పోలీసులా? టీడీపీ కార్యకర్తలా?
మా పార్టీవారిపై టీడీపీ కార్యకర్తలు తెగబడుతుంటే స్పందించేది లేదా..?
ఫిర్యాదు చేస్తే కౌంటర్ కేసులు పెడతారా
డీఎస్పీ వైఖరి మరీ దారుణం
పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి ఆగ్రహం
చిత్తూరు: పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షాన్ని, ఆ పార్టీ కార్యకర్తలను వేధించడానికే అన్నట్టు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నా ఉత్సవ విగ్రహాల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని పోలీసులకు విన్నవించుకుంటే కౌంటర్ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ లక్ష్మీ నాయుడు టీడీపీ కండువా కప్పుకున్న నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టొద్దని సాక్ష్యాత్తు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చెప్పినా డీఎస్పీ వినడటం లేదన్నారు. ఎస్పీ ఆదేశాలకే దిక్కులేకపోతే ఇక ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రౌడీల్లా జన్మభూమి కమిటీ సభ్యులు..
జిల్లాలో జన్మభూమి కమిటీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తూ ప్రజలను భయపెడుతున్నారని నారాయణస్వామి విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ ఇంటి సొత్తన్నట్లు కమిటీ సభ్యులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చే కొన్ని ఇళ్లు, పింఛన్లు కూడా అనర్హులకు ఇస్తుంటే అర్హులు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి సభల్లో అధికారులను డమ్మీలుగా నిలబెట్టారని విమర్శించారు.
జగన్ అధికారంలోకి వస్తేనే న్యాయం..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ తెస్తారన్నారు. వికలాంగులు, వితంతువుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పడతారని అన్నారు.