
ఉరికంబం.. వివక్ష
ఉరితాడుకు కూడా కులం ఉన్నదని...ధనిక, పేద వివక్ష ఉన్నదని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక మరోసారి ధ్రువపరిచింది. రెండున్నరేళ్లు ఎంతో శ్రమించి, దేశంలోని అనేక జైళ్లలో ఉరికంబం నీడన బతుకు లీడుస్తున్న అభాగ్యుల్ని కలిసి మాట్లాడి ఈ నివేదికను వెలువరించారు. మొత్తంగా ఉరిశిక్ష పడిన 385మందిలో 373మందికి సంబంధించిన వివరాలను ఈ నివేదిక అధ్యయనం చేసింది. మన చట్టాలు, కోర్టులు, జైళ్లు ఎలా పనిచేస్తున్నాయో... వాస్తవంగా జరుగుతున్నదేమిటో వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతి పరిచింది.
ఉరిశిక్ష పడినవారు నేరస్తులా, అమాయకులా అన్న చర్చలోకి ఈ నివేదిక పోలేదు. వారు చేసిన నేరమేమీ లేదని వాదించబూనుకోలేదు. ఆ నివేదిక చేసిందల్లా వాస్తవాలను సమాజం ముందుంచడమే. నివేదిక రూపకల్పనలో పాలు పంచుకున్నవారంతా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు.
ఉరిశిక్షకు అర్హమైన నేరాలేమిటో చెప్పే చట్టాలు మన దేశంలో చాలా ఉన్నాయి. భారత శిక్షాస్మృతిలోని 12 సెక్షన్లతోసహా 18 కేంద్ర చట్టాలు ఎలాంటి నేరాలకు ఉరిశిక్ష విధించవచ్చునో చెబుతున్నాయి. మొత్తంగా 59 సెక్షన్లు మరణశిక్ష విధింపునకు వీలు కల్పిస్తున్నాయి. ఇవిగాక రాష్ట్రాల్లో అనేక చట్టాలున్నాయి.
మన రాజ్యాంగం ‘జీవించే హక్కు’ను వాగ్దానం చేస్తుంటే ఒక మనిషి ప్రాణం తీయడానికి ఇన్ని చట్టాలు, నిబంధనలా అని ఆశ్చర్యం కలగొచ్చు. ఇలాంటి సంశయమే ఏర్పడటం వల్ల కావొచ్చు...జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని లా కమిషన్ నిరుడు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఉరిశిక్షను మన చట్టాలనుంచి ‘దశలవారీగా’ తొలగించాలని సిఫార్సు చేసింది. ఉగ్రవాదం మినహా ఇతర నేరాలకు దీన్ని విధించరాదని పేర్కొంది. ‘అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది’ అయినప్పుడు మాత్రమే ఉరిశిక్ష విధించాలని 1983లో ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
నేర స్వభావాన్నిబట్టి... నేరస్తుణ్ణి సంస్కరించడం సాధ్యమా, కాదా అన్నదాన్నిబట్టి ఒక కేసు ‘అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనద’ని నిర్ధారించుకున్న తర్వాతే ఈ శిక్ష విధించాల్సి ఉంటుంది. అయితే కింది కోర్టులు ఉరిశిక్ష విధించేటపుడు ఈ గీటురాయిని పరిగణిస్తున్నాయా? లేదనే చెప్పాలి. 2000-2015 సంవత్సరాల మధ్య మన దేశంలో కింది కోర్టులు మొత్తం 1,617మందికి ఉరిశిక్ష విధించాయి. ఉరిశిక్ష విధింపు అన్నది ఒక రకంగా ఏకపక్షమైనదేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ భగవతి ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. అది తీర్పునిచ్చే న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలకూ, వారికుండే సామాజిక చింతనకూ, వారు ముందుగా ఏర్పర్చుకునే భావాలకూ, పక్షపాత ధోరణులకూ లోబడి ఉంటుందన్నది జస్టిస్ భగవతి భావన.
ఉరిశిక్షల విధింపు విషయంలో సుప్రీంకోర్టు విధించిన పరిమితులు పట్టకపోవడానికి ఇలాంటి అంశాల ప్రభావం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఉరిశిక్ష విధింపు నకు సంబంధించి మన రాజ్యాంగ నిర్ణాయక సభలో విస్తృతమైన చర్చే జరిగింది. ఆ సభలో సభ్యుడిగా ఉన్న శిబన్‌లాల్ సక్సేనా ఆ శిక్ష ఉండరాదని గట్టిగా వాదించారు. బ్రిటష్ పాలనలో 26 నెలలపాటు ఆయన ఉరిశిక్ష పడిన ఖైదీగా ఉన్నారు. తన సహచరులు 37మంది ఉరికంబం ఎక్కడాన్ని చూశారు. వారిలో కనీసం ఏడుగురు అసలు ఏ నేరంతోనూ సంబంధం లేనివారని సక్సేనా చెప్పారు. శిక్ష విధింపునకు అవకాశమిస్తే అమాయకులు బలైపోతారని హెచ్చరించారు. అయినా దాన్ని చివరకు పార్లమెంటు నిర్ణయానికి వదిలేశారు.
ఉరిశిక్ష పడిన ఖైదీల్లో చాలామంది(74.1శాతం) ఆర్ధిక స్థోమత లేనివారని నివేదిక చెబుతోంది. అలాగే వారిలో 76 శాతంమంది(279మంది) సమాజంలో అట్టడుగు కులాలవారూ, మతపరంగా మైనారిటీలు. జాతీయ స్థాయిలో చూస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు 24.5 శాతం ఉన్నారు. అయితే మహారాష్ట్రలో 50శాతంమంది, కర్ణాటకలో 36.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 36 శాతం, బిహార్‌లో 31.4 శాతం, జార్ఖండ్‌లో 30.8 శాతం మంది ఈ వర్గాలవారే. వీరిలో 85.4 శాతంమంది ఆర్ధికంగా దుర్బలులే. మరణశిక్ష పడినవారిలో మైనారిటీలు 20.7 శాతం. వీరి జనాభా నిష్పత్తిని బట్టి చూస్తే ఇది అధికం.
అలాగే ఈ మైనారిటీ ఖైదీల్లో 76శాతంమంది ఆర్ధికంగా స్థోమత లేనివారు. ఉరిశిక్ష పడినవారితో జైల్లో పని చేయించరు గనుక వారికి ఎలాంటి ఆదాయమూ ఉండదు. కనుక తమ కుటుంబాలకు అంతో ఇంతో పంపడం వారికి సాధ్యంకాదు. ఆ విధంగా ఉరిశిక్ష పడిన ఖైదీల కుటుంబాలు కూడా నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. న్యాయ వాదిని నియమించుకోలేనివారికి న్యాయ సహాయం అందించడం తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఉరిశిక్ష పడిన 189మంది ఖైదీల్లో 169మందికి అసలు న్యాయవాదులే లేరని తేలింది. అంటే వారిపై వచ్చిన అభియోగాల్లోని అహేతుకతను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినవారే లేరన్న మాట!
కొందరు ఖైదీలు చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది.
ఏవో కొన్ని పత్రాలపై సంతకాలు చేయాలంటూ పోలీసులు తీసుకుపోయారని, ఆ తర్వాత ఇంటి ముఖం చూడలేదని, చివరకు ఇంత పెద్ద శిక్ష పడి దిక్కుతోచకుండా కాలం వెళ్లదీస్తున్నామని వెల్లడించినవారున్నారు. అరెస్టుకూ, న్యాయస్థానంలో హాజరు పరచడానికీ మధ్య ఎన్ని రకాల చిత్రహింసలు అనుభవించాల్సివచ్చిందో, ఎంత నరకం చవిచూడాల్సివచ్చిందో...పర్యవసానంగా చేయని తప్పును నెత్తిన వేసుకుని ఉరికి ఎలా చేరువైనామో మరికొందరు చెప్పారు. ఉరిశిక్ష పడిన ఖైదీలకు ఉండాల్సిన హక్కులు, వారు పొందగల న్యాయసహాయం వంటి అంశాలపై రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.
కానీ ఆచరణలో అవి ఎలా అమలవుతున్నాయో ఇప్పుడు జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిం చడంతోపాటు ఆ శిక్ష పడిన ఖైదీలకు కనీస హక్కులు లేకుండా చేయడంపై హక్కుల సంఘాలు చాలా కాలంనుంచి ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి సంఘాలకు ఉద్దేశాలను ఆపాదించడంలో ఉన్న శ్రద్ధ...వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవడంలో లేకుండా పోయిందని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి లోపాలను సరిదిద్దుకోవడం తక్షణావసరమని గుర్తించాలి.