
ఒంగోలు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను అధికారపార్టీ అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. జగన్ పాదయాత్ర ప్రకటించినప్పటి నుంచి టీడీపీలో భయం మొదలైందని, అందుకే యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కడైనా తిరగవచ్చని అన్నారు. గత మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. చివరికి అర్హులైన ఎంతోమంది వృద్ధుల పింఛన్లు సైతం తొలగించిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. ప్రజల ఇబ్బందుల్ని గుర్తించి వారికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలు సైతం వారి సమస్యలను ఆయనకు తెలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర జరుగుతుందన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత అన్ని వర్గాల ప్రజలతో నేరుగా మమేకమవుతారని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామని వైవీ చెప్పారు.