తిరుపతి రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడులోని తిరుత్తణికి పాదయాత్ర చేపట్టారు. సోమవారం తుమ్మలగుంటలో ఈ పాదయాత్రను ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. వంద కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్ర పల్లెల మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేతో పాటు పాదయాత్రలో నడిచారు. తిరుచానూరు జనసంద్రమైంది. సాయంత్రానికి పుత్తూరుకు చేరుకున్నారు.
రాత్రికి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం 7 గంటలకు బయల్దేరి 16 గంటలపాటు సుమారు 41 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి సాయంత్రానికి తిరుత్తణికి చేరుకుంటారు. దేశ చరిత్రలో ఏ ప్రతిపక్షనేత కూడా మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాఖలాలు లేవని, జగన్ చేసే ప్రజాసంకల్ప మహా పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. జగన్‌కు మద్దతుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు.
ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకే వైఎస్ జగన్ పాదయాత్రను చేపడుతున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తపించే నేత జగన్ అని ఎమ్మెల్యే నారాయణస్వామి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment