
జాతీయ ప్లీనరీకి తరలిరండి
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపు
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించనున్న పార్టీ జాతీయస్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లాస్థాయి ప్లీనరీలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని.. జాతీయ ప్లీనరీకి కూడా జిల్లాలోని పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫేస్టోలో 600కు పైగా హామీలను చంద్రబాబు గుప్పించారని, అధికారం చేపట్టాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అలాగే నియోజకవర్గాల్లో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార ప్రాజెక్టు, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కిడ్నీవ్యాధి బాధితుల సమస్య, పలాసలో ఆఫ్‌షోర్, టెక్కలిలో భావనపాడు హార్బర్, ఇలా ఒక్కో నియోజకవర్గంలో నాలుగైదు సమస్యలు ఉన్నాయన్నారు. వీటన్నింటిపై జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించామన్నారు.
జాతీయస్థాయి ప్లీనరీలో జిల్లా సమస్యలను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వై?ఎస్సార్ సీపీ విజయం సాధించి.. జిల్లా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్లీనరీలో చర్చించనున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ప్రజల నమ్మకం, భరోసా, విశ్వాసం పొందిన నాయకునిగా ఆయన గుర్తింపు పొందారన్నారు.