యువ మస్తిష్కాల్లో పురివిప్పే సృజనాత్మక ఆలోచనలకు రెక్కలు తొడిగే బృహత్తర బాధ్యత ఉన్నత విద్యా సంస్థలది. కానీ, అవి సంకుచిత కుడ్యాలమధ్య కునారిల్లుతున్నాయని మద్రాస్ ఐఐటీలో జరిగిన ఉదంతం తేటతెల్లం చేస్తున్నది. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రచనలపై నిర్వహించిన గోష్టిలో ఒక వక్త చేసిన ప్రసంగాన్ని కరపత్రంగా ప్రచురించడం నేరంగా పరిగణి ంచి క్యాంపస్‌లో పనిచేస్తున్న ఒక విద్యార్థి సంస్థ కార్యకలాపాలను అక్కడ నిషేధించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. కరపత్రం నుంచి నిషేధందాకా నడిచిన ప్రక్రియ మరింత వింత గొలుపుతుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్‌ఆర్‌డీ)కు ఆకాశరామన్న లేఖ వచ్చింది. క్యాంపస్‌లోని అంబేడ్కర్-పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఎస్‌సీ) కరపత్రాలు, పోస్టర్లద్వారా విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నదని ఆ లేఖ సారాంశం.
ఆ లేఖతోపాటు ఒక మేధావి చేసిన ప్రసంగ పాఠం ఉన్న కరపత్రాన్ని కూడా జతపరిచారు. ఆ లేఖనూ, కరపత్రాన్నీ ఆ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మద్రాస్ ఐఐటీకి పంపారు. ఐఐటీ యాజమాన్యం చురుగ్గా స్పందించి ఇకపై సంస్థ పేరునుగానీ, క్యాంపస్‌లోని సదుపాయాలనుగానీ వాడుకోవడానికి వీల్లేదంటూ ఏపీఎస్‌సీకి హుకుం జారీచేసింది.
రవీంద్ర కవీంద్రుడు భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన ప్రార్థనలో ‘ఎక్కడైతే మేధస్సు నిర్భయంగా ఉంటుందో... విజ్ఞానానికి సంకెళ్లు ఉండవో... ఎక్కడైతే ప్రపంచం సంకుచిత కుడ్యాలుగా ముక్కలైపోదో... ఎక్కడైతే హేతువు దారితప్పదో...’ అలాంటి స్వేచ్ఛాప్రపంచంలో తనను మేల్కొల్పమంటాడు. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన విద్యాసంస్థలు నిజానికి అలాంటి ప్రపంచానికి ప్రతీకలుగా ఉండాలి. వర్తమాన ప్రపంచ ధోరణులను, వినూత్న ఆవిష్కరణలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తూ వాటిపై సమగ్ర విశ్లేషణకూ, పరిశోధనకూ చోటీయాలి. కానీ అవి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తమ చుట్టూ గోడలు కట్టుకుంటున్నాయి. ఒక విద్యార్థి సంస్థ కార్యకలాపాలు అందరికీ నచ్చాలని ఏం లేదు. వారి సిద్ధాంతాలతో, వారి అభిప్రాయాలతో, వారి ఆచరణతో అందరూ ఏకీభవించాలని ఏంలేదు. అయితే, అందుకొక విధానం ఉండాలి. ఆ సంస్థ పనితీరుపై అభ్యంతరం ఉంటే ఆ సంగతిని బహిరంగ చర్చకు పెట్టాలి. అందుకు భిన్నంగా... పేరు కూడా వెల్లడించుకోవడానికి ధైర్యం చేయలేని వారెవరో లేఖ రాస్తే దానిపై ఇంతగా స్పందించడం మద్రాస్ ఐఐటీ వంటి ఉన్నతశ్రేణి విద్యా సంస్థ చేయాల్సిన పనేనా? కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అలాంటి ఫిర్యాదు పంపితే ఆ సంస్థ నిర్వాహకులను పిలిచి మాట్లాడటం, వారినుంచి వివరణ కోరడం వంటివి చేసి ఉండొచ్చు.
అంతవరకూ వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలుసుకుని... అభ్యంతరకరమైనవి, క్యాంపస్ మార్గదర్శకాలకు విరుద్ధమైనవి ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. అటువంటివి ఇకపై కొనసాగించవద్దని కోరవచ్చు. అనుసరించాల్సిన పద్ధతి ఇది కాగా మద్రాస్ ఐఐటీ రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించినట్టు కనబడుతోంది. ఈ వ్యవహారంలో పారదర్శకంగా తగిన విచారణ జరిపి, సంబంధింత సంస్థనుంచి సంజాయిషీ కోరి, అటుమీదట స్వతంత్రంగా ఆలోచించి వ్యవహరిస్తే బాగుండేది. ఆ లేఖనే ఆదేశంగా శిరసావహించి చర్యకు ఉపక్రమించినట్టుగా కనబడటంవల్ల తన ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఆలోచన మద్రాస్ ఐఐటీకి కలిగినట్టులేదు.
మద్రాస్ ఐఐటీకి సుసంపన్నమైన చరిత్ర ఉంది. దేశంలోని అత్యుత్తమ శ్రేణి విద్యా సంస్థగా గుర్తింపు ఉంది. అక్కడ భిన్నాభిప్రాయాలకు తావిచ్చిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు పర్యావరణానికీ, సమాజానికీ ఎలా ముప్పు కలిగిస్తున్నాయో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేథా పాట్కర్ ఇదే క్యాంపస్‌లో మాట్లాడారు. నిజానికి ఇలాంటి ఉద్యమకారుల అభిప్రాయాలూ, మనోభావాలు తెలుసుకోవడం... అందులోని లోటుపాట్ల గురించి నేరుగా వారితోనే సంభాషించడం క్యాంపస్ విద్యార్థులకు అవసరం. సమాజానికి దూరంగా, ఏకదంత ప్రాకారాల్లో కూర్చుంటే...తమ క్లాసు పుస్తకాలు తప్ప మరేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తే విద్యార్థులు రాణించలేరు. పట్టాలు తీసుకున్నాక వారు ఈ సమాజోన్నతికే తమ మేథస్సునూ, విజ్ఞానాన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. విద్యా సంస్థల్లో తాము నేర్చుకునే ప్రతి అంశాన్నీ రేపన్నరోజున వారు ఈ సమాజంలో ప్రయోగించి చూడాల్సివస్తుంది. అందువల్లే భిన్న సిద్ధాంతాలనూ, దృక్పథాలనూ... వాటిల్లోని మంచిచెడులనూ వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకూ ఎపీఎస్‌సీ సమాజానికి ముప్పు కలిగించే ఏ ఉగ్రవాద కార్యకలాపాలకూ పాల్పడటం లేదు. సామాజిక విప్లవకారుడు డాక్టర్ అంబేడ్కర్, కులజాడ్యంపై కత్తిగట్టిన పెరియార్ రామస్వామి వంటివారి భావాలను ప్రచారం చేస్తోంది. ఆ వెలుగులో వర్తమాన పరిణామాలను అధ్యయనం చేస్తూ.... అందులో భాగంగా ప్రముఖులతో గోష్టులు ఏర్పాటుచేస్తున్నారు. చర్చకు చోటిస్తున్నారు. వామపక్షాలు, మితవాదులు, మధ్యేవాదుల రాజకీయాలపైనా, ఆచరణపైనా విమర్శనాత్మక విశ్లేషణలు చేస్తున్నారు. ఇదెలా నేరమవుతుందో అర్థంకాని విషయం. ఇప్పుడు మద్రాస్ ఐఐటీ చర్యకు కారణమైన కరపత్రంలో కూడా ద్రవిడ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త వివేకానంద గోపాల్ అంబేడ్కర్ దృక్పథంపై చేసిన ప్రసంగంలోని అంశాలున్నాయి. అందులో ఎన్డీయే సర్కారు హిందూత్వ ఎజెండాపైనా, ఘర్‌వాపసీవంటివాటిపైనా విమర్శలున్నాయి. ఆ విషయంలో వారితో విభేదించడానికీ, వారి అవగాహనలోని లోపాలను చర్చించడానికీ ఎవరికైనా హక్కుంటుంది.
అలాంటివారి హక్కులకు ఆటంకం కల్పిస్తే ఏపీఎస్‌సీ ది దోషమవుతుంది తప్ప... వర్తమాన పరిణామాలపై అభిప్రాయం కలిగి ఉండటమే నేరంగా పరిగణిస్తే ఎలా? కేంబ్రిడ్జి, హార్వర్డ్, ప్రిన్స్‌టన్‌వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచాన ఇంకా కళ్లు తెరవని రోజుల్లో దేశదేశాల్లోని విద్యార్థులకూ మన భారతావనిలోని నలంద, తక్షశిలలే జ్ఞానభిక్ష పెట్టాయి. అదంతా గత వైభవంగా మిగలడానికి కారణమేమిటో తాజాగా మద్రాసు ఐఐటీ వైఖరి చూస్తే అర్థమవుతుంది. ఆలోచనలనూ, అభిప్రాయాలనూ మొగ్గలోనే తుంచాలని చూడటం ఎక్కడైనా తప్పే అవుతుంది. ఐఐటీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థ ఆ పనికి పూనుకోవడం మరింత దారుణమవుతుంది. మద్రాస్ ఐఐటీ ఇప్పటికైనా తన పొరపాటును గుర్తించాలి.
భిన్నాభిప్రాయం నేరమా?!
Published Sat, May 30 2015 12:33 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement