నేడు వైఎస్సార్‌సీపీ నిరసన
⇒నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
⇒ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమపథం
⇒ఫిరాయింపుదారులకు అగ్రాసనమా..?
⇒ఫిరాయింపు ఎమ్మెల్యేలతోరాజీనామా చేయించాలి
⇒వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి
కార్వేటినగరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అలా చేయడం లేదన్నారు. ముస్లిం మైనారిటీలు,ఎస్టీలను విస్మరించి వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. అప్రజాస్వామికమైన ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు, నిరసన గళాన్ని వినిపించేందుకు పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా చేపట్టే ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసామ్యవాదులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం దష్టికి కూడా తీసుకు వస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్, గవర్నర్ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. 21మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు విన్నవిస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామం అపహాస్యమైందని, సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. ఇంత దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదని తెలిపారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని పేర్కొన్నారు.