విశ్వాసం కోల్పోతున్న బాబు
- ఆయనది నియంతృత్వ, అణచివేత ధోరణి
- దుష్టపాలనకు ప్రజలు సమాధి కట్టాలి
- ఉరవకొండ ప్లీనరీలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు
- సీఎం డ్యాష్ బోర్డులో కరువు కనిపించలేదా? - మాజీ ఎంపీ అనంత ధ్వజం
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ప్లీనరీ శుక్రవారం కూడేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నియంతృత్వ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. తన పాలన పట్ల, ఎమ్మెల్యేల పట్ల విశ్వాసం లేక ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. తద్వారా వైఎస్సార్‌సీపీలో అయోమయం సృష్టించాలని భావించారని, అయితే.. ప్రజలు పూర్తిగా అండగా నిలవడంతో చంద్రబాబు కుయుక్తులు పటాపంచలయ్యాయని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అత్యంత హేయం, దిగజారుడు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో 144 సెక‌్షన్, 30 యాక్ట్ లేకుండా పాలించలేని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ దుష్టపాలనకు సమాధి కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకే ప్లీనరీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పని చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో కొండంత అభిమానం ఉందన్నారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది
టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఏమాత్రమూ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తోందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోనైతే పయ్యావుల సోదరులు చెప్పినట్లే అధికారులు వింటున్నారని మండిపడ్డారు. చివరకు ఇంట్లో అన్నదమ్ములు విడిపోయి భూముల పట్టాదారు పాసుపుస్తకాలు సపరేటుగా చేయించుకోవాలన్నా ముందుగా అధికార పార్టీ నేతలను ఒప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. మూడేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వరుస కరువులతో జిల్లా రైతులు అల్లాడుతున్నా సీఎం డ్యాష్‌బోర్డులో చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. జిల్లాకు హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు వచ్చాయంటే అది వైఎస్ ఘనతే అని పునరుద్ఘాటించారు. ఇప్పుడేమో తామే నీళ్లు తెప్పించామంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది జిల్లాకు 38 టీఎంసీలు నీళ్లొచ్చాయని చెబుతున్న పాలకులు 38 ఎకరాల సాగుకైనా అందించారా అని నిలదీశారు. దీనిపై జిల్లాలోని ఎంపీలు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబును అడిగే దమ్ము, ధైర్యం లేదన్నారు. పార్టీ మారితే సమస్యలు సమసిపోయినట్లేనా అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చురకలంటించారు.
దోచుకోవడమే తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదు
చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబు రాష్ట్రానికి శనిలా మారారన్నారు. తరచూ సింగపూర్, జపాన్ అంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో జిల్లా మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దోచుకుంటున్నారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా...మంత్రి సునీత రూ.1100 కోట్లతో అంచనాలు వేయిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆడిన రెయిన్‌గన్ల డ్రామాలో రూ. 300 కోట్లు దోపిడీ చేశారన్నారు. వాతావరణ బీమా కాకుండా పంటల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పగించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా తీర్పునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహమ్మద్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుంతకల్లు సమన్వయకర్త వెంకటరామిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి ప్రణయ్‌కుమార్‌రెడ్డి, మునిరత్నం శీనా, పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలె జయరాంనాయక్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.