
భారత స్టార్ షట్లర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలకు చెందిన అంశంలో... భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, కోచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో లక్ష్యసేన్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు విచారణకు ఆదేశించగా... ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం... లక్ష్యసేన్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన ఎంజీ నాగరాజ్‌తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లక్ష్యసేన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈ నెల 19న తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ లక్ష్యసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దేశ అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లక్ష్యసేన్ తల్లిదండ్రులు నిర్మల, ధీరేంద్రతో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్, కోచ్ విమల్ కుమార్... కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఉద్యోగితో కలిసి జనన ధ్రువీకరణ రికార్డులను తప్పుగా మార్పించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి...
» ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఆడేందుకు వీలుగా లక్ష్యసేన్‌తో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్ వయసును రెండున్నరేళ్లు తక్కువగా నమోదు చేసినట్లు నాగరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
» లక్ష్యసేన్ కుటుంబ సభ్యులతో పాటు కోచ్ విమల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
» తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ లక్ష్యసేన్ కుటుంబంపై 2022 డిసెంబర్‌లో నాగరాజ్ కర్ణాటక పోలీసులను ఆశ్రయించగా... వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
» కేసును విచారించిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆధారాలు లేవని కొట్టి వేసింది. జస్టిస్ ఉమ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు.
» దీంతో పిటిషన్ వేసిన నాగరాజ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించి వాటిని న్యాయస్థానానికి అందజేశారు. దీంతో పాటు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంక్వైరీ రిపోర్టును కూడా జత చేశారు. అందులో రికార్డుల తారుమారు అంశంలో లక్ష్యసేన తండ్రి ధీరేంద్ర సేన్ తప్పు అంగీకరించిన వివరాలు ఉన్నాయి.
» మరోవైపు ఆరోపణలు నిరాధారమని లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.2018లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ఈ అంశాన్ని విచారించి ఎలాంటి అవకతవకలు లేవని ముగించిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే నాగారాజ్ ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు.
» పిటిషన్ వేసిన నాగరాజ్ 2020లో కుమార్తెను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పించాలని ప్రయత్నించగా... ఆ బాలిక ఎంపిక కాలేదు. దీంతో నిరాశలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.
» లక్ష్యసేన్ సోదరుడు చిరాగ్ సేన్... గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 2016లో భారత బ్యాడ్మింటన్ సంఘం అతడిపై నిషేధం కూడా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment