ద్వేషం నుంచి దొరకని విముక్తి చివరకు మిగిలేది...
మన నవలలు
దేవుడికి తొలి అవమానం బహుశా సైతాన్ చేతిలోనే జరిగి ఉంటుంది. దేవుడు- మానవుణ్ణి సృష్టించి
విర్రవీగాడు. సైతాన్‌ని పిలిచి- చూడు... ఒక మహోన్నతమైన సృజన చేశాను. మానవుడంటే ఇతడే.
అభివాదం చెయ్యి అన్నాడు. సైతాన్ మానవుణ్ణి చూశాడు. చూసిన వెంటనే ద్వేషించాడు. దహించుకు
పోవడం సైతాన్ జన్మ లక్షణం. దేవా... నేను మానవుడికి ఎందుకు అభివాదం చేయాలి. అతడు ఎందులో నాకంటే గొప్ప. నువ్వు అతణ్ణి కేవలం మృత్తికతో సృజించావు. నన్ను అగ్నితో. దేవుడికి ఆగ్రహం వచ్చింది. సైతాన్‌కు దండన లభించింది. ఆ దండన సైతాన్‌ను మరింత జ్వలింపజేసింది. మానవజాతి మీద ప్రళయం వరకూ పగ. ఆ జాతిని నాశనం చేయాలంటే ఏం చేయాలి? చాలా సులువు. వాళ్లల్లో కాసింత ద్వేషం రగిలిస్తే చాలు. వాళ్ల నాడుల్లో కాసింత విద్వేషాన్ని పరుగులెత్తిస్తే చాలు. వాళ్ల అంగాంగాల్ని పంచేంద్రియాల్ని అకారణమైన అక్కసు అనే మాయా సంకెలలతో బిగిస్తే చాలు. అదే చేశాడు.
తదాదిగా మానవజాతి అనే ఈ జాతి తనను తాను హరించుకుంటోంది. తనను తాను హతమార్చుకుంటోంది. తనను తాను పరిహసించుకుంటూ, హీనపరుచుకుంటూ, క్షోభ పెట్టుకుంటూ అట్టడుగుల్లోకి జారి, లోయల్లోకి కూలి, ప్రేమ- సంతోషం అనే ఊర్థ్వలోకాలకు దూరంగా తమస్సులో- చేతులు తడుముకుంటూ- ఏ వెలుగుకూ నోచుకోని కబోది బతుకు బతుకుతోంది. దయానిధి తల్లి ఏం పాపం చేసింది? వయసులో ఉండగా ఎవరితోనో తప్పు చేసింది. చేస్తే? దాని వల్ల ఎవరికీ రూపాయి నష్టం లేదే. లోకాన క్షామం వచ్చిపడలేదే. ఎవరి ప్రాణాలూ పుటుక్కున రాలిపోలేదే. కాని- ఆమె- అన్యులకు సాధ్యం కాని రీతిలో, ఈ సంఘం అనుమతించని రీతిలో, ఈ సంఘానికి చేతగాని రీతిలో కాసింత సుఖించింది. అంతే.
సంఘమంతా ఆమెను ద్వేషించింది. ఆ ద్వేషం ఎంతటిదంటే ఆమె భర్తకు- ఆమె గొంతు పిసికి చంపేంత. ఆమె పిల్లలను జీవితాంతం వేటాడేంత. దయానిధి గుండెల్లో ఈ ద్వేషం భయాన్ని నింపేసింది. ఇది తప్పా? మనసుకు నచ్చి, కాసింత భావుకతతో, ఒక నచ్చిన ఆడపిల్ల సమక్షంలో, ఆమె ఆదరణ కోరుకుంటూ, సంఘం చెప్పిన పద్ధతిలో కాకుండా ఉండటం తప్పా? భయపడిపోయాడు. వణికిపోయాడు. అల్లల్లాడి పోయాడు. కోమలి! ఎంతందంగా ఉంటుంది. కత్తులు విరిచి ఆకాశంలో పారేసినట్టు చమక్ చమక్‌మని మెరిసినట్టు ఉంటుంది. అలాంటి కోమలిని పొందలేకపోయాడు. కారణం? కోమలి- లేచి వచ్చిన దాని కూతురు. అసలే, తల్లి ప్రవర్తనకు సంఘం అతడి ముఖాన మసి పులిమి ఉంది. కోమలి సాంగత్యం కూడా అంటే ఏం లేదు. ఊస్తుంది.
పోనీ సుశీలను చేసుకోవచ్చు. కాని ఆమెకు ఒళ్లంతా ద్వేషమేనే. దయానిధి తల్లంటే ద్వేషం. అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు దయానిధి అంటే ద్వేషం. అతడితో దయగా, కృపగా, కరుణగా ఉండి బావా బావా అని ఆదరిస్తున్నందుకు అమృతం అంటే ద్వేషం. సాయంత్రమైతే జుబ్బా కట్టుకొని పాపిట తీసుకొని కోమలి ఇంటి వైపుకు వెళుతున్నాడని తెలిసి కోమలి అంటే ద్వేషం. ఎప్పటికైనా సంబంధం కలుపుకునే వీలున్న నాగమణి అన్నా ద్వేషమే.
సమస్యేమిటంటే సుశీలకు ప్రేమించడం రాదు. నిజానికి చాలా మందికి ప్రేమించడం రాదు. ద్వేషించమంటే సులువుగా ద్వేషిస్తారుగాని- అరే అబ్బాయ్ ఫలానా వాడు మేడ కట్టుకున్నాడురా, ఫలానావాడికి మంచి ఉద్యోగం వచ్చిందిరా, ఫలానావాడి లాటరీలో లక్ష తగిలింది, ఫలానావాడికి పదవి, ఫలానావాడు కథో కవితో. మనకేమీ నష్టం లేకపోయినా ఉత్తపుణ్యానికే అకారణంగా ద్వేషిస్తూ ద్వేషిస్తూ ద్వేషిస్తూ దూరమయ్యి దూరమయ్యి దూరమయ్యి ఆఖరుకు ఏకాకిగా మిగిలి. అప్పటికి
పుణ్యకాలం ముగిసి.
దయానిధి డాక్టర్. కాని ప్రేమను ఇవ్వడానికి, స్వీకరించడానికి కూడా భయపడిపోయే చిత్రమైన రోగి. కోమలికి ప్రేమ ఇవ్వలేడు. అమృతం నుంచి పొందనూ లేడు. చివరకు బడుద్దాయిలా ఇందిరను చేసుకున్నాడు. ఆమె అంటే ఇష్టం లేదు. పైగా సమాజం అనే శత్రువు పెళ్లి అనే పేరుతో ఈ గుదిబండను తగిలిస్తోంది కదా అని ద్వేషించాడు. పెళ్లిలో పేచీలు పెట్టాడు. మామగారు- పోలీసు ఆఫీసరు కావడం మూలాన- స్వరాజ్యమూ, స్వాతంత్య్రమూ అని, తనకు లేని లక్షణాలతో గొడవకు దిగి, బ్రిటిష్ వారికి చెప్పి ఆయన ఉద్యోగం ఊడదీయించే వరకూ వెళ్లాడు.
చివరకు ఏమైంది? భార్య పుట్టింట్లో. ఇతను ఏలూరులో. ప్రాక్టీసు నడవదు. మందికి ఇతడంటే పడదు. మరి? ఒక పిల్లను ప్రేమించి, ఒక పిల్లతో సరసాలాడి, ఒక పిల్లకు ఆశపెట్టి, ఆఖరుకు ఒకదాన్ని చేసుకొని, దాన్ని కూడా ఇంటికి తీసుకొని రాక, ‘గృహస్తు చట్రం’లో ఇమడక. లోకం చూస్తూ ఊరుకుంటారా? రాచి రంపాన పెడుతుంది. ఆ సెగ ఎలాంటిదంటే చివరకు- ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలనే ఆత్మవంచనతో అనంతపురం పారిపోయేంత. పోనీలే అదీ మంచిదయ్యింది. దయానిధి అక్కడ బాగుపడ్డాడు. కాలికి వజ్రం తగిలి కుబేరుడయ్యాడు. వజ్రకరూర్‌లో గనికి ఆసామి. మళ్లీ ఏమైంది? ద్వేషమే! పచ్చగా ఉన్నవాణ్ణి వదిలిపెడతారా లోకులు? ఎల్లాగైనా భరతం పడతారు. ఇక్కడా అదే జరిగింది. కుల తగాదాలు వచ్చాయి. కార్మికులు సమ్మె చేశారు. ప్రత్యర్థులు గనులు పూడ్చారు. గిట్టనివాళ్లు రాత్రికి రాత్రి ఇల్లు తగులపెట్టారు. మిగిలింది ఏమిటి? చివరకు మిగిలేది ఏమిటి? ఖాళీ చేతులే. మళ్లీ ప్రయాణం మొదలెట్టాలి.
దయానిధి మొదలుపెట్టాడు. అంతకు మించి చేయగలిగింది కూడా లేదు.
నవల ముగుస్తుంది.
ఈ కథ జరిగిన కాలం 1935. అంటే అప్పటికే ఒక ప్రపంచ యుద్ధాన్ని చూసుందొక తరం. మరో ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతోందింకో తరం. యుద్ధం అంటే ఏమిటి? ద్వేషానికి విరాట్ రూపం. ఎంత ద్వేషించకపోతే కొన్ని వేల ప్రాణాల మీదకు కొన్ని వేల ప్రాణాలు దాడికి తెగబడతాయి. ఇలాంటి ద్వేషం చూశాక, ఇలాంటి ద్వేషం అనుభవంలోకి వచ్చాక, మనిషిలోని సహజమైన పురోగామి లక్షణాలు ఎలా అడుగంటిపోతాయో ఎలా కుంచించుకొని పోతాయో అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో... వీటన్నింటికీ ఒక సృజనాత్మకమైన సమాధానం ఈ నవల. బుచ్చిబాబు దీనిని 1946లో రాసినా ఇప్పుడూ చుట్టుపక్కలా అంతే ఉంది. ఈ నవలలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ ప్రస్తావన విస్తారం. అది రాయడం బుచ్చిబాబు ఉద్దేశం కాదు. రాయలసీమవాళ్లకూ, సర్కారు జిల్లాల వారికీ పరస్పరం ఉన్న విద్వేషాన్ని చూపడమే లక్ష్యం. ఇప్పుడేం చల్లగా చల్ల తాగుతున్నామా? తెలంగాణవాళ్లకూ సీమాంధ్రవాళ్లకూ మధ్య విద్వేషం. సైతాన్‌కు మరణం లేదు. సైతాన్‌ను ప్రళయం వరకూ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఓజోన్ పొరకు చిల్లుపడో, ధ్రువాలు కరిగి వరదలెత్తో, అగ్నివర్షం కురిసో ప్రళయం రాదు. కేవలం ద్వేషం వల్లే వస్తుంది. నాడు హిట్లర్. రేపు మరొకడు.
ఒక జీవితకాలంలో మనం ఏం మూటగట్టుకుంటాం. చివరకు ఏం మిగుల్చుకుంటాం. ఇది చూసుకోండి అని చెప్పడానికే బుచ్చిబాబు ఈ నవల రాశారా? ఒక కోణం నుంచి ఇలా మరో కోణం నుంచి మరోలా. చాలా అరుదైన బహుముఖీయమైన జీవన పార్శ్వాలనూ వాస్తవికతలనూ తాత్త్వికతలనూ బుచ్చిబాబు పొరలు పొరలుగా ఈ నవలలో ఎలా పేర్చగలిగారా అని అబ్బురం కలగక మానదు. ఆయన పట్ల ఎనలేని గౌరవమూ కలగక మానదు.
ఇంకేంటి? ఇప్పటికిప్పుడు ఈ పేపర్ పక్కనబెట్టి మీరు ప్రేమిస్తున్న, మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తుల పేర్లు రాసుకోండి. మీరు ద్వేషించే, మిమ్మల్ని ద్వేషించే వ్యక్తుల పేర్లు కూడా రాసుకోండి. ఆ తక్కెడను చూసి హడలెత్తిపోతే, దారీ తెన్నూ తెలియక నాలుక పిడచగట్టుకొని పోతే, నిత్య పారాయణగ్రంథంగా ఈ నవలను స్వీకరించండి.
ఇది తెలుగులో ఉండటం వలన దీని విలువ లోకానికి తెలియలేదు. ఇది
తెలుగులో ఉండటం వల్ల దీని విలువ తెలుగువారిక్కూడా తెలియాల్సినంతగా తెలియదు.
చివరకు మిగిలేది- బుచ్చిబాబు
రచనా కాలం - 1946
తొలి ముద్రణ- 1952
‘తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మక రూపం ఇచ్చిన ఉత్కృష్టమైన తెలుగు నవల’గా పేరు గడించింది. బుచ్చిబాబు రాసిన ఏకైక నవల ఇది. అనేక పునర్ముద్రణలు పొందింది.
వెల: రూ.120; మార్కెట్‌లో లభ్యం.