సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. అవినీతి కేసులో డీకే శివకుమార్ సీబీఐ దర్యాప్తుపై గతంలో కర్ణాటక హైకోర్టు స్టే ఇవ్వగా.. హైకోర్టు ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ విచారణపై హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే ఇచ్చిందని సుప్రీంకు ఆయన తెలిపారు.
డీకే శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సీబీఐ అప్పీల్ దాఖలు చేసిందని, అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన తదుపరి మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేసేందుకు నిరాకరించిందని కోర్టుకు పేర్కొన్నారు.
ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. అదే విధంగా తమ ముందున్న కేసును త్వరగా పరిష్కరించాలని హైకోర్టును కోరేందుకు సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం సీబీఐ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
కాగా డీకే శివకుమార్ అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10న స్టే ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసులో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని విచారణ సంస్థను ఆదేశించింది. శివకుమార్‌పై నమోదైన కేసులు 2020 నాటివని నొక్కి చెబుతూ.. గడిచిన రెండేళ్లుగా జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై తుది రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
ఇక 2017లో డీకే శివకుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఐటీ శాఖ అందించిన సమాచారం ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అతనిపై విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా డీకే శివకుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25, 2019న అప్పటి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. అక్టోబర్ 8, 2020న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఎఫైఆర్ నమోదైంది. అయితే దీనిని సవాలు చేస్తూ శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం
Comments
Please login to add a commentAdd a comment