సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు...అన్నారు పెద్దలు. సొంతింటి కలను సాకారం చేసుకోవడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికీ తెలుసు. అంత స్తోమత లేకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ‘హౌస్ çఫర్ ఆల్ పథకా’న్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘అందరికీ ఇళ్లు’ ఉండాలన్న లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమిటో నేటికీ స్పష్టత లేకపోయినా దాని నిర్మాణం పేరిట పూర్తి అజమాయిషీ చెలాయిస్తోంది. పోనీ అలా అయినా లబ్ధిదారులకు మేలు చేస్తుందా అంటే అదీ లేదు. నిర్మాణ బాధ్యతలను భుజానకెత్తుకుని ఇరుకు గదులు...ఆపై ‘సన్‌షేడ్ లేని ఇళ్లు, కప్ బోర్డుల్లేని గదులను నిర్మిస్తోంది. ఇవి చాలదన్నట్టు వాస్తు చూడకుండా నిర్మాణం చేపట్టేస్తున్నారు. ఇప్పుడీ నిర్మాణాలపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వస్తువులు భద్రపరుచుకోవడానికి వీల్లేని ఇళ్లు తమకెందుకని నిలదీస్తున్నారు. శనివారం ఆ ఇళ్ల పరిశీలనకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణకు ఆ అసంతృప్తి సెగ తాకింది.
కట్టిన ఇళ్లు నాలుగు కాలాలపాటు ఉండాలని భావిస్తారు. మళ్లీ మళ్లీ మదుపు పెట్టే పరిస్థితి ఉండకూడదని ఆలోచిస్తారు. అందుకే ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు దగ్గరి నుంచి అన్ని సౌకర్యాలున్నాయా లేవా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ఏదోరకంగా కట్టించి ఇచ్చేస్తాం....వాటిలోనే ఉండండన్నట్టుగా వ్యవహరిస్తోంది. వాస్తవంగా కొత్తగా నిర్మించినప్పుడే అన్నీ చూసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇలాగే కడతాం...ఏదైనా మార్పులు చేసుకోవల్సి వస్తే తర్వాత చేసుకోండన్నట్టుగా ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద పెద్దాపురంలో నిర్మిస్తున్న ఇళ్ల విషయంలో ముందుకెళ్తోంది. ఇప్పుడా ఇళ్లు మేడిపండు చందంగా తయారయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దాపురం పట్టణంలో తొలి విడతగా సుమారు 1734 ఇళ్ల నిర్మాణాలను ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద గృహ నిర్మాణం చేపట్టారు. రెండో దఫాగా సుమారు 1676 ఇళ్లు మంజూరు కాగా వాటిని కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక వాలుతిమ్మాపురం రోడ్డులో నిర్మించే ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఏపీ టిడ్‌కోకు అప్పగించగా ఓ బడా కంపెనీతో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇళ్ల నిర్మాణాలను మూడు విభాగాలుగా నిర్మిస్తున్న పాలకులు, అధికారులకు కూడా ఏ ప్లాన్ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో తెలియని ఆయోమయ స్థితిలో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. వరండా, గదులు కూడా ఇరుకుగా నిర్మించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్క ఇటుక వాడకుండానే అధునాతన టెక్నాలజీ పేరుతో స్లాబ్ పద్ధతిలో గోడ నిర్మాణాలు చేపడుతోంది. ఇదిలా ఉంటే గదుల్లో ఎక్కడా సన్‌షేడ్‌లుగాని, కప్ బోర్డులు గానీ లేవు. వీటి నిర్మాణం జోలికి వెళ్లలేదు. అవి లేకపోవడంతో లబ్ధిదారులు తమ వస్తువులు భద్రపరుచుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ దిశగా ఆలోచించ లేదు. ఇక కేటగిరీ 2 కింద చేపడుతున్న నిర్మాణాల్లో ఈశాన్యంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇది వాస్తుకు విరుద్ధమని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసలే అప్పు...ఆపై లోపాలా ?
ప్రభుత్వం నిర్దేశించిన మూడు కేటగిరీల్లోనూ లబ్ధిదారుడికి రూ.3 లక్షలకుపైగా రుణభారం పడుతుంది. దీన్ని చెల్లించుకోవడమే పేద, మధ్య తరగతి వారికి తలకు మించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో సన్ షేడ్‌ల్లేని ఇళ్లు, కప్‌బోర్డులు లేని గదులు నిర్మిస్తే వాటి కోసం మళ్లీ మదుపు పెట్టాల్సి ఉంటోంది. అలాగే వాటి కోసం కొత్త గోడలపైన పునర్నిర్మాణం చేయవల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి లబ్ధిదారులు నిలదీస్తుంటే ఏర్పాటు చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మంత్రి నారాయణకు నిరసన సెగ
ఇరుకు గదులు, సన్‌షేడ్‌లు, కప్ బోర్డుల్లేవన్న విషయాన్ని గుర్తించిన లబ్ధిదారులు శనివారం ఆ ప్రాంతానికి వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణను నిలదీశారు. మహిళలంతా మంత్రిని చుట్టుముట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక సన్‌షేడ్‌లు, కప్ బోర్డులు ఏర్పాటు చేస్తామని సర్దిచెప్పే ప్రయత్నం మంత్రి చేశారు.
పూర్తి స్థాయి వసతులు లేవు
అన్ని వసతులతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. కనీస వసతులు లేకుండా ఇరుకు గదులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. సన్‌సైన్, కప్ బోర్డులు లేకుంటే సామాన్లు పెట్టుకోవడానికి లేకుండాపోతుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
– సుందరపల్లి సుజాత, లబ్ధిదారులు, పెద్దాపురం.
రుణభారం తప్పదు... నాణ్యత కనబడడం లేదు
‘అందరికీ ఇళ్లు’ పేరిట ఇళ్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం లబ్ధిదారులకు రుణభారం తప్పడం లేదు. ఏళ్ల తరబడిగా ఇచ్చిన రుణాన్ని చెల్లించేందుకు సిద్ధపడ్డా కనీస ఇటుక లేని ఇళ్లు నిర్మిస్తున్నారు. ఎంతవరకు నాణ్యతగా నిలబడతాయో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆధునిక ఇళ్ల పేరిట విశాలమైన గదులు లేకుండా ఇరుకుగా నిర్మిస్తున్నారు. ప్రశ్నిస్తే చూడడానికి బాగున్నాయా..? లేదా...? అంటున్నారే తప్ప వసతులు కల్పిస్తున్న దాఖలాలైతే కనబడడం లేదు.
– కంపర పార్వతి, స్థానికులు, లబ్ధిదారు, పెద్దాపురం
Comments
Please login to add a commentAdd a comment