
ప్రశ్నపత్రమా...టీడీపీ కరపత్రమా!
– వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు
అనంతపురం ఎడ్యుకేషన్ : కాకినాడ జేఎన్‌టీయూ బీటెక్ సెమిస్టర్ ప్రశ్నపత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను పేర్కొని వారి వ్యాపారాలను పొందుపరచడం చూస్తుంటే అది ప్రశ్నపత్రమా లేక తెలుగుదేశం పార్టీ కరపత్రమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలాంబాబు అన్నారు. ప్రశ్నపత్రం తయారు చేసిన వీసీ, ప్రొఫెసర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇలాంటి ప్రశ్నలు అడగడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. జేఎన్‌టీయూ(కే) వీసీ ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు ఆయన కుటుంబ సభ్యులు, వారి వ్యాపారాల గురించి ప్రశ్నపత్రంలో రూపొందించారని ధ్వజమెత్తారు. ఇది విద్యార్థి లోకాన్ని అవమాన పరచడమేనన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్‌కు విన్నవిస్తామన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు పాల్గొన్నారు.