
వైఎస్ జగన్ 'రైతు భరోసా యాత్ర' ప్రారంభం
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి చేపట్టిన నాలుగో విడత 'రైతు భరోసా యాత్ర' ప్రారంభమైంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 డిసెంబర్ 31 నాటికి అనంతపురం జిల్లాలో 146 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ యాత్ర ప్రారంభించారు.
ధర్మవరంలోని వైఎస్ఆర్ కాలనీలోని రమేష్, రమాదేవి దంపతుల కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఇటీవల రమేష్ దంపతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బుధవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు ఎమ్మెల్యే చాంద్ బాషా, శంకర్ నారాయణ, శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి ఘన స్వాగం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొడికొండ చెక్‌పోస్టు మీదుగా ధర్మవరం పట్టణానికి చేరుకున్నారు. భరోసా యాత్రను ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మూడు విడతల్లో 42 కుటుంబాలను పరామర్శించారు. నాలుగో విడత 'భరోసా యాత్ర'ను బుధవారం నుంచి 7 రోజులపాటు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొనసాగించనున్నారు.