Narayana Swamy Naidu
-
పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి
తిరుపతి రూరల్: పవన్ కల్యాణ్‌కి దమ్ముంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సవాల్ విసిరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆదివారం ఆయన మొక్కలు నాటారు. పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరు, ఎవరితో, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీని ఓడించలేరని స్పష్టం చేశారు. కులం పేరు చెప్పుకొని ఓట్లడుగుతున్న పవన్‌కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసి తానేంటో నిరూపించుకోవాలన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటని, పెట్టుకోకపోతే తమకేంటని వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్రెడ్డి సింహం అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. -
ఆయన చావుకి కారణం నువ్వే?
పుత్తూరు : ‘ చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది... వెన్నుపోటు పొడిచి ఆ మహానుభావుడి మరణానికి కారణమైన ఆయనే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరడాన్ని అభిమానులు, నిజమైన టీడీపీ వాదులు జీర్ణించుకోలేకున్నారు.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తారని విమర్శించారు. గురువారం పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్థానికి ఇప్పటికీ ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటూనే ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్లతోనే ఆయనపై వైస్రాయ్ హోటల్ ఎదుట దాడి చేయించారని, అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎంతో సదుద్ధేశంతో అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కారని. ఎన్టీఆర్ మానసిక పుత్రికైన రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయలు చేశారని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము కూడా మనస్ఫూర్తిగా కోరుకుం టున్నామని, ఈ అంశాన్ని ప్రస్తావించే అర్హత మాత్రం చంద్రబాబునాయుడుకు లేదని తేల్చి చెప్పారు. -
అందుకే...పాడి మోశాను!
పుత్తూరు: ‘నేను సత్యవేడు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేశాను. బీ ఫామ్ ఇస్తారు.. అభిమానిస్తారు.. కానీ దగ్గరుండి ఓడించారు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు.. 2004లో తొలిసారి నేను ఎమ్మెల్యేగా గెలవడానికి అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడుది కీలకపాత్ర.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాపై నమ్మకంతో మూడోసారి పార్టీ టికెట్ ఇస్తే... నా కోసం 7 రోజులు సత్యవేడులో ప్రచారం నిర్వహించింది ముద్దుకృష్ణమే... ఎన్నికల ఖర్చు కోసం ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.. అందుకే పాడి మోశాను.’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తన మనోగతాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం పట్టణంలోని ద్రౌపదీదేవి ఆలయ తోపులో జరిగిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సంతాప సభలో ఆయన మాట్లాడారు. ముద్దుకృష్ణమనాయుడికీ తనకు మధ్య ఉన్నది కల్మషం లేని సంబంధమని చెప్పారు. కేవలం వ్యక్తిగతమైదే తప్ప రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నాలుగు నెలల క్రితం బైపాస్ సర్జరీ చేసుకున్న ముద్దుకష్ణమ తన ఇంటికి వచ్చినప్పుడు కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే చర్చకు వచ్చాయి తప్ప రాజకీయాలు రాలేదని తేల్చి చెప్పారు. దీనికి కొందరు పెడార్థాలు తీయడం దురదృష్ణకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం జీవితాన్ని ధారబోసిన ముద్దుకృష్ణమనాయుడు ఆత్మకుశాంతి కలగాలని ప్రార్థించారు. సత్యవేడు సమన్వయకర్త కోనేటి ఆదిమూలం, ఎంపీపీ గంజి మాధవయ్య, మున్సిపల్ చైర్మ న్ యుగంధర్, వైస్ చైర్మన్ ఆనంద్, నాయకులు జయప్రకాష్, విజయబాబు, కేటీ ప్రసాద్‌రెడ్డి, గణేష్, షణ్ముగరెడ్డి, కరుణాయాదవ్, జీవరత్నంనాయుడు పాల్గొన్నారు. -
తుమ్మలగుంట నుంచి తిరుత్తణికి పాదయాత్ర
తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడులోని తిరుత్తణికి పాదయాత్ర చేపట్టారు. సోమవారం తుమ్మలగుంటలో ఈ పాదయాత్రను ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. వంద కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్ర పల్లెల మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేతో పాటు పాదయాత్రలో నడిచారు. తిరుచానూరు జనసంద్రమైంది. సాయంత్రానికి పుత్తూరుకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం 7 గంటలకు బయల్దేరి 16 గంటలపాటు సుమారు 41 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి సాయంత్రానికి తిరుత్తణికి చేరుకుంటారు. దేశ చరిత్రలో ఏ ప్రతిపక్షనేత కూడా మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాఖలాలు లేవని, జగన్ చేసే ప్రజాసంకల్ప మహా పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. జగన్‌కు మద్దతుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకే వైఎస్ జగన్ పాదయాత్రను చేపడుతున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తపించే నేత జగన్ అని ఎమ్మెల్యే నారాయణస్వామి కొనియాడారు. -
‘ఇంటింటికి టీడీపీ’లో ఎమ్మెల్యే నిలదీత
నెల్లిమర్ల: ‘నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి’ అని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడును నిలదీశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక నేతలు లెంక అప్పలనాయుడు, బయిరెడ్డి నాగేశ్వరరావు తదితరులతో కలసి ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు ఇల్లిల్లూ తిరిగారు. ఈ సందర్భంగా ప్రారంభంలోనే లక్ష్మీదేవిపేట ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. తమకు అభివృద్ధి అక్కర్లేదని, వెంటనే నగర పంచాయతీ నుంచి తమ ప్రాంతాన్ని తప్పించాలని కోరారు. ప్రధాన కూడలిలో సీపీఎం నేత కిల్లంపల్లి రామారావు కూడా ఎమ్మెల్యేను అడ్డగించి నగర పంచాయతీ విషయమై నిలదీశారు. ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని వినతిపత్రం సైతం అందజేశారు. స్థానిక శ్మశానానికి వెళ్లేందుకు సీసీరోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇంత వరకు ఎందుకు పనులు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. మరో వైపు టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ పలు చోట్ల వాల్‌పోస్టర్లను అంటించారు. -
దళితుల ఆందోళన..కొవ్వాడలో ఉద్రిక్తత
సాక్షి, విజయనగరం: జిల్లాలోని పూసపాటి రేగ మండలం కొవ్వాడలో ఉద్రిక్తత నెలకొంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడుకి కేటాయించిన భూముల్లో దళితులు ఆందోళన చేపట్టారు. దళితులకు కేటాయించిన భూములను ఎమ్మెల్యేకు కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూముల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలిగించారు. పోలీసులు దళితులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యేకు చెందిన ఎస్వీస్ కెమికల్స్ కంపెనీ కోసం ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇది దళితులకు కేటాయించిన భూమి అని వారు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
ఎమ్మెల్యేకి ఎస్పీ క్షమాపణ చెప్పాలి
తిరుపతి సిటీ: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిపై దురుసుగా వ్యవహరించిన తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి టి.రాజేంద్ర డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నారాయణస్వామి దళితుడు కావడంతో అర్బన్ ఎస్పీ దురుసుగా వ్యవహరించారని, ఇది దళితుల మనోభావా లను దెబ్బ తీసేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందారని, వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా ఏర్పేడు ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. మరణించిన వారి కుటుంబాలను ప్రతిపక్షనేత వైఎస్.జగన్ ఓదార్చి వారిలో మనోధైర్యం నింపారని చెప్పారు. టీడీపీకి చెందిన ఇసుక స్మగ్లర్ల అక్రమ రవాణా వల్లే ఘటనకు కారణమని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం లీగల్‌సెల్ నగర కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో గోపాల్‌రెడ్డి, కృష్ణవేణమ్మ, పునీత, మహేశ్వరరావు, సాయికుమారి, జగదీష్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఓ అబద్ధాల పుట్ట
► బాబుకు మహిళలు, రైతుల ఉసురు తగలక తప్పదు ► అంబేడ్కర్‌కు దండ వేసే అర్హత సీఎంకు లేదు ► ఎమ్మెల్యే నారాయణస్వామి ఆగ్రహం కార్వేటినగరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచిస్తూ ఓ అబద్ధాల పుట్ట, దగాకోరుగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. బుధవారం కార్వేటినగరం స్కంధపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీల అభ్యున్నతిని ఓర్వలేని ముఖ్యమంత్రి , అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసే అర్హత కూడా లేదన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మూడేళ్లుగా ఎక్కడగానీ సెంటు భూమి, ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని, ఓట్లకోసమే ఎస్సీలను, వెనుకబడిన వారిని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రుణమాఫీ కాక, బ్యాంకర్ల నోటీసులతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, దీనికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది విపత్తు మూలాన పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు బీమా పరిహారం ఇచ్చిన పాపానపోలేదని దుయ్యబట్టారు. అనంతరం కార్వేటినగంరలో జరిగిన సింగిల్‌విండో డైరెక్టర్ «ధనంజయవర్మ తల్లి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట సింగిల్‌విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి పద్మనాభశెట్టి, వెంకటరత్నం, శేషాద్రి తదితరులు ఉన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన
⇒నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు ⇒ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమపథం ⇒ఫిరాయింపుదారులకు అగ్రాసనమా..? ⇒ఫిరాయింపు ఎమ్మెల్యేలతోరాజీనామా చేయించాలి ⇒వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి కార్వేటినగరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అలా చేయడం లేదన్నారు. ముస్లిం మైనారిటీలు,ఎస్టీలను విస్మరించి వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. అప్రజాస్వామికమైన ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు, నిరసన గళాన్ని వినిపించేందుకు పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా చేపట్టే ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసామ్యవాదులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం దష్టికి కూడా తీసుకు వస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్, గవర్నర్ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. 21మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు విన్నవిస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామం అపహాస్యమైందని, సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. ఇంత దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదని తెలిపారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని పేర్కొన్నారు. -
పోలీసులా? టీడీపీ కార్యకర్తలా?
మా పార్టీవారిపై టీడీపీ కార్యకర్తలు తెగబడుతుంటే స్పందించేది లేదా..? ఫిర్యాదు చేస్తే కౌంటర్ కేసులు పెడతారా డీఎస్పీ వైఖరి మరీ దారుణం పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి ఆగ్రహం చిత్తూరు: పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షాన్ని, ఆ పార్టీ కార్యకర్తలను వేధించడానికే అన్నట్టు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నా ఉత్సవ విగ్రహాల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని పోలీసులకు విన్నవించుకుంటే కౌంటర్ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ లక్ష్మీ నాయుడు టీడీపీ కండువా కప్పుకున్న నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టొద్దని సాక్ష్యాత్తు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చెప్పినా డీఎస్పీ వినడటం లేదన్నారు. ఎస్పీ ఆదేశాలకే దిక్కులేకపోతే ఇక ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రౌడీల్లా జన్మభూమి కమిటీ సభ్యులు.. జిల్లాలో జన్మభూమి కమిటీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తూ ప్రజలను భయపెడుతున్నారని నారాయణస్వామి విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ ఇంటి సొత్తన్నట్లు కమిటీ సభ్యులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చే కొన్ని ఇళ్లు, పింఛన్లు కూడా అనర్హులకు ఇస్తుంటే అర్హులు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి సభల్లో అధికారులను డమ్మీలుగా నిలబెట్టారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తేనే న్యాయం.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ తెస్తారన్నారు. వికలాంగులు, వితంతువుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పడతారని అన్నారు. -
దళితులపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన జన్మ భూమి సభలో గ్రామస్తులు సమస్యలు ఏకరువు పెట్టడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. దళితులమైన తమకు దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు ఇతర సదుపాయాలను ఇవ్వడంలేదని విన్న వించుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మీకు ఇచ్చేదేలేదు. ఏమి చేసుకుంటారో చేసుకోండని మైకు వారిపైకి విసిరేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై నుంచి వెళ్లిపోతూ తనకు తెలియకుండా వీరికి ఏ పథకం వర్తింపచేయవద్దని, తాను అనుమతిస్తేనే పింఛన్లులు గానీ, గ్యాస్ కనెక్షన్ గానీ ఇవ్వాలని హుకుం జారీచేశారు. ఎమ్మెల్యే తీరు చూసి జన్మభూమి సభకు హాజరైన దళితులు నిరసన వ్యక్తం చేశారు. తాము చేసుకున్న పాపం ఏమిటని, ప్రభుత్వ పథకాలు తమకు ఎందుకు మంజూరు చేయరని ప్రశ్నించారు. -
రెండున్నరేళ్లలో బాబు చేసిందేమీలేదు
కార్వేటినగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో పూర్తి స్థాయిలో నిరూపించుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి డిమాండు చేశారు.బుధవారం డీ.ఎం పురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిసినా బాబు మాత్రం స్వలాభాల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కోరుకొంటున్నారని ఆరోపించారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఆగడాలు హద్దుమీరిపోతున్నాయని, ఇళ్లను కూల్చి అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తామని చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతను విమర్శించేందుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న సీఎం ఆ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు. కేంద్రప్రభుత్వ నిధులను చంద్రన్న కానుకలంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌కు పంక్చర్ చేయడం ఖాయమన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సింగిల్‌విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, సేవాధళ్ జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటరత్నం, ఇంజిం కృష్ణయాధవ్, మునుస్వామి యాదవ్, కృష్ణయాదవ్, పధ్మనాభశెట్టి, విజియల్రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదవాడికి స్థలమేదీ, ఇల్లేదీ?
బాబు హామీలపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నారాయణస్వామి తిరుపతి మంగళం : పేదరికానికి కులమతాలు లేవని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ లో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.2లక్షలు మంజూరు చేస్తామన్న చంద్రబాబు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుపేదలు ఉండడానికి గూడులేక, ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బం దు లు పడుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా పేదలకు 3సెంట్ల భూమి కాదు కదా, 3 అంకణాలు కూడా ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూ పంపిణీ చేయకపోవడం చంద్రబాబు నయవంచనకు నిదర్శమన్నారు. నమ్మినవాళ్లను నట్టేట ముంచ డం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేయించడంలో మంత్రి రావెల కిషోర్‌బాబు నిర్లక్ష్యం చూపుతూ సాటి కులస్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాల్సిన మంత్రి సబ్‌ప్లాన్‌పై నోరు మెదపకపోవడం చూస్తే వారి పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందని తెలిపారు. -
అక్కడ అడ్రస్ గల్లంతైనందునే.. ఇక్కడ మైండ్‌గేమ్
టీడీపీ తీరుపై చిత్తూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు కాకినాడ : తెలంగాణలో అడ్రస్ గల్లంతవుతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ ప్రాంతంలో పార్టీని కాపాడుకునేందుకే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ మైండ్‌గేమ్ ఆడుతోందని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. కాకినాడ వచ్చిన ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లినా కేడర్ బలంగా ఉందని బీరాలు పలుకుతూ, ఇక్కడ మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత నమ్మక ద్రోహం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్లోకి వెళ్తారో సీఎం తనయుడు లోకేష్ గ్రహించాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజలతోను, ప్రజలు తమ పార్టీతోను ఉన్నారని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని నారాయణస్వామి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు టిక్కెట్లు ఖరారు చేస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇస్తే.. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే తాము ఎప్పుడూ ఇలాంటి ప్రచారం చేసుకోలేదని అన్నారు. రాజకీయ అజ్ఞానంతో, తమ అనుకూల పత్రికలతో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. అన్ని మతాలనూ ఆదరించే హిందూ మతాన్ని సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట అని, అందుకు గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనమని అన్నారు. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి తనయుడికీ లేని ఆదరణ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డికి ఉందని, ఎక్కడికి వెళ్లినా ఆయనను తమ కుటుంబంలోని పెద్ద కుమారుడిలా ఆదరిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇదో గొప్ప విషయమని అన్నారు. కులాలను రెచ్చగొట్టి పరిపాలన సాగించడంలో చంద్రబాబే దిట్టని విమర్శించారు. ముద్రగడ ఉద్యమాన్ని సైతం జగన్మోహన్రెడ్డి వెనక ఉండి నడిపించారంటూ తప్పుడు విమర్శలు చేశారని నారాయణస్వామి అన్నారు. -
శరత్‌కుమార్‌కు షాక్
పలువురు నేతల టాటా ఎమ్మెల్యే నారాయణన్ కూడా చీలికకు కుట్ర పన్నారని అధినేత ఆవేదన సాక్షి, చెన్నై: సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)లో విభేదాలు బయట పడ్డాయి. ఆ పార్టీ అధినేత శరత్‌కుమార్‌కు షాక్ ఇచ్చే రీతిలో పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు.ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ కూడా హ్యాండ్ ఇచ్చారు. తన పార్టీలో చీలికకు కుట్ర జరుగుతున్నదని శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలో 2007లో ఎస్ఎంకే ఆవిర్భవించింది. నాడర్ సామాజికవర్గంతో నిండి ఉన్న ఈ పార్టీ గత అసెంబ్లీ ఎ న్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించింది. నాడర్ పేరవై ఎస్ఎంకేలోకి చేరడంతో ఆ పేరవై నేత ఎర్నావూర్ నారాయణన్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కింది. నాంగునేరి నుంచి నారాయణన్, తెన్కాశి నుంచి శరత్‌కుమార్ ఎన్నికల బరిలో నిలబడి అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల మీద గెలిచారు. పేరుకు ఎస్ఎంకేలో ఉన్నా, ఇద్దరు అసెంబ్లీలో అన్నాడీఎంకే సభ్యులుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల దక్షిణ భారత సినీ నటీ నటుల సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ మరోమారు పోటీ చేసి కంగు తిన్నారు. తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేకు శరత్‌కుమార్ దూరంగానే ఉంటూ వస్తున్నారని చెప్పవచ్చు. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంగా శరత్‌కుమార్ వ్యవహార శైలి మారి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ సమయంలో శరత్‌కుమార్‌కు షాక్ ఇస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజన్, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి ఐస్ హౌస్ త్యాగులతోపాటుగా పలువురు నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎంకే నుంచి బయటకు రావడమే కాదు, బీజేపీ గూట్లోకి చేరారు. అలాగే ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ సైతం శరత్‌కుమార్‌కు హ్యాండ్ ఇచ్చారు. శరత్‌కుమార్ వ్యవహార శైలిని విమర్శిస్తూ, గురువారం ఏకంగా మీడియా ముందుకు వచ్చారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో శరత్‌కుమార్ వ్యవహరించేందుకు సిద్ధం అవుతున్నారని, ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ఒత్తిడి తెచ్చారని, అందుకే తానూ వ్యతిరేకంగా వ్యవహరిచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అన్నాడీఎంకే చిహ్నం మీద గెలిచిన దృష్ట్యా, తాను మాత్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యేనే అని పేర్కొన్నారు. తనను అన్నాడీఎంకే ఆదరించిందని, రానున్న ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలిసి తన పయనం సాగుతుందన్నారు. ఇక ఎస్ఎంకే వ్యవహారంగా మున్ముందు తీసుకోబోయే చర్యలన్నీ చట్టపూర్వకంగానే ఉంటాయంటూ, ఆ పార్టీని చీల్చే దిశగా ముందుకు సాగుతోన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక, పార్టీ విబేధాలు రచ్చకెక్కడంతో శరత్‌కుమార్ మేల్కొన్నారు. చీలికకు కుట్ర: టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శరత్‌కుమార్ ఆగమేఘాలపై జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పార్టీ కమిటీ భేటీ అనంతంరం పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారందరనీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతున్నదని మీడియా ముందు శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లు నాంగునేరి ప్రజలకు ఎర్నావూర్ నారాయణన్ ఏమి చేశారో అందరికీ తెలుసునని మండి పడ్డారు. ఇప్పుడు కూడా అన్నాడీఎంకేతో కలిసి ఎస్ఎంకే పయనం సాగిస్తున్నదని, రానున్న ఎన్నికల సమయంలో తదుపరి పార్టీ కార్యవర్గం తీర్మానాలకు మేరకు నిర్ణయాలు ఉంటాయని, ప్రస్తుతం మాత్రం అన్నాడీఎంకేలోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
అంతా అవినీతే..
ఎమ్మెల్యే నారాయణస్వామి తిరుపతి మంగళం: ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వా మి ఆరోపించారు. గురువారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ కొత్త రాజధాని పేరుతో వేల ఎకరాల భూ ములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొంటున్నారన్నారు. అందులో 25 శాతం రాజధాని నిర్మించి, మిగిలిన భూములను సింగపూర్ సంస్థలకు అ ప్పగించి, రూ.వేల కోట్లు దండుకునేందుకు చంద్రబాబు ప్రణాళిక రూ పొందించారని ఆరోపించారు. ప్రపంచదేశాల్లో తన గొప్పను చాటుకోవడానికి గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. గోదావరి పుష్కరాలకు వ చ్చిన భక్తులకు కనీస వసతులు కల్పిం చడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే 28మంది భక్తులు తొక్కిసలాటలో మృతి చెందారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ని జంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై గూండాయిజం చేస్తున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇదంతా చూస్తుంటే ఎవరికి నచ్చినట్లు వారు చేయండి, ఏదైనా వస్తే తాను చూసుకుంటానని చంద్రబాబే ఆ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చినట్లు ఉన్నారన్నారు. మహిళా తహశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందన్న స్వార్థంతో కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామంటూ కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. -
'భూమా అరెస్టు ద్వారా గెలవాలనుకోవడం దుర్మార్గం'
తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో నియంతపాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ ద్వారా గెలుపొందాలనుకోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికుట్రలు పన్నినా వైఎస్ఆర్సీపీ పోరాటాలు ఆపలేరని ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
అవినీతికి కేరాఫ్ ‘బాబు’
నిజాయితీతో ఎప్పుడు పదవులు అనుభవించారు? ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు వెదురుకుప్పం : అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కే.నారాయణస్వామి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పచ్చికాపల్లంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి నిర్వచనం తెలియని ‘చంద్రబాబూ’ ఇతరులపై నిందలు మోపడం నీకు అలవాటై అయిపోయిందని ధ్వజమెత్తారు. ఆంధ్ర అన్నా హాజరే అంటూ బీరాలు పలికిన నువ్వు.. ఓటుకు నోటుతో పదవులు పొందాలను కోవడం దేనికి సంబంధించిందో చెప్పాలని ప్రశ్నించారు. నీ రాజకీయ అనుభవంలో నీతి, నిజాయితీతో ఎప్పుడు పదవులు అనుభవించావని నిలదీశారు. నీవు నీతిమంతుడైతే ఢిల్లీకి వెళ్లి కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదన్నారు. నోటుకు ఓటు కేసులో తప్పించుకోవడం నీ తరం కాదు కాబట్టే అడ్డదారులు తొక్కుతున్నావని అన్నారు. నీకు, నీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని జోస్యం చెప్పారు. ఎల్లో మీడియాలో ఉత్తుత్తి కథనాలతో ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నావవంటూ ఆరోపించారు. నీకు దమ్ముంటే మీ సచ్చీలతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి గోవర్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాధవరావు, ఎంపీపీ పురుషోత్తం, మండల పార్టీ అధ్యక్షుడు పేట ధనంజేయులు రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీలు జయరామ మందడి, రోశిరెడ్డి,నాయకులు మునస్వామి, సర్పంచ్ బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఏడాది పాలనలో ప్రభుత్వమే ఫెయిల్
అవి కక్షపూరిత రాతలు ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజం పుత్తూరు : ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా ఫెయిలైంది టీడీపీ ప్రభుత్వమే.. నోటుకు ఓటుతో తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు బేరమాడి అడ్వాన్సు చెల్లించి అడ్డంగా దొరిపోవడంతో సీఎం చంద్రబాబు అవినీతి గుట్టు రట్టయిందని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. గురువారం పుత్తూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా తాను, రోజా ఈ ప్రభుత్వ పాలనను ఎండగట్టామని, అందుకే ఆ పార్టీ అనుకూల పత్రిక తమనే టార్గెట్ చేసిందని, ఈ కక్షపూరిత రాతల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో కలెక్టర్ ఏక పక్షంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల అభ్యర్థనలను కూడా పట్టించుకోలేదన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నానా, లేదా? అనేది ప్రజలకు తెలుసన్నారు.నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా ఇప్పటికి ఆమె ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమేనా అంటూ ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో చెర్లోపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు కంచి సుబ్రమణ్యం, పీజే.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఖండన జీడీనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామిపై వచ్చిన అవాస్తవ కథనంపై పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. నీతిమాలిన చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి బీ.నరసింహారెడ్డి, రైతు విభాగం పెనుమూరు మండల అధ్యక్షుడు కారేటి గోవిందరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు దూది మోహన్, ఆ పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్‌రాజు, పార్టీ వెదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు పేట ధనంజయులురెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రరెడ్డితో పాటు ఎస్సీ సెల్ జిల్లా సంయుక్త ప్రధాన కార్యదర్శి ఆనందయ్య, ఆ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, గంగాధరనెల్లూరు ఎంపీపీ ప్రగతికరుణాకర్, జెడ్పీటీసీ సభ్యుడు తూగుండ్రం గుణశేఖర్మొదలి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ అధికారప్రతినిధి వేల్కూరుబాబురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరకనెల్లూరుకోదండన్, ఎస్ఆర్ పురం ఎంపీపీ మోహన్‌కుమార్, మండల కన్వీనర్ అనంతరెడ్డి, తదితరులు హితవు పలికారు. గాంజకి ఎంపీటీసీ సభ్యుడు పుత్తూరు ధనంజయరెడ్డి కార్వేటినగరం పట్టణ యువత అధ్యక్షుడు మధన్‌కుమార్‌రెడ్డి కూడా ఎల్లోమీడియో లో వచ్చిన అవాస్తవ కథనాన్ని ఖండించారు. -
కబ్జా భూములను స్వాధీనం చేసుకోండి
చిత్తూరు (అగ్రికల్చర్): గంగాధరనెల్లూరు మండలంలో కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని డీఆర్ఓ విజయచందర్‌ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి కోరారు. శుక్ర వారం కలెక్టరేట్లోని డీఆర్ఓ కార్యాలయంలో డీఆర్ఓను కలిసి ఈమేరకు నారాయణస్వామి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగాధరనెల్లూరు మండలం నందళూరు రెవెన్యూ పరిధిలోని దాదాపు 16 ఎకరాల డీకేటీ భూములను పాపిరెడ్డిపల్లెకి చెందిన సుధాకర్‌రెడ్డి ఆక్రమించుకుని సాగు చేయకుండా వృథాగా వదలి వేసి ఉన్నారని తెలిపారు. పెడకంటిపల్లి దళిత వాడకు చెందిన ప్రజలు ఏళ్లతరబడి ఇళ్ల స్థలాలులేక పక్కా గృహాలకు నోచుకోలేదన్నారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఆయన కోరారు. దీనిపై పలుమార్లు వినతులు చేసినా మండల స్థాయి అధికారులు ఏమాత్రం స్పందిం చడం లేదని, గతంలో చిత్తూరు ఆర్డీఓకు కూడా వినతి చేశాసినా ఫలితం కనిపించలేదని చెప్పారు. కనీసం కబ్జా భూములను సర్వే చేయడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. మీరైనా దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుని కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని డీఆర్వోను నారాయణ స్వామి కోరారు. -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
జిల్లా తమ్ముళ్లపై చంద్రబాబు తన రాజకీయాన్ని ప్రదర్శించారు. కిమిడి మృణాళినికి పదవిచ్చి జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించినట్టు పైకి కలర్ ఇస్తూ...మరో వైపు జిల్లాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకటరావుకు, శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి ఆధిపత్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు. దీని కోసం జిల్లాకు చెందిన సీనియర్లకు మొండిచేయి చూపారు. కచ్చితంగా తమ నేతలకే మంత్రి పదవులు వస్తాయని ఆశించిన పతివాడ నారాయణ స్వామి నాయుడు, కోళ్ల లలిత కుమారి వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. అధినేత తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండి పడుతున్నాయి. సీనియర్లకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఇచ్చి జిల్లాకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఇస్తామని ఊరించి చివరి నిమిషంలో మొండి చేయి చూపడాన్ని ఆయన అనుచరులు జీర్ణిం చుకోలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కిమిడి మృణాళిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించారని, అంతటితో ఆగకుండా గెలవగానే మంత్రి పదవి కట్టబెట్టారని ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పొరుగు జిల్లా నేతైన మృణాళినికి మంత్రి పదవి ఇచ్చి ఆ సామాజిక వర్గానికి చెందిన పతివాడ నారాయణస్వామినాయుడుకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్‌గా, విధేయుడిగా ఉన్న పతివాడకు మంత్రి పద వి ఇస్తామని ఊరించారని, పత్రికలు, ఛానళ్లలో కూడా పెద్ద ఎత్తున కథనాలొచ్చాయని కానీ చివరి నిమిషంలో మొండి చేయి చూపడం విచారకరమని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డెంకాడ మం డలం పెద తాడివాడలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమై చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. పార్టీలో చంద్రబాబు కన్నా సీనియర్ అయిన పతివాడకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆక్షేపణీయమన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందం గా చంద్రబాబు వ్యవహరించారని ఆ పా ర్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. శ్రీకాకు ళం జిల్లాలో కింజరాపు అచ్చన్నాయుడు ఆధిపత్యం కొనసాగాలని కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వలేద ని, అదే సందర్భంలో కిమిడి అసంతృప్తి గురి కాకూడదని ఉద్దేశ్యంతో ఆయన మరదలైన మృణాళినికి విజయనగరం జిల్లా తరపున మంత్రి పదవి ఇచ్చారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన పతివాడ నారాయణస్వామినాయుడికి మొండి చేయి చూపారని ధ్వజమెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ ఆధిపత్యం ఉండేలా, విజయనగరం జిల్లాలో కళా వెంకటరావు హవా కొనసాగేలా పథక రచన చేసి జిల్లా నేతలకు దెబ్బకొట్టారని మండి పడుతున్నారు. కోళ్ల లలితకుమారి వర్గీయులు ఇదే తరహాలో విరుచుకుపడుతున్నారు. కాకపో తే, ప్రత్యేకంగా సమావేశం కాలేదు. ఈనెల 12వ మంత్రి విస్తరణ ఉందని, ఆ రోజు బెర్త్ దక్కకపోతే బయటపడదామ నే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. వెల మ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని, ఆ ఛాన్స్ తనకే వస్తుందని ఆశతో కోళ్ల లలితకుమారి ఉన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే రోడ్డెక్కొద్దని తన అనుచరులను కోళ్ల సముదాయించి నట్టు తెలిసింది. కక్కలేక, మింగలేక చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మంత్రి పదవి ఆశించిన పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. తమ ఆవేదనను బయటపెడితే అధినేత కన్నెర్ర చేస్తారేమోనని భయపడుతున్నారు. రోడ్డెక్కితే భవిష్యత్‌లో వచ్చే అవకాశాలను కోల్పోతామేమోనన్న అభద్రతా భావంలో ఉన్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా బయటపడకుండా తమ అనుచరుల చేత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం పతివాడకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక సమావేశం లో నెల్లిమర్ల నియోజకవర్గ నేతలు నిర్ణయించుకున్నారు. ఈనెల 12న విశాఖ క్యాబినెట్ సమావేశం నిర్వహించినప్పు డు నేతలందరు కలిసికట్టుగా వెళ్లి చంద్రబాబు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వనున్నారు. ఒకవేళ విశాఖలో క్యాబినెట్ సమావేశం జరగకపోతే హైదరాబాద్ వెళ్లి కలవాలని నిర్ణయించారు. అదే విధంగా మంగళవారం అశోక్ బంగ్లాకు వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. పెదతాడివాడలో జరిగిన సమావేశంలో నెల్లిమర్ల మండలం నుంచి సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు, బొంతు వెంకటరమ ణ, అవనాపు సత్యనారాయణ, కర్రోజు వెంకట రాజినాయుడు, చింతపల్లి వెంకటరమణ, పూసపాటిరేగ మండలం నుంచి మహంతి చిన్నంనాయుడు, ఆకిరి ప్రసాద్, భూలొక, డెంకాడ మండలం నుంచి కంది చంద్రశేఖర్, పల్లి భాస్కరరావు, పతివాడ అప్పలనాయుడు, భోగాపురం మండలం నుంచి కర్రోతు బంగార్రాజు, కర్రోతు సత్యనారాయణ, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.