బాబు హామీలపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నారాయణస్వామి
తిరుపతి మంగళం : పేదరికానికి కులమతాలు లేవని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ లో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.2లక్షలు మంజూరు చేస్తామన్న చంద్రబాబు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుపేదలు ఉండడానికి గూడులేక, ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బం దు లు పడుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా పేదలకు 3సెంట్ల భూమి కాదు కదా, 3 అంకణాలు కూడా ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూ పంపిణీ చేయకపోవడం చంద్రబాబు నయవంచనకు నిదర్శమన్నారు. నమ్మినవాళ్లను నట్టేట ముంచ డం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేయించడంలో మంత్రి రావెల కిషోర్‌బాబు నిర్లక్ష్యం చూపుతూ సాటి కులస్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాల్సిన మంత్రి సబ్‌ప్లాన్‌పై నోరు మెదపకపోవడం చూస్తే వారి పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందని తెలిపారు.