మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణస్వామి
పుత్తూరు: ‘నేను సత్యవేడు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేశాను. బీ ఫామ్ ఇస్తారు.. అభిమానిస్తారు.. కానీ దగ్గరుండి ఓడించారు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు.. 2004లో తొలిసారి నేను ఎమ్మెల్యేగా గెలవడానికి అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడుది కీలకపాత్ర.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాపై నమ్మకంతో మూడోసారి పార్టీ టికెట్ ఇస్తే... నా కోసం 7 రోజులు సత్యవేడులో ప్రచారం నిర్వహించింది ముద్దుకృష్ణమే... ఎన్నికల ఖర్చు కోసం ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.. అందుకే పాడి మోశాను.’
అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తన మనోగతాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం పట్టణంలోని ద్రౌపదీదేవి ఆలయ తోపులో జరిగిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సంతాప సభలో ఆయన మాట్లాడారు. ముద్దుకృష్ణమనాయుడికీ తనకు మధ్య ఉన్నది కల్మషం లేని సంబంధమని చెప్పారు. కేవలం వ్యక్తిగతమైదే తప్ప రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నాలుగు నెలల క్రితం బైపాస్ సర్జరీ చేసుకున్న ముద్దుకష్ణమ తన ఇంటికి వచ్చినప్పుడు కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే చర్చకు వచ్చాయి తప్ప రాజకీయాలు రాలేదని తేల్చి చెప్పారు. దీనికి కొందరు పెడార్థాలు తీయడం దురదృష్ణకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం జీవితాన్ని ధారబోసిన ముద్దుకృష్ణమనాయుడు ఆత్మకుశాంతి కలగాలని ప్రార్థించారు. సత్యవేడు సమన్వయకర్త కోనేటి ఆదిమూలం, ఎంపీపీ గంజి మాధవయ్య, మున్సిపల్ చైర్మ న్ యుగంధర్, వైస్ చైర్మన్ ఆనంద్, నాయకులు జయప్రకాష్, విజయబాబు, కేటీ ప్రసాద్‌రెడ్డి, గణేష్, షణ్ముగరెడ్డి, కరుణాయాదవ్, జీవరత్నంనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment