శరత్‌కుమార్‌కు షాక్
పలువురు నేతల టాటా
ఎమ్మెల్యే నారాయణన్ కూడా
చీలికకు కుట్ర పన్నారని అధినేత ఆవేదన
సాక్షి, చెన్నై: సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్‌ఎంకే)లో విభేదాలు బయట పడ్డాయి. ఆ పార్టీ అధినేత శరత్‌కుమార్‌కు షాక్ ఇచ్చే రీతిలో పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు.ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ కూడా హ్యాండ్ ఇచ్చారు. తన పార్టీలో చీలికకు కుట్ర జరుగుతున్నదని శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలో 2007లో ఎస్‌ఎంకే ఆవిర్భవించింది. నాడర్ సామాజికవర్గంతో నిండి ఉన్న ఈ పార్టీ గత అసెంబ్లీ ఎ న్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించింది.
నాడర్ పేరవై ఎస్‌ఎంకేలోకి చేరడంతో ఆ పేరవై నేత ఎర్నావూర్ నారాయణన్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కింది. నాంగునేరి నుంచి నారాయణన్, తెన్‌కాశి నుంచి శరత్‌కుమార్ ఎన్నికల బరిలో నిలబడి అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల మీద గెలిచారు. పేరుకు ఎస్‌ఎంకేలో ఉన్నా, ఇద్దరు అసెంబ్లీలో అన్నాడీఎంకే సభ్యులుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల దక్షిణ భారత సినీ నటీ నటుల సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ మరోమారు పోటీ చేసి కంగు తిన్నారు. తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేకు శరత్‌కుమార్ దూరంగానే ఉంటూ వస్తున్నారని చెప్పవచ్చు.
అదే సమయంలో రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంగా శరత్‌కుమార్ వ్యవహార శైలి మారి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ సమయంలో శరత్‌కుమార్‌కు షాక్ ఇస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజన్, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి ఐస్ హౌస్ త్యాగులతోపాటుగా పలువురు నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎంకే నుంచి బయటకు రావడమే కాదు, బీజేపీ గూట్లోకి చేరారు. అలాగే ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ సైతం శరత్‌కుమార్‌కు హ్యాండ్ ఇచ్చారు. శరత్‌కుమార్ వ్యవహార శైలిని విమర్శిస్తూ, గురువారం ఏకంగా మీడియా ముందుకు వచ్చారు.
అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో శరత్‌కుమార్ వ్యవహరించేందుకు సిద్ధం అవుతున్నారని, ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ఒత్తిడి తెచ్చారని, అందుకే తానూ వ్యతిరేకంగా వ్యవహరిచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అన్నాడీఎంకే చిహ్నం మీద గెలిచిన దృష్ట్యా, తాను మాత్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యేనే అని పేర్కొన్నారు. తనను అన్నాడీఎంకే ఆదరించిందని, రానున్న ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలిసి తన పయనం సాగుతుందన్నారు. ఇక ఎస్‌ఎంకే వ్యవహారంగా మున్ముందు తీసుకోబోయే చర్యలన్నీ చట్టపూర్వకంగానే ఉంటాయంటూ, ఆ పార్టీని చీల్చే దిశగా ముందుకు సాగుతోన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక, పార్టీ విబేధాలు రచ్చకెక్కడంతో శరత్‌కుమార్ మేల్కొన్నారు.
చీలికకు కుట్ర: టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శరత్‌కుమార్ ఆగమేఘాలపై జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పార్టీ కమిటీ భేటీ అనంతంరం పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారందరనీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతున్నదని మీడియా ముందు శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లు నాంగునేరి ప్రజలకు ఎర్నావూర్ నారాయణన్ ఏమి చేశారో అందరికీ తెలుసునని మండి పడ్డారు. ఇప్పుడు కూడా అన్నాడీఎంకేతో కలిసి ఎస్‌ఎంకే పయనం సాగిస్తున్నదని, రానున్న ఎన్నికల సమయంలో తదుపరి పార్టీ కార్యవర్గం తీర్మానాలకు మేరకు నిర్ణయాలు ఉంటాయని, ప్రస్తుతం మాత్రం అన్నాడీఎంకేలోనే ఉన్నామని స్పష్టం చేశారు.