రెండున్నరేళ్లలో బాబు చేసిందేమీలేదు
కార్వేటినగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో పూర్తి స్థాయిలో నిరూపించుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి డిమాండు చేశారు.బుధవారం డీ.ఎం పురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
ప్రత్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిసినా బాబు మాత్రం స్వలాభాల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కోరుకొంటున్నారని ఆరోపించారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఆగడాలు హద్దుమీరిపోతున్నాయని, ఇళ్లను కూల్చి అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మిస్తామని చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతను విమర్శించేందుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న సీఎం ఆ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు.
కేంద్రప్రభుత్వ నిధులను చంద్రన్న కానుకలంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌కు పంక్చర్ చేయడం ఖాయమన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సింగిల్‌విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, సేవాధళ్ జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటరత్నం, ఇంజిం కృష్ణయాధవ్, మునుస్వామి యాదవ్, కృష్ణయాదవ్, పధ్మనాభశెట్టి, విజియల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.