విహరిద్దాం!
♦ త్వరలో జెడ్పీటీసీ సభ్యుల స్టడీ టూర్
♦ ప్రభుత్వానికి లేఖ రాసిన చైర్‌పర్సన్ సునీత
♦ మాకూ అవకాశం కల్పించండి : ఎంపీపీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు (జెడ్పీటీసీలు) స్టడీ టూర్‌కు రెడీ అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పయనమవుతున్నారు. పంచాయతీ పాలన అధ్యయనానికి కేరళను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుల అభ్యర్థనకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. సభ్యుల విజ్ఞానయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రభుత్వ పథకాలు, ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల బలోపేతానికి అవలంబిస్తున్న విధానాలను లోతుగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం సర్వసాధారణం. అయితే, ఈ పర్యటనలు కాస్తా విందు వినోదాలతో విహారయాత్రలుగా మారడంతో వీటి అనుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించింది. స్టడీ టూర్‌ల పేరిట సాగే పర్యటనలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా, ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యులు గగన విహారం చేయడంతో వారి బాటలోనే మన జిల్లా సభ్యులు నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనుకున్నదే త డువుగా ప్రభుత్వ క్లియరెన్స్ కోసం లేఖ రాశారు. ఇదిలావుండగా, జెడ్పీటీసీల యాత్రలో తమకు చోటు కల్పించాలని సోమవారం మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి ఎంపీపీలు విన్నవించుకోవడం గమనార్హం.