
ఎమ్మెల్సీగా యండపల్లెను గెలిపిద్దాం
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
పీలేరు: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న యండపల్లె శ్రీనివాసులరెడ్డిని గెలిపిద్దామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ మార్చి 9వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉద్యమనేత, నిగర్వి అయిన శ్రీనివాసులరెడ్డిని గెలిపించాల్సిన గురుతర భాద్యత మనందరిపైనా ఉందన్నారు. కార్పొరేట్ శక్తుల నుంచి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
కార్పొరేట్ శక్తుల జిమ్మిక్కులు, ప్రలోభాలకు గురికాకుండా విద్యారంగ పరిరక్షణకు నిరంతరం పోరాడుతున్న యండపల్లెను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే ఉన్నత విద్య ప్రయివేటీకరణ దిశగా వెలుతోందని, ఇక ఈ ఎన్నికల్లో కార్పొరేట్ శక్తులను గెలిపిస్తే ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపారు. కౌన్సిల్‌లో విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలను ప్రశ్నించే ఎమ్మెల్సీల గొంతు నొక్కాలని అధికార పార్టీ ఎత్తుగడలో భాగంగానే కార్పొరేట్ దిగ్గజాలను పోటీలో నిలిపిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, నిరక్షరాస్యత, బడుల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యండపల్లె శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.