తక్షణ అవసరాలకు మొండిచెయ్యే
- రాష్ట్ర తొలి బడ్జెట్‌లో తాత్కాలిక రాజధాని ఊసే లేదు
- గన్నవరం పోర్టు విస్తరణకు చర్యలు
- పీపీపీ పద్ధతిలో బందరుపోర్టు నిర్మాణం
- జిల్లాలో శిల్పారామం, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
సాక్షి, విజయవాడ : తాత్కాలిక రాజధాని నగరమైన విజయవాడ ప్రధానకేంద్రంగా ఉన్న జిల్లాకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. కొత్తరాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక బడ్జెట్ కావడంతో ప్రజల దృష్టంతా బడ్జెట్‌పైనే కేంద్రీకృతమయింది. తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో తక్షణ అవసరాలకుగానూ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన జిల్లా ప్రజలకు నిరాశే ఎదురయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన రూ.లక్ష కోట్ల బడ్జెట్ అనేది అంకెలకే పరిమితమై... వాస్తవ అభివృద్ధికి దూరంగా ఉందనే వాదన వినబడుతోంది.
రుణమాఫీకి రూ 5వేల కోట్లే....
బడ్జెట్ కోసం అశగా ఎదరుచూసిన అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబానికి లక్షన్నర వరకు రుణమాఫీ అని ప్రకటించారు. అయితే దీనికి గానూ రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.ఐదువేల కోట్లు మాత్రమే కేటాయించడం పలు విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో మొత్తం రూ.9,137 కోట్లరైతురుణా బకాయిలు ఉన్నాయి. సుమారు 98 వేల మంది రైతులు పంటరుణాలు, బంగారు నగలపై రుణాలు తీసుకున్నారు. వీటిలో పంటరుణాలు రూ.3,088 కోట్లు కాగా, బంగారు అభరణాలపై తీసుకున్న రుణాలు రూ.3,276 కోట్లు ఉన్నాయి.
ఇవికాక టర్మ్‌లోన్స్ రూ.2,773 కోట్లు ఉన్నాయి. ఇక దీంతో పాటు జిల్లాలో మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన 16 అంశాలను వివరిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు. వాటిలో తక్షణం పూర్తి చేయాల్సినవి 12 వరకు ఉన్నాయి. వీటిలో నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, అగిరిపల్లి, గన్నవరం మండలాల్లో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు అభివృద్ధి, పెడనలో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం, దుర్గగుడి వద్ద ప్లైవోవర్ నిర్మాణం ఇలా అనేక అంశాలున్నాయి. కనీసం వీటిలో కొన్నింటికి కూడ బడ్జెట్‌లో కేటాయింపులు జరుగలేదు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న బందరుపోర్టు నిర్మాణం, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు మాత్రమే బడ్జెట్‌లో చోటు దక్కడం కొంతమేర ఊరటనిస్తోంది.
స్పష్టత లేని కేటాయింపులు...
రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టుతో పాటుగా గన్నవరం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే ఎయిర్‌పోర్టు విస్తరణకు రూ.100 కోట్లనిధులు 400 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో మళ్లీ ప్రభుత్వం దీనిని బడ్జెట్‌లో చేర్చింది. అలాగే జిల్లాలో మరొక శిల్పారామం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారు, నిధుల కేటాయింపు ఎంత చేస్తారు అనేదానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఇక విజయవాడ-కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. అలాగే వైజాగ్ చైన్నై మధ్య కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇది పూర్తిగా దీర్ఘకాలిక ప్రాజెక్టు. ఇక జిల్లాకు ప్రధానమైన బందరు పోర్టు నిర్మాణానికి మాత్రం బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్ లభించింది. పబ్లిక్,ప్రెవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీనిని నిర్మిస్తామని ప్రకటించారు. అయితే ఎంత భూసేకరణ చేయాలి. దీనికి అవసరమైన డీపీఆర్ తయారీకి ఎంత కేటాయిస్తారో ప్రకటించలేదు.
తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడలో కనీస సౌకర్యాలు మెరుగుపర్చటానికి నిధుల కేటాయింపులే లేవు. వచ్చే నెల నాటికి గన్నవరంలో సుమారు 11 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తారు. వీరందరికీ అవసరమైన గృహ సముదాయాలు, ఇతర అంశాలకు కేటాయింపుల్లో చోటు దక్కలేదు. మొత్తంమీద బడ్జెట్ కేటాయింపులు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పవచ్చు.
కంటితుడుపు బడ్జెట్
టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటితుడుపుగా ఉంది. రైతు, డ్వాక్రా రుణమాఫీకి నిధుల కేటాయింపు ఊసేలేదు. అలాగే రూ.లక్ష11వేల కోట్ల బడ్జెట్‌లో ఏరంగానికి కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేసినట్లు కనిపించలేదు. బాబు వస్తే జాబు దొరుకుతుందన్న నిరుద్యోగులకు ఇక కష్టాలే. ఉమ్మడి రాష్ర్టంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రూ.లక్షకోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని సంక్షేమ రంగాలకు న్యాయం చేశారు.
- సామినేని ఉదయభాను, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
సమతుల్య బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. ప్రత్యేకంగా వ్యవసాయం, నీటిపారుదల, మౌలిక సదుపాయాల రంగాల్లో అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేలా ఉంది. బందరు, భావనపాడు, కళింగపట్నం, నౌకాశ్రయాల పురోభివృద్ధికి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల సత్వర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ తెలుపుతోంది. పారిశ్రామిక పురోభివృద్ధికి కూడా తగిన ప్రణాళికలు ఉంటే బాగుండేది.
- ముత్తవరపు మురళీకృష్ణ, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు
విద్యారంగానికి నిధులు ఏవి?
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులు తగినంతగా లేవు. జాతీయ స్ధాయి విద్యా సంస్ధల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంకూడా స్థలసేకరణ, సర్వేల నిమిత్తం కొంతమేర నిధులు కేటాయించాల్సింది. పాఠశాలల్లో టాయిలెట్స్, మంచినీరు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన దృష్ట్యా విద్యారంగానికి నిధుల కేటాయింపులు ఇంకా పెంచాల్సింది.
- కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ