టీడీపీ తీరుపై చిత్తూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు
కాకినాడ : తెలంగాణలో అడ్రస్ గల్లంతవుతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ ప్రాంతంలో పార్టీని కాపాడుకునేందుకే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ మైండ్‌గేమ్ ఆడుతోందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. కాకినాడ వచ్చిన ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా కేడర్ బలంగా ఉందని బీరాలు పలుకుతూ, ఇక్కడ మాత్రం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఎంత నమ్మక ద్రోహం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారో సీఎం తనయుడు లోకేష్ గ్రహించాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజలతోను, ప్రజలు తమ పార్టీతోను ఉన్నారని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని నారాయణస్వామి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు టిక్కెట్లు ఖరారు చేస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇస్తే.. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే తాము ఎప్పుడూ ఇలాంటి ప్రచారం చేసుకోలేదని అన్నారు. రాజకీయ అజ్ఞానంతో, తమ అనుకూల పత్రికలతో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విమర్శించారు.
అన్ని మతాలనూ ఆదరించే హిందూ మతాన్ని సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట అని, అందుకు గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనమని అన్నారు. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి తనయుడికీ లేని ఆదరణ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని, ఎక్కడికి వెళ్లినా ఆయనను తమ కుటుంబంలోని పెద్ద కుమారుడిలా ఆదరిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇదో గొప్ప విషయమని అన్నారు. కులాలను రెచ్చగొట్టి పరిపాలన సాగించడంలో చంద్రబాబే దిట్టని విమర్శించారు. ముద్రగడ ఉద్యమాన్ని సైతం జగన్‌మోహన్‌రెడ్డి వెనక ఉండి నడిపించారంటూ తప్పుడు విమర్శలు చేశారని నారాయణస్వామి అన్నారు.
అక్కడ అడ్రస్ గల్లంతైనందునే.. ఇక్కడ మైండ్‌గేమ్
Published Sun, Feb 14 2016 12:42 AM | Last Updated on Tue, Oct 30 2018 4:56 PM
Advertisement