దళితులపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన జన్మ భూమి సభలో గ్రామస్తులు సమస్యలు ఏకరువు పెట్టడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. దళితులమైన తమకు దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు ఇతర సదుపాయాలను ఇవ్వడంలేదని విన్న వించుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మీకు ఇచ్చేదేలేదు. ఏమి చేసుకుంటారో చేసుకోండని మైకు వారిపైకి విసిరేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేదికపై నుంచి వెళ‍్లిపోతూ తనకు తెలియకుండా వీరికి ఏ పథకం వర్తింపచేయవద్దని, తాను అనుమతిస‍్తేనే పింఛన్లులు గానీ, గ్యాస్ కనెక‍్షన్ గానీ ఇవ్వాలని హుకుం జారీచేశారు. ఎమ్మెల్యే తీరు చూసి జన్మభూమి సభకు హాజరైన దళితులు నిరసన వ్యక్తం చేశారు. తాము చేసుకున‍్న పాపం ఏమిటని, ప్రభుత్వ పథకాలు తమకు ఎందుకు మంజూరు చేయరని ప్రశ్నించారు.