టీడీపీకి అంతకంటే ఇచ్చేందుకు సానుకూలంగా లేని బీజేపీ
మరోసారి పౌర విమానయానమే తీసుకోవాలని సూచన
కీలక శాఖలు, స్పీకర్ పదవికి నో.. డిప్యూటీ స్పీకరైతే సరే
జేపీ నడ్డాతో చంద్రబాబు మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా కొలువుదీరనున్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలు అడుగుతున్నన్ని కేబినెట్ బెర్త్‌లు, కీలక శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కోరుతున్నట్లుగా ఐదు కేబినెట్ పదవులతో పాటు స్పీకర్ పదవి ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు సమాచారం.
టీడీపీకి ఒక కేబినెట్ మంత్రిత్వ శాఖతో పాటు రెండు సహాయక మంత్రి పదవులను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాఖల కేటాయింపుపై చంద్రబాబు శుక్రవారం రెండో దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర పెద్దలతో చర్చించినా సానుకూల ఫలితం దక్కలేదని తెలుస్తోంది.
కీలక శాఖలు ఇవ్వలేం..!
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరనున్న మోదీ ప్రభుత్వంలో కీలకమైన హోం, ఆర్ధిక, రక్షణ, రైల్వే, న్యాయ, ఐటీ, రోడ్లు, రహదారుల శాఖలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ పెద్దలు నిరాకరించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖతో పాటు పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృధ్ధి, ఐటీ కమ్యూనికేషన్లు, నౌకాయాన శాఖలను టీడీపీ కోరినట్లు తెలిసింది. దీనికి అదనంగా స్పీకర్ పదవి కూడా తమకే ఇవ్వాలని అడిగినట్లు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ పెద్దలు ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.
2014లో మాదిరిగానే పౌర విమానయాన శాఖతో పాటు సహాయ శాఖల్లో కీలక శాఖలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ కీలక సహాయ శాఖలు ఆర్ధిక లేదా జల శక్తి శాఖ కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. స్పీకర్ పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019లో ఎన్‌డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని అసలు కేటాయించలేదు. కేవలం స్పీకర్‌తోనే లోక్‌సభ వ్యవహారాలను నిర్వహించగా ప్రొటెం స్పీకర్‌లతో సభను నడిపించారు. 2014లో మాత్రం అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై, జార్ఖండ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత కరియా ముండా డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించారు.
మోదీతోపాటే ప్రమాణం..!
మంత్రి పదవులు, శాఖలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు విడిగా చర్చించారు. ప్రాధాన్యతలను ఆయన దృష్టికి తెచ్చారు. నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో తమ పార్టీ వారు కచ్చితంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment