ఫిరాయింపుదారులకు కీలక శాఖలు
- ప్రత్తిపాటి, కొల్లు, శిద్ధా, పరిటాలకు ప్రాధాన్యం తగ్గింపు
- లోకేశ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు వారికి కీలక శాఖలు కేటాయించారు. సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియలకు ముఖ్యమైన శాఖలు కేటాయించారు. ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 11 మందికి శాఖలు కేటాయించారు.ఇప్పటికే మంత్రులుగా ఉన్న పలువురి శాఖలను చంద్రబాబు మార్చారు.
చినబాబుకు కీలకమైన శాఖలు..
కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న తన కుమారుడు లోకేశ్‌కి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు అప్పగించారు. ఇప్పటివరకూ ఆశాఖ నిర్వహించిన అయ్యన్నపాత్రుడికి అంతగా ప్రాధాన్యం లేని ఆర్‌అండ్‌బీ శాఖను అప్పగించడం గమనార్హం. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తొలుత చేపట్టిన శాఖల్నే చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ కు అప్పగించడం విశేషం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతపై తరచూ వ్యక్తిగత విమర్శలు చేసే అచ్చెన్నాయుడికి రెండు కీలక శాఖలు అప్పగించారు. ఉద్వాసన నుంచి తప్పిం చుకున్న ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, శిద్ధా రాఘవరావులతోపాటు సరిగా పనిచేయడం లేదని భావిస్తున్న పరిటాల సునీతకు అప్రాధాన్య శాఖలిచ్చారు.
పుల్లారావు నిర్వహించిన శాఖలను విడగొట్టి సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు అప్పగించారు. కొల్లు రవీంద్ర వద్ద ఉన్న రెండింటిలో బీసీ సంక్షేమ శాఖను అచ్చెన్నాయుడికి, ఎక్సైజ్‌ను జవహర్‌కు కేటాయించారు. రవీంద్రకు న్యాయ, క్రీడలు, యువజన సర్వీసులు కేటాయించారు. శిద్ధా రాఘవరావు నిర్వహించిన రవాణా, ఆర్ అండ్ బీ శాఖలను విభజించి రవాణా ను అచ్చెన్నాయుడికి, ఆర్‌అండ్‌బీని అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు. పరిటాల సునీత చేపట్టిన పౌరసరఫరాల ను పుల్లారావుకు ఇచ్చి ఆమెకు పీతల సుజాత నిర్వహించిన శాఖల్లో ఒకటైన స్త్రీ శిశు సంక్షేమ శాఖను అప్పగించారు.
కాల్వకు సమాచార పౌరసంబంధాలు
పల్లె రఘునాథ్‌రెడ్డి నిర్వహించిన సమాచార, పౌర సంబంధాలను కాల్వ శ్రీనివాసులకు కేటాయించారు. రావెల కిశోర్‌బాబు నిర్వహించిన సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలను నక్కా ఆనంద్‌బాబుకు, అచ్చెన్నాయు డు నిర్వహించిన కార్మిక శాఖను పితాని సత్యనారాయ ణకు అప్పగించారు. తన వద్దే ఉంచుకున్న విద్యుత్ శాఖను కళా వెంకట్రావుకు, న్యాయ శాఖను కొల్లు రవీంద్రకు, పరిశ్రమల శాఖను అమర్‌నాథ్‌రెడ్డికి, పర్యాట క శాఖను అఖిల ప్రియకు బాబు కేటాయించారు. పెట్టుబ డులు, మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమ మాన్ని తన వద్దే ఉంచుకున్నారు. ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పతోపాటు మంత్రు లు నారాయణ, యనమల, గంటా, దేవినేని ఉమతో పాటు మిత్రపక్షం బీజేపీకి చెందిన పైడికొండల మాణి క్యాలరావు, కామినేని శాఖల్లో మార్పు చేయలేదు.