దీపావళి.. తెలుగు వారి గుమ్మం ముంగిట ఆనంద తోరణాలుగా ప్రమిదలు వెలుగులు కురిపిస్తుంటాయి. ఇంటి ముందు పేల్చే చిచ్చుబుడ్లు వారి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా నిలుస్తాయి. రాకెట్లు వారు అందుకోవాల్సిన గమ్యాలను గుర్తు చేస్తాయి. భూచక్రం మన మనసు చేసే పరిపరి ఆలోచనలకు ప్రతిబింబంగా మారుతాయి. ఇలా ఎన్నో పరమార్థాలు దాచుకున్న పండగే దీపావళి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు.
ఇక దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి మాటలు సరిపోవనుకున్నారో ఏమో కానీ సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన పాటలు తక్కువే అయినప్పటికీ వాటి మహత్యం మాత్రం చిన్నపాటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో వచ్చిన పాటల వైభవం ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ.. విచిత్రబంధం సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన ‘జీవితమే ఒక దీపావళి.. చీకటి వెలుగుల రంగేళీ’. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని దీపావళి పాట ఇది. తరాలు మారుతున్నా ఆదరణ తగ్గని పాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
దీపావళిని ఇముడ్చుకున్న మరిన్ని పాటలు..
దీపావళి - వచ్చింది నేడు దీపావళి.. పరమానంద మంగళ శోభావళి
షావుకారు - దీపావళి.. దీపావళి... ఇంటింట ఆనంద దీపావళి అంటూ సంతోషంలో పాడుకోగా.. దీపావళి, మా ఇంట శోకాంధ తిమిరావళి అంటూ ఇదే సినిమాలో బాధలోనూ పాడుకున్నారు.
భలే రాముడు - ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, ఆ భాగ్యము రాదా
రుణానుబంధం - దీపాల పండుగ.. ఉన్నోళ్ళ డబ్బంతా దండుగ..
ఆ తరం నుంచి ముందుకు వస్తే..
మామగారు - వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి.. ఏనాడూ వెళ్లిపోని దీపావళి.. ఇయ్యాలె అచ్చమైన దీపావళి
పెళ్లికానుక - ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ.. ఆనందం పొంగేనోయి దీపావళి.. అని సంతోషంలో పాడుకోగా, ఆడేపాడే పసివాడ.. అమ్మా లేని నినుచూడ కన్నీటి కథ ఆయె దీపావళి అంటూ బాధలోనూ మార్చి పాడుకున్నారు.
విజయదశమి - దీపావళి..
రెబల్ - చెప్పలేని ఆనందం.. దివాళీ
దడ - దీవాళీ.. దీపాళీ..
ఇవే కాకుండా దీపావళి పండగపై ప్రత్యేక ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అదీగాక 'దివ్వి దివ్వి దీపావళి.. దిబ్బు దిబ్బు దీపావళి..' అంటూ పాడుకునే జానపద పాటలు మరెన్నో..
సినిమాల్లో దీపావళి..
‘దీపావళి’ టైటిల్‌తోఇప్పటికి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటిది 1960లోఎన్టీఆర్,సావిత్రిలు కృష్ణుడు సత్యభామలుగా నటించిన చిత్రం ‘దీపావళి’. ఇది పండగ ప్రాశస్త్యాన్ని చెప్పే పురాణ కథ .మరొకటి 2008లో వేణు హీరోగా వచ్చిన దీపావళి. దీపావళి సీన్‌లతో గట్టెక్కిన సినిమాలు ఉన్నాయి. కథను మలుపు తిప్పడానికి దీవాళిని వాడుకున్న చిత్రాలూ ఉన్నాయి. జనతా గ్యారేజ్‌లోనూ దీపావళిని పర్యావరణహితంగా ఎలా జరుపుకోవాలో హీరో సందేశాన్నిస్తాడు. పసి పిల్లోడు నుంచి పడుచు పిల్ల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి పండగకు ప్రాణం పోసే పాటలు, చిత్రాలు మరెన్నో రావాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment