బెజవాడకే కిరీటం! | Andhra Pradesh capital to be located around Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడకే కిరీటం!

Published Fri, Sep 5 2014 12:30 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Andhra Pradesh capital to be located around Vijayawada

దాదాపు ఆరు దశాబ్దాల అనంతరం మళ్లీ ఒంటరి ప్రయాణం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌కు గత కొన్నిరోజులుగా అందరూ అనుకుంటున్నట్టే విజయవాడను రాజధాని నగరంగా ఎంపిక చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బెజవాడగా నామాంతరమున్న విజయవాడ భౌగోళికంగా చూస్తే రాష్ట్రం నడిబొడ్డున ఉంది. కృష్ణా నదీ తీరంలో కొలువు తీరిన ఈ నగరం రాజకీయంగా, సాంస్కృతికంగా సమున్నతమైన చరిత్రగలది.
 
పొరుగునున్న నిజాం రాజ్యంలో సాటి తెలుగు ప్రజలు భూస్వామ్య దోపిడీ, పీడనలపై పిడికిలెత్తినప్పుడు వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవడానికైనా... తన వంతు సాయాన్ని అందించే తెగువను ప్రదర్శించడానికైనా స్ఫూర్తినిచ్చింది ఈ రాజకీయ, సాంస్కృతిక వారసత్వమే. ఆంధ్ర రాష్ట్రానికి 1953లో తొలి రాజధాని కర్నూలు అయినా, ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాక అది హైదరాబాద్‌కు తరలివెళ్లినా రాష్ట్రానికి అన్నివేళలా ఒక అడుగు ముందుండి రాజకీయ చైతన్యాన్ని అందించినదీ, రాజకీయ కేంద్రంగా ప్రభవిల్లినదీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ ప్రభావితం చేసినదీ విజయవాడే. మెకెన్సీ నివేదిక నిరుడు విజయవాడను ‘గ్లోబల్ సిటీ ఆఫ్ ది ఫ్యూచర్’ అన్నది నిజమే కావొచ్చుగానీ... అంతకు దశాబ్దాల క్రితమే అన్నివిధాలా అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న నగరమిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడో అతి పెద్ద నగరంగా, కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపార కేంద్రంగా... దక్షిణ మధ్య రైల్వే జంక్షన్లలో అతి పెద్ద కూడలిగా విజయవాడ నగరానికి ఉన్న ప్రాధాన్యత తిరుగులేనిది.
 
రోజూ 300కు పైగా రైళ్లు వచ్చిపోయే ఈ నగరం ఆ కోవలో హౌరా, ముంబైల సరసన నిలబడుతున్నది. రెండు జాతీయ రహదారులు... చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16), మచిలీపట్నం- పూణె జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65) ఈ గడ్డపైనుంచే వెళ్తాయి. కనుక ఇది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో మాత్రమే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాలతో అన్నివిధాలా అనుసం ధానమైన నగరం. ఇది నేలలో బంగారాన్ని పండించగల సారవంతమైన సుక్షేత్రాలతో ఉండే కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉంది. అందువల్లే విజయవాడను రాజధానిగా ఎంపిక చేశామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికపై ప్రకటించినప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ మనస్ఫూర్తిగా దాన్ని సమర్ధిస్తున్నట్టు తెలిపింది.
 
నిర్ణయానికి ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అందరినీ కలుపుకొని వెళ్లేలా వ్యవహరిస్తే బాగుండేదని సూచించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014ను అనుసరించి రాజధాని అధ్యయనానికి కేంద్రం శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యుల నిపుణుల కమిటీని నియమిం చింది. ఆ కమిటీ అయిదు నెలల వ్యవధిలో ఒకటి, రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సందర్శించింది. వివిధ మార్గాల్లో వేలాది మంది అభిప్రాయాలను తీసుకున్నది. అనేక మందితో చర్చించింది.  ఫలానాచోట రాజధాని పెట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండానే అందుకు ఏ ప్రాంతం అనువైనది... దేనికి ఎలాంటి అననుకూలతలు ఉన్నాయన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులేమిటి, ఆ ప్రాంతాల్లో ఉండే సామాజిక, ఆర్ధిక స్థితిగతులేమిటి అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. తాత్కాలిక ఏర్పాట్లను ఎక్కడ చేసుకున్నా శాశ్వత ఏర్పాట్ల విషయంలో పదేళ్ల సుదీర్ఘ వ్యవధి ఉన్నది గనుక కొంత సమయాన్ని తీసుకుంటే బాగుంటుందని సూచించింది.
 
కనీసం 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉన్నచోటే రాజధాని ఉండాలని అభిప్రాయపడింది.  కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దేశంలోనే అత్యుత్తమమైన వ్యవసాయ భూములున్నాయని, వీటిని ఇతర అవసరాలకు మార్చే ప్రయత్నం చేస్తే ఆ భూములపై ఆధారపడివుండే రైతులు, వ్యవసాయ కూలీలు నిరుద్యోగులవుతారని హెచ్చరించింది. చిన్న కమతాలు అంతర్ధానమై రియల్ ఎస్టేట్ వ్యాపారులే లాభపడే ప్రమాదం ఉన్నదని తెలిపింది. ప్రత్యేకించి విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధాని నగరంగా చేయడం అవాంఛనీయమని చెప్పింది. ఈ అభిప్రాయాలను గానీ, సూచనలనుగానీ, హెచ్చరికలనుగానీ శిరోధార్యాలుగా భావించనవసరం లేదు.
 
కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టంకింద ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎంతో శ్రమించి అధ్యయనం చేసి కొన్ని అంశాలను చెప్పినప్పుడు దానిపై రాష్ట్ర ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీలో చర్చించడంలో తప్పేమిటి? చర్చలో భాగంగా ఆ కమిటీ చేసిన సూచనలను పూర్వపక్షం చేయొచ్చు. దాని అవగాహనలో ఉన్న లోపాలేమిటో చెప్పవచ్చు. దాని అభ్యంతరాలూ, అనుమానాలూ ఏమిటో చెప్పి...అందులోని గుణదోషాలను తెలుపవచ్చు. తమ ఆలోచనలూ, ప్రతిపాదనలూ అంతకన్నా ఏ రకంగా మెరుగైనవో రుజువుచేయొచ్చు. ఒక్క శాసనసభలోనే కాదు...అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతమైన చర్చలకు వీలుకల్పించవచ్చు. నివేదికపై ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా కూలంకషంగా చర్చ జరిపి ప్రకటించే నిర్ణయమేదైనా మెజారిటీ ప్రజల మన్ననను పొందుతుంది. అన్ని ప్రాంతాలవారూ దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తారు.
 
అయితే, కేవలం చర్చ జరగాలని కోరడంలోనే ఏదో ఉందనుకోవడం, దాన్ని తప్పించుకోవడానికి ఆదరా బాదరాగా రాజధానిపై ప్రకటన చేయడం దేనికోసం? ముందు చూపులేని ఇలాంటి చర్యల కారణంగానే రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న అభిప్రాయం ఆ ప్రాంతంలో బలపడుతున్నది. చేసే పని ఉత్కృష్టమైనదైనా అలా అందరికీ అనిపించేందుకు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. ఇప్పుడు విజయవాడను రాజధానిగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు గనుక ఆ ప్రాంతంలో భూముల ధరలు చుక్కలనంటకుండా, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు సామాన్యులను కొల్లగొట్టే స్థితి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
 
ప్రకటన సందర్భంగా ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాటు చేయబోతున్నారో, ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురాబోతున్నారో బాబు చెప్పారు. బాగానే ఉంది. అయితే, రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం ఇంతవరకూ ఏమీ మాట్లాడలేదు. తాను ఇప్పుడు ప్రకటించినవన్నీ సాధ్యమైనంత త్వరలో కేంద్రం నోటితో కూడా చెప్పించడానికి ఆయన కృషి చేయాలి. లేనట్టయితే అవన్నీ అరచేతిలో వైకుంఠంలా...ఉత్త బోలు మాటలుగా మిగిలిపోతాయి. రాష్ట్ర రాజధాని నగరంగా ఎంపికైన విజయవాడకు ‘సాక్షి’ మనఃపూర్వక అభినందనలు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement