టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
జిల్లా తమ్ముళ్లపై చంద్రబాబు తన రాజకీయాన్ని ప్రదర్శించారు. కిమిడి మృణాళినికి పదవిచ్చి జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించినట్టు పైకి కలర్ ఇస్తూ...మరో వైపు జిల్లాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకటరావుకు, శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి ఆధిపత్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు. దీని కోసం జిల్లాకు చెందిన సీనియర్లకు మొండిచేయి చూపారు. కచ్చితంగా తమ నేతలకే మంత్రి పదవులు వస్తాయని ఆశించిన పతివాడ నారాయణ స్వామి నాయుడు, కోళ్ల లలిత కుమారి వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. అధినేత తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండి పడుతున్నాయి. సీనియర్లకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఇచ్చి జిల్లాకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఇస్తామని ఊరించి చివరి నిమిషంలో మొండి చేయి చూపడాన్ని ఆయన అనుచరులు జీర్ణిం చుకోలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కిమిడి మృణాళిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించారని, అంతటితో ఆగకుండా గెలవగానే మంత్రి పదవి కట్టబెట్టారని ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు.
పొరుగు జిల్లా నేతైన మృణాళినికి మంత్రి పదవి ఇచ్చి ఆ సామాజిక వర్గానికి చెందిన పతివాడ నారాయణస్వామినాయుడుకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్‌గా, విధేయుడిగా ఉన్న పతివాడకు మంత్రి పద వి ఇస్తామని ఊరించారని, పత్రికలు, ఛానళ్లలో కూడా పెద్ద ఎత్తున కథనాలొచ్చాయని కానీ చివరి నిమిషంలో మొండి చేయి చూపడం విచారకరమని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డెంకాడ మం డలం పెద తాడివాడలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమై చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. పార్టీలో చంద్రబాబు కన్నా సీనియర్ అయిన పతివాడకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆక్షేపణీయమన్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందం గా చంద్రబాబు వ్యవహరించారని ఆ పా ర్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. శ్రీకాకు ళం జిల్లాలో కింజరాపు అచ్చన్నాయుడు ఆధిపత్యం కొనసాగాలని కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వలేద ని, అదే సందర్భంలో కిమిడి అసంతృప్తి గురి కాకూడదని ఉద్దేశ్యంతో ఆయన మరదలైన మృణాళినికి విజయనగరం జిల్లా తరపున మంత్రి పదవి ఇచ్చారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన పతివాడ నారాయణస్వామినాయుడికి మొండి చేయి చూపారని ధ్వజమెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ ఆధిపత్యం ఉండేలా, విజయనగరం జిల్లాలో కళా వెంకటరావు హవా కొనసాగేలా పథక రచన చేసి జిల్లా నేతలకు దెబ్బకొట్టారని మండి పడుతున్నారు. కోళ్ల లలితకుమారి వర్గీయులు ఇదే తరహాలో విరుచుకుపడుతున్నారు. కాకపో తే, ప్రత్యేకంగా సమావేశం కాలేదు. ఈనెల 12వ మంత్రి విస్తరణ ఉందని, ఆ రోజు బెర్త్ దక్కకపోతే బయటపడదామ నే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. వెల మ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని, ఆ ఛాన్స్ తనకే వస్తుందని ఆశతో కోళ్ల లలితకుమారి ఉన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే రోడ్డెక్కొద్దని తన అనుచరులను కోళ్ల సముదాయించి నట్టు తెలిసింది.
కక్కలేక, మింగలేక
చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మంత్రి పదవి ఆశించిన పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. తమ ఆవేదనను బయటపెడితే అధినేత కన్నెర్ర చేస్తారేమోనని భయపడుతున్నారు. రోడ్డెక్కితే భవిష్యత్‌లో వచ్చే అవకాశాలను కోల్పోతామేమోనన్న అభద్రతా భావంలో ఉన్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా బయటపడకుండా తమ అనుచరుల చేత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం
పతివాడకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక సమావేశం లో నెల్లిమర్ల నియోజకవర్గ నేతలు నిర్ణయించుకున్నారు. ఈనెల 12న విశాఖ క్యాబినెట్ సమావేశం నిర్వహించినప్పు డు నేతలందరు కలిసికట్టుగా వెళ్లి చంద్రబాబు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వనున్నారు. ఒకవేళ విశాఖలో క్యాబినెట్ సమావేశం జరగకపోతే హైదరాబాద్ వెళ్లి కలవాలని నిర్ణయించారు.
అదే విధంగా మంగళవారం అశోక్ బంగ్లాకు వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. పెదతాడివాడలో జరిగిన సమావేశంలో నెల్లిమర్ల మండలం నుంచి సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు, బొంతు వెంకటరమ ణ, అవనాపు సత్యనారాయణ, కర్రోజు వెంకట రాజినాయుడు, చింతపల్లి వెంకటరమణ, పూసపాటిరేగ మండలం నుంచి మహంతి చిన్నంనాయుడు, ఆకిరి ప్రసాద్, భూలొక, డెంకాడ మండలం నుంచి కంది చంద్రశేఖర్, పల్లి భాస్కరరావు, పతివాడ అప్పలనాయుడు, భోగాపురం మండలం నుంచి కర్రోతు బంగార్రాజు, కర్రోతు సత్యనారాయణ, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.