అరాచకపాలనకు స్వస్తి పలుకుదాం
రాష్ట్రంలో అరాచక, జాతి వ్యతిరేకపాలన చేపడుతున్న టీడీపీ ప్రభుత్వానికి స్వస్తి పలుకుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో అరాచక, జాతి వ్యతిరేకపాలన చేపడుతున్న టీడీపీ ప్రభుత్వానికి స్వస్తి పలుకుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్సా సత్యనారాయణ, పార్టీ కృష్ణాజిల్లా ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
క్విట్ చంద్రబాబు..
పార్థసారథి మాట్లాడుతూ దేశాన్ని బ్రిటీష్ పాలకులు ఏలుతున్న సమయంలో వారిని తరిమికొట్టేందుకు ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు అందించేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని జాతిపిత మహాత్మాగాంధీ 1942 ఆగస్టు 8వ తేదీ ప్రారంభించినట్లు తెలిపారు. నేడు ఇబ్రహీంపట్నంలో జాతిపిత మహాత్మాగాంధీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జాతివ్యతిరేక పాలన చేస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ రోజునే క్విట్ చంద్రబాబు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. అప్పట్లో గాంధీజీ విదేశీ వస్తువులు భహిష్కరించమని పిలుపు నిచ్చారన్నారు. ప్రస్తుతం అవినీతి సామ్రాజ్య స్థాపనకు రాష్ట్రాన్ని చైనా, జపాన్, కొరియా, సింగపూర్ వంటి దేశాల చేతుల్లో పెట్టి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. నాటి బ్రిటీష్ పాలకులకు చంద్రబాబు పాలనకు పెద్దతేడా లేదని విమర్శించారు. విజయవాడలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నిత్యం చూడలేక అసహనంతోనే తొలగించారని విమర్శించారు. ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్‌ను మీరు తొలగించ లేరన్నారు. ఆయన నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును తొలగించగలరా అని సవాల్ విసిరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉండటం రాష్ట్రం చేసుకున్న పాపం అని విమర్శించారు. పార్టీ జిల్లా వ్యవహరాల ఇన్‌చార్జి పెద్దిరామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడులో అసహనం తీవ్రంగా పెరిగిపోయిందని అరాచకంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, అన్నింటిని ధ్వంసం చేస్తూ అంతటితో ఆగకుండా దివంగత వైఎస్సార్ జాతిపిత మహత్మ గాంధీ విగ్రహలను తొలగించటం దారుణం అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అందరు కలిసికట్టుగా పోరు సాగించలని పిలుపునిచ్చారు. జోగి రమేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేపడుతున్న తప్పుడు విధానాలు, అరాచకాలపై మండిపడ్డారు. తొలుత ముందు జోగి రమేష్ నివాసంలో నాయకులను మాజీ ఎంపీపీ జోగి మోహనరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు, పార్టీ విజయవాడ నగర నాయకులు ఆడపా శేషు, అవుతు శ్రీనివాసరెడ్డి, తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), పార్టీ జిల్లా కార్యదర్శి లంకే అంకమోహనరావు, మాజీ ఎంపీపీ చెరుకు మాధవరావు, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, కేడీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు వి. రాంబాబు, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం మండల కన్వీనర్లు బొమ్మసాని వెంకటచలపతి, మందా జక్రధరరావు, పామర్తి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి పాల్గొన్నారు.
పుష్కర ఘాట్ల పరిశీలన
ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం పుష్కర ఘాట్ల పనులను ఆ పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ కోట్లు దండుకోవటానికే పుష్కర పనులు చేస్తున్నారు.. తప్ప వచ్చే భక్తుల కోసం కాదని విమర్శించారు. మరో మూడు రోజుల్లో పుష్కరాలు మొదలవుతున్న క్రమంలో ఇంకా పనులు చేస్తున్నారు. అసలు సాగుతున్న పనులు ఏప్పుడు పూర్తి అవుతాయో దేవుడికే తెలియాని ఎద్దేవా చేశారు. పవిత్ర పుష్కరాలను అపవిత్రం చేసేలా డబ్బులు అధికార పార్టీ దండుకుంటుందని విమర్శించారు. అసలు ప్రభుత్వానికి పుష్కరాలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి ఉందా లేక డబ్బులు దండుకోవటానికే దీనిని ఒక మార్గంగా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు.