. చిన్నవయస్సులోనే తండ్రి హత్యకు గురైనా ప్రతీకారానికి పాల్పడకుండా ఓర్పు, సహనంతో గ్రామాభివృద్ధికి చేశారు. పోలీసులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. –గంగుల ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీ 
 
ప్రశాంతత కాపాడాలి
గోవిందపల్లె ప్రశాంతమైన గ్రామం. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే. తర్వాత అందరు నేతలు కలిసి మెలిసి ఉంటారనే మంచి పేరు ఉంది. కాని ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి శిక్షించాలి.  –రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల ఇన్‌చార్జి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement