అనుకున్నంతా అయింది. దాదాపు పుష్కరకాలం క్రితం అమల్లోకొచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో ఉన్న అనేక లొసుగుల్ని సవరించి ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించాలని పలు ఆదివాసీ సంఘాలు, హక్కుల సంఘాలు చేస్తున్న వినతుల్ని పట్టించుకోని ప్రభుత్వాల తీరువల్ల ఇప్పుడు ఆది వాసీల ఉనికికే ముప్పు ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 16 రాష్ట్రాల్లో తరతరాలుగా అడవినే నమ్ము కుని జీవిస్తున్న 11 లక్షలమందికిపైగా ఆదివాసీ కుటుంబాలకు ఆ చట్టం కింద అర్హత లభించలేదు గనుక వారిని దురాక్రమణదారులుగా గుర్తించి అక్కడినుంచి వచ్చే జూలైలోగా ఖాళీ చేయించాలని ఈనెల 13న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. 2005 డిసెంబర్ 13నాటికి అడవులపైనా, వాటిద్వారా లభించే ఉత్పత్తులపైనా ఆధారపడి జీవించే ఆదివాసీలకు ఈ చట్టంకింద గుర్తింపు, అర్హత లభిస్తాయి.
అలాగే గిరిజనేతరుల విషయానికొచ్చేసరికి వారు కనీసం మూడు తరాలుగా (75 ఏళ్లుగా) అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు నిరూపించే సాక్ష్యాలు, పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు రూపొందించిన నియమ నిబంధనలు మొత్తం ప్రక్రియనే సంక్లిష్టంగా మార్చాయి. అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలైనా, మరొకరైనా దాన్ని ధ్రువీకరిం చేందుకు సాక్ష్యాలు, పత్రాలు సమర్పించాలనడంలోనే ఎంతో తిరకాసు ఉంది. 2005 డిసెంబర్‌నాటికి తాము అటవీ ప్రాంతంలో ఉండి, అక్కడ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నామని, తాము సాగుచేసు కుంటున్న భూములపై తమకు హక్కులున్నాయని నిరూపించుకోవడానికి లేదా 75 ఏళ్లుగా అక్కడే ఉండి సాగుచేసుకుంటున్నామని నిరూపించుకోవడానికి సమర్పించాల్సిన పత్రాల జాబితా చేంతా డంత పెరిగి వాటిని సంపాదించడం, దఖలు పర్చడం కష్టతరంగా మారింది.
అందువల్లే భారీ సంఖ్యలో.. అంటే దాదాపు 40 లక్షల అభ్యర్థనల్లో 19 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ స్థాయిలో తిరస్కరణలున్నప్పుడు పాలకులు ఆలోచించి ఉండాల్సింది. తమ నియమనిబంధనలు ఇందుకు దోహదపడ్డాయేమోనని శంకించాల్సింది. కానీ అవి పట్టనట్టు ఉండిపోయాయి. ఈలోగా అసలు ఆ చట్టమే రాజ్యాంగ విరుద్ధమని, అది వన్యప్రాణి సంరక్షణ చట్టం, మరికొన్ని ఇతర చట్టా లను ఉల్లంఘిస్తున్నదని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని విచారించే సందర్భంగా ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది. విచారణలో తన వైఖరేమిటో విస్పష్టంగా వివ రించి, ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన కేంద్రం ఆ విషయంలో దారు ణంగా విఫలమైంది.
ఆ చట్టం అమల్లో ఆదివాసీలకు అడుగడుగునా సమస్యలెదురవుతున్నా ఇన్నేళ్లుగా పాలకులు పట్టనట్టు ఉండిపోయారు. ఆదివాసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కులు ఈ చట్టం ద్వారా వారికి దఖలు పడటం లేదు. సరికదా అధికార యంత్రాంగాల కుమ్మక్కు ధోరణుల వల్ల కార్పొరేట్ సంస్థలు దొడ్డిదారిన ప్రవేశిస్తున్నాయి. ‘ల్యాండ్ కాన్‌ఫ్లిక్ట్ వాచ్’(ఎల్‌సీడబ్ల్యూ) అనే సంస్థ గణాంకాల ప్రకారం నిరుడు జనవరినాటికి 11 రాష్ట్ర ప్రభుత్వాలు 26 కేసుల్లో గ్రామసభల అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి అడ్డగోలుగా అటవీ భూముల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేశాయి. ఆదివాసీలకు జరిగిన ‘చారి త్రక అన్యాయాన్ని’ సరిదిద్ది, అటవీ ప్రాంతాల్లో వారు ఉండటానికి, అడవులపై వారికుండే హక్కుల్ని గుర్తించి పరిరక్షించడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు అప్పటి యూపీఏ ప్రభుత్వం చెప్పింది. అటవీ భూమిపైనా, దానిద్వారా లభించే సంపదపైనా ఆదివాసీలకుండే వ్యక్తిగత, సాముదాయక హక్కుల్ని ఈ చట్టం గుర్తిస్తున్నదని తెలియజేసింది.
అడవుల యాజమాన్యం ఆదివాసీలకే అప్పగించడం, ఆదివా సీలెవరో కానిదెవరో గుర్తించి నిజమైనవారి హక్కుల్ని పరిరక్షించడం వంటి బాధ్యతలను గ్రామసభ లకు అప్పగించింది. కానీ సంక్లిష్టమైన ప్రక్రియ ఆ గ్రామసభలను సైతం నిస్సహాయంగా మార్చింది. వాస్తవానికి ఈ చట్టం అడవులపై ఆదివాసీలకుండే సహజమైన హక్కుల్ని గుర్తించడం లేదనే చెప్పాలి. కేవలం తమ జీవిక కోసం అటవీ ప్రాంతంలో లభించే సంపదను వినియోగించుకోవడానికి మాత్రమే ఆదివాసీలకు వీలుకల్పిస్తోంది. దేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఏలుబడి ప్రారంభం కాక మునుపు ఆదివాసీ ప్రాంతాలపై అక్కడివారికే సర్వహక్కులూ ఉండేవి. వాటిని రద్దు చేసిన పర్యవసానంగా దేశంలోని పలుప్రాంతాల్లో ఆదివాసీలు ప్రాణాలకు తెగించి పోరాడారు. విచారించాల్సిన విషయమే మంటే స్వతంత్ర భారతంలో సైతం ఆ హక్కులు ఆదివాసీలకు సంపూర్ణంగా దఖలు పడలేదు. ఆది వాసీలకు జరిగిన ‘చారిత్రక అన్యాయాన్ని’ సరిదిద్దుతున్నామని చెప్పి తీసుకొచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం సైతం ఆ విషయంలో విఫలమైంది.
ఆనకట్టల నిర్మాణం, వన్యప్రాణి సంరక్షణ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్, ‘అభివృద్ధి’ వగైరాల పేరిట ఆదివాసీలు నష్టపోతున్నారు. దేశంలోని 8 కోట్ల 56 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోని వనరులపై లక్షా 70 వేల గ్రామాల్లో నివసిస్తున్న 20 కోట్లమంది ఆదివాసీలకు హక్కులిస్తున్నామని చెప్పే చట్టం అమల్లో ఉన్నా ఇదంతా యధేచ్ఛగా జరిగిపోతోంది. కార్పొరేట్లకు అటవీ భూముల్ని కట్టబెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు లోగడ తామే ఇచ్చిన వ్యక్తిగత పట్టాలు లేదా సాముదాయక పట్టాలను ఆదివాసీలనుంచి బలవంతంగా తీసుకుంటున్నాయని ఎల్‌సీడబ్ల్యూ సోదాహరణంగా తెలి పింది. ఆదివాసీలు అక్కడుండే క్రూరమృగాలతో సావాసం చేస్తున్నారు. వాటికి బయటివారి నుంచి ముప్పు కలగకుండా కాపాడుతున్నారు. అక్కడి సంపద కైంకర్యం కాకుండా పరిరక్షిస్తున్నారు. దుర దృష్టవశాత్తూ దీన్ని ప్రభుత్వాలు గుర్తించడంలేదు. వారి ప్రయోజనాలకు భంగంవాటిల్లే చర్యలకు పూనుకుంటున్నాయి. అందువల్లే ఆదివాసీ ప్రాంతాల్లో నక్సల్స్, ఇతర ఆదివాసీ హక్కుల సంఘాల ఉద్యమాలకు ఆదరణ లభిస్తోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు లక్షలాదిమంది ఉనికికే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది గనుక ఈ అశాంతి మరింతగా పెరుగుతుంది. ఆ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే కేంద్రం తక్షణం ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆదివాసీల హక్కులను పరిరక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment