సంపాదకీయం: ఈమధ్య టోల్ ప్లాజాల వద్ద చోటుచేసుకుంటున్న ఘర్షణలు, దౌర్జన్యాలు తరచు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఎవరో వీఐపీనో, ఆ తరహా వ్యక్తుల అనుచరులో టోల్ ప్లాజా సిబ్బందిని చావబాదిన దృశ్యాలు చానెళ్లలో దర్శనమిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు కూడా కడుపు మండి ఘర్షణకు దిగుతున్నా చివరకు అక్కడి సిబ్బందిదే పైచేయి అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. అంతక్రితం మాటేమోగానీ... ఎన్‌డీఏ ప్రభుత్వ కాలంలో అంకురార్పణచేసిన స్వర్ణచతుర్భుజి ప్రారంభమైన తర్వాత ఈ టోల్‌ప్లాజాల జోరు ఎక్కువైంది. నడిరోడ్డుపై అందమైన నిర్మాణాలు, అందులో కంప్యూటర్ల ముందు కూర్చునే సిబ్బంది, వారికి డబ్బులు చెల్లిస్తేగానీ తెరుచుకోని గేట్లు... ఇవన్నీ మనం ఎక్కడున్నామో తెలియని స్థితిలోకి తీసుకెళ్తాయి. రద్దీగా ఉండే రహదార్లపై ఒక్కోసారి ఈ వసూళ్లవల్ల వాహనాలన్నీ ఐదారు కిలోమీటర్లకు మించి నిలిచి పోతున్నాయి.
ఏదో అత్యవసర పని నిమిత్తమో, మరింకేదైనా ముఖ్య కార్యక్రమం కోసమో వెళ్లేవారి సహనాన్ని ఈ ట్రాఫిక్ జాంలు పరీక్షిస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో టోల్ ప్లాజాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. దాదాపు అన్నిటికీ పోలీసు రక్షణ అవసరమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ ఠాక్రే టోల్ ప్లాజాల వద్ద డబ్బులు చెల్లించొద్దని పిలుపునిచ్చాక విధ్వంసాలు కూడా జరిగాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి గనుక ప్రజలను తమవైపు ఆకర్షించడం కోసం ఎంఎన్‌ఎస్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నదని విమర్శిస్తున్నవారున్నారు. అయితే వారు సైతం టోల్ ప్లాజాల నిలువు దోపిడీని తీవ్రంగా దుయ్యబడుతున్నారు.
జనం ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతం వెళ్లడానికి లేదా నిత్యావసరాలు, ఇతర సరుకులు తరలించడానికి రవాణా సౌకర్యాలు... అందుకోసం పటిష్టమైన రహదార్లు అవసరం. దేశంలో 90వ దశకంలో ఉదారవాద ఆర్ధిక విధానాలు ప్రవేశించాక ఇలాంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం కూడా ప్రభుత్వాలకు కష్టమవుతున్నది. ‘అన్నీ మమ్మల్నే చేయమంటే ఎలా... జనం కూడా బాధ్యత గుర్తించాలి, సౌకర్యాలను వినియోగించుకున్నప్పుడు అందుకు తగిన మొత్తం చెల్లించాలి’ అని సుద్దులు చెప్పడం మొదలైంది. విద్య, వైద్యం, ఆఖరికి బిల్లుల చెల్లింపుకూడా ఖరీదైపోయాయి. యూజర్ చార్జీలనే కొత్త పదబంధం వాడుకలోకొచ్చింది. మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు పాలనాకాలంలో ధర్మాసుపత్రుల్లో చిన్నా చితకా రోగాలకు మందుకోసం వెళ్లేవారిని కూడా ఈ యూజర్ చార్జీలు పీడించేవి. ఆ వరసలోనే రహదారుల నిర్మాణానికయ్యే వ్యయాన్ని ప్రజలనుంచి వసూలు చేసే పథకానికి రూపకల్పనచేశారు. రహదారుల నిర్మాణాల బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించి, అందుకైన వ్యయాన్ని టోల్‌ప్లాజాల ద్వారా వారే రాబట్టుకునే ఏర్పాటుచేశారు.
కనుక కోట్లాది రూపాయల వ్యయంతో ఆరు వరసలు, ఎనిమిది వరసలు ఉండే రోడ్లను నిర్మించడం... దానికి ఆ చివరా, ఈ చివరా రోడ్డు మధ్యలో టోల్‌ప్లాజాలు నిర్మించడం, వాహనాలనుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభమైంది. ఇదంతా వాహనాలున్నవారి గొడవే కదా...మనకేమి సంబంధం అని సామాన్యులు అనుకోవడానికి లేదు. వారు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల టిక్కెట్లలో సైతం ఈ టోల్‌ప్లాజా ఖర్చు కలిసే ఉంటున్నది. ఇందువల్ల బస్సు చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ఆటోలు, క్యాబ్‌లు కూడా టోల్ ఖర్చును ప్రయాణికులకు బదిలీచేస్తున్నాయి.
ఈ వసూళ్లకు ఒళ్లుమండి ధర్నాలకు దిగడం, రాస్తారోకోలు చేయడంవంటి ఉదంతాలు మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చోటుచేసుకున్నాయి. దేశంలోని 17 ప్రధాన రహదారులవద్ద టోల్‌ప్లాజాల పనితీరును అధ్యయనం చేసిన కోల్‌కతా ఐఐఎం ఆసక్తికరమైన సంగతి వెల్లడించింది. గంటల తరబడి నిలిచిపోయే వాహనాలవల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు ఏటా దాదాపు రూ. 87,000 కోట్ల నష్టం సంభవిస్తున్నదని తేల్చింది.
సంపన్నుడైనా, పూటకు ఠికానాలేని సామాన్యుడైనా తెల్లారిలే స్తే తన అవసరాలు తీర్చుకోవడానికి చేసే ప్రతి ఖర్చులో కొంత భాగం పన్నుల రూపంలో పోతుంది. ఆ పన్నులు కాదని ఇలా వేర్వేరు రూపాల్లో సామాన్యులను బాదటం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. టోల్ ప్లాజాల వద్ద సాగేది నిజానికి డబుల్ దోపిడీ! కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా ప్రతి లీటర్‌కూ రోడ్డు సెస్ పేరిట రూ. 2 చొప్పున వసూలు చేస్తోంది. 2012-13లో ఇలా దేశంలో వసూలైన మొత్తం రూ.19,333 కోట్లు. ఈ వసూళ్లు ఇలా ఉండగానే టోల్‌ప్లాజాల వద్ద మరోసారి నిలువుదోపిడీ చేయడమంటే జనంనుంచి ఒకే పనికి రెండుసార్లు వసూలుచేయడం.
రోడ్డు సెస్‌ద్వారా వసూలయ్యే మొత్తాన్ని రోడ్లకే ఖర్చు చేయాల్సి ఉండగా అది జరగడంలేదు. 2012-13లో కేవలం రూ.7,000 కోట్లు మాత్రమే కేంద్రం రోడ్లకు ఖర్చు పెట్టింది. చాన్నాళ్ల క్రితం ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. రహదారుల నిర్మాణం విషయంలోనూ, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేటపుడూ కాస్త తెలివితో వ్యవహరిస్తే ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గుతుందని కాగ్ నిరూపించింది. ప్రాజెక్టును కొన్ని భాగాలుగా విడగొట్టి వేర్వేరు సంస్థలకు అప్పగించాలని సూచించింది. ఇలా ఎందరు ఎన్ని చెప్పినా యూపీఏ ప్రభుత్వం తన బండబారిన ఆలోచనల్నే అమలుచేస్తోంది. పర్యవసానంగా టోల్‌ప్లాజాలవద్ద ఆగ్రహా వేశాలు పెరుగుతున్నాయి. కనీసం రాబోయే ఎన్నికల భయంతోనైనా, మహారాష్ట్ర పరిణామాలను గమనించాకైనా తన విధానాలను సమీక్షించుకోవడం అవసరమని కేంద్రం గుర్తించాలి. లేకుంటే జనం క్షమించరు.
‘దారి’ దోపిడీ!
Published Wed, Jan 29 2014 3:43 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM
Advertisement
Advertisement