మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం
ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్‌ఐపీబీ) నుంచి అనుమతులు ఇప్పించడం కోసం లంచం తీసుకున్నారన్న ఆరోపణపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధ వారం సీబీఐ అరెస్టు చేసింది. కార్తీని 5 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గురువారం ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. అధికారంలో ఉండగా రాజ కీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు సీబీఐని ఉపయోగించుకున్నదని ఆరో పణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ కేసు విషయంలో అదే ఆరోపణ చేస్తున్నది.
దానిలోని నిజానిజాల సంగతలా ఉంచి బ్రిటన్ నుంచి వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసినప్పుడు చోటుచేసుకున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. ఆ హడావుడి చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారైన నీరవ్‌మోదీ తరహాలో వేరే దేశానికి కార్తీ పరారవుతున్నాడేమో, దాన్ని నివారించడానికి సీబీఐ వలపన్ని అరెస్టు చేయాలని చూస్తున్నదేమోనన్న అ నుమానం కలుగుతుంది. కానీ ఆయన మరో దేశం నుంచి ఇక్కడ అడుగుపెట్టాడు.
ఈ కేసులో నిరుడు మే నెలలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారం యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2007 నాటిది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా ఆ సంవత్సరం మార్చి 13న ఎఫ్‌ఐపీబీని ఆశ్రయించగా, రూ. 4.62 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తెచ్చుకునేందుకు ఆ ఏడాది మే 30న దానికి అనుమతి లభించింది. అయితే అదే సమయంలో తమ అనుబంధ సంస్థ ఐఎన్‌ఎక్స్ న్యూస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలన్న ఆ సంస్థ వినతిని మాత్రం తిరస్కరించింది.
అందుకు వేరే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఐఎన్‌ఎక్స్ మీడియా ఎఫ్‌ఐపీబీ తనకు విధించిన పరిమితుల్ని ఉల్లంఘించి రూ. 4.62 కోట్లకు బదులు రూ. 305 కోట్ల ఎఫ్‌డీఐలను తీసుకు రావడమేగాక అందులో 26 శాతాన్ని ఐఎన్‌ఎక్స్ న్యూస్‌కు మళ్లించింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐపీబీ ఐఎన్‌ఎక్స్ మీడియా నుంచి వివరణ కోరినప్పుడు కార్తీ చిదంబరం జోక్యం చేసుకుని ఆ మండలిలోని కొందరిని ప్రభావితం చేశారన్నది సీబీఐ ఆరోపణ.
ఇలా ప్రభావితం చేసినందుకు ఆయన పరోక్షంగా నియంత్రిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఐఎన్‌ఎక్స్ మీడియా నుంచి రూ. 10 లక్షలు ముట్టాయని సీబీఐ చెబుతోంది. ఆదాయపు పన్ను విభాగం దర్యాప్తు నుంచి తప్పించేందుకు కార్తీకి మరో మూడున్నర కోట్ల రూపాయలు, భారీయెత్తున షేర్లు అందాయన్నది మరో ఆరోపణ.
ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు కార్తీ సీఏ భాస్కరరామన్ కంప్యూటర్‌లో లభించాయని సీబీఐ అంటోంది. కుమార్తె షీనాబోరాను హత్య చేసిన కేసులో విచారణనెదుర్కొంటున్న దంపతులు ఇంద్రాణీ ముఖర్జీ, పీటర్ ముఖర్జీలిద్దరూ కలిసి స్థాపించిన సంస్థ ఐఎన్‌ఎక్స్ మీడియా. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు రెండూ ఇప్పటికే ఈ కేసులో కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించాయి. ఆయనను ఈడీ అనేకసార్లు ప్రశ్నించింది. చివరకు విదేశాలకు వెళ్లే వీలు లేకుండా లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది.
నేరుగా కార్తీ సంస్థకు అందిన రూ. 10 లక్షలు కాక ఇతర ముడుపులు విదేశాల్లో ఆయన పేరనున్న ఖాతాల్లోకి చేరాయని ఈడీ ఆ రోపించింది. తన కుమార్తెను ఉన్నత చదువుల్లో చేర్చేందుకు బ్రిటన్ వెళ్లడానికి అవ రోధంగా ఉన్న లుకౌట్ నోటీసుకు వ్యతిరేకంగా కార్తీ గత నవంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అలా వెళ్లనిస్తే విదేశీ ఖాతాలన్నిటినీ ఆయన మాయం చేసే ప్రమాదమున్నదని సీబీఐ వాదించింది.
చివరకు న్యాయస్థానం అనుమతితో కార్తీ వెళ్లి వచ్చారు. ఆయన వెళ్లాక బయటపడిన మరిన్ని ఆధారాలతోనే ప్రస్తుతం కార్తీని అరెస్టు చేయాల్సివచ్చిందని సీబీఐ చెబుతోంది. ఈ కేసు పరిధిని మరింత విస్తృతపరిచి చిదంబరాన్ని అరెస్టు చేస్తారా అన్నది కీలకమైన ప్రశ్న. కేంద్ర ఆర్థికమంత్రి హోదాలో ఎఫ్‌ఐపీబీకి చిదంబరం ఇన్‌చార్జి. తాము కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో చిదంబరాన్ని కలిసినప్పుడు కార్తీ వ్యాపారానికి సహకరించమని ఆయన తమను కోరారని పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.
ఈ కేసు మాత్రమే కాదు...చిదంబరంపై భారత్‌కు చెందిన ఎయిర్‌సెల్‌ను 2006లో మలేసియా సంస్థ మాక్సిస్ టేకోవర్ చేయడానికి ఎఫ్‌ఐపీబీ అనుమతి మంజూరు చేసిన వ్యవహారం కూడా ఉంది. ఆ సమయంలో టెలికమ్యూనికేషన్ల రంగంలో గరిష్టంగా 74శాతం ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతి ఉండగా మాక్సిస్ 99.3శాతం వరకూ పెట్టింది. పైగా నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐపీబీ సిఫార్సులు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం(సీసీఈఏ)కు వెళ్లి అక్కడ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆ ఫైలు అటు పోకుండానే చిదంబరం అనుమతులు మంజూరు చేశారన్నది ఆరోపణ.
ఐఎన్‌ఎక్స్ మీడియాలోగానీ, ఎయిర్ సెల్–మాక్సిస్ వ్యవహారంలోగానీ పరిమితులకు మించి ఎఫ్‌డీఐలకు అనుమ తిం చడం అనుమానాలకు తావిస్తున్నదని బీజేపీ నాయకుడు సుబ్ర హ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఎయిర్‌సెల్ కేసును ‘అన్ని కోణాల్లోనూ’ దర్యాప్తు చేస్తున్నట్టు నిరుడు ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే నిరుడు డిసెంబర్‌లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజాతోసహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేకకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలి.
నిందితుల అపరాధాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలను సేకరించడంలో, నిరూపించడంలో సీబీఐ ఘోరంగా విఫలమైం దని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కార్తీ కేసులో లభించాయంటున్న ఆధారాలు న్యాయస్థానాల్లో నిలబడేవిధంగా సీబీఐ దర్యాప్తు చేస్తుందా అన్నదే కీలకమైన ప్రశ్న. కార్తీ అరెస్టుకు చేసిన హడావుడి వల్ల కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎంత నష్టం కలుగు తుందోగానీ...సరిగా నిరూపించలేకపోతే అప్రదిష్టపాలయ్యేది సీబీఐ మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment