కరీంనగర్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ నియంతపాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవ హరిస్తూ సామాన్యులను ఇబ్బంది గురిచేస్తోందని.. ప్రజావ్యతిరేక సర్కార్‌ను సాగనంపాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎస్‌ఈకి అందజేశారు. రైతులకు మూడో విడత రుణమాఫీ నిధులు రూ. 4250 కోట్లు ఒకే దఫాలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో స్పష్టత లేకపోవ డంతో బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. తద్వార రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, యెల్లంకి రమేశ్, నగర అధ్యక్షుడు దేవరవేణి వేణుమాధవరావు, యువజన విభాగం అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు బోగే పద్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గండి శ్యాం, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.