పెట్టుబడిదారులకు రాష్ట్రం తాకట్టు
కాటూరు (ఉయ్యూరు) : ప్రజాపక్షాన పోరాటం సాగిస్తున్నామన్న అక్కస్సుతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మావోయిస్టులతో పోల్చిన చంద్రబాబు ఓ నీచ మనస్కుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ ముగిసిన సందర్భంగా శనివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభకు పార్టీ ఉయ్యూరు పట్టణ అధ్యక్షుడు జంపాన కొండలరావు అధ్యక్షత వహించారు. పార్థసారథి మాట్లాడుతూ, చంద్రబాబుకు మించిన మోసగాడు, మావోయిస్టు ఈ దేశంలో ఎవ్వరూ ఉండరన్నారు. పెట్టుబడిదారులకు అమ్ముడుపోతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతుంటే అడ్డుకోవడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమ పార్టీదని చెప్పారు.
కులాల మధ్య చిచ్చు..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చురాజేసి రాజకీయ లబ్ధిపొందాలనే దుర్మార్గ రాజకీయాలకు చంద్రబాబు అండ్ పార్టీ తెరతీసిందని మండిపడ్డారు. కాపు జాబ్ మేళా అంటూ కులం పేరుతో జాబ్ మేళా నిర్వహించి ఆ వర్గాన్ని దగా చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాపులకు, ఇతర కులాలకు మధ్య గొడవ పెట్టే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు నష్టం జరగకుండా రిజర్వేషన్ ఇవ్వటంలో తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిద్రపోతున్నారా ?
ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌లకు రైతు సమస్యలు పట్టకపోవడం బాధాకరమని సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీపీ యాజమాన్యం రైతులకు చెందాల్సిన కొనుగోలు పన్నును వాడుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎంపై ఒత్తిడి తెచ్చి జీవో జారీ చేయించి రైతులకు కొనుగోలు పన్ను టన్నుకు రూ.60 ఇప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి దేవినేని ఉమ, సీఎం చంద్రబాబుకు రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాల్లో తాగునీటి సమస్య కనిపించడంలేదా అని ప్రశ్నించారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ, ప్రజాధనాన్ని చినబాబు లోకేష్, కొందరు ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సభలో తుమ్మల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజులపాటి రామచంద్రరావు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, మండల అధ్యక్షుడు దాసే రవి, ప్రధాన కార్యదర్శి గారపాటి నాని, సర్పంచులు పల్లపోతు శ్రీనివాసరావు, ఉండ్రాసి దీపిక, ఎంపీటీసీ సభ్యురాలు వీరమ్మ, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మహ్మద్ ఖాన్ ప్రసంగించారు.