ప్రధానమంత్రుల రాష్ట్రంగా ముద్రపడిన ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే పోలింగ్‌లో మూడు దశలు పూర్తయి, నాలుగు రోజుల్లో నాలుగో దశ జరగబోతుండగా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. వారణా సిలో ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ బరిలో ఉండొచ్చునన్న ఊహాగానా లకు తెరపడింది. గతంలో మోదీపై పోటీ చేసిన అజయ్‌రాయ్‌నే కాంగ్రెస్ ఎంపిక చేసింది. అటు ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమి కూడా స్థానిక అభ్యర్థి శాలినీయాదవ్‌ను నిలుపుతోంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో తలపడి 2 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గద్దెదించుతామంటున్న విపక్షాలు మోదీపై కనీసం బలమైన అభ్యర్థిని నిలబెట్టలేకపోవడం ఆశ్చర్యకరమే. అయితే కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకూ ప్రియాంకా గాంధీని బరిలో నిలపకపోవడం ఒకరకంగా తెలివైన నిర్ణయం. ఒకప్పుడు కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో తిరుగులేని శక్తే కావొచ్చుగానీ... ఇప్పుడది నామమాత్రావశిష్టమైంది. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక అడుగుపెట్టి నిండా నాలుగు నెలలు కాలేదు. అంతక్రితం తల్లి సోనియాగాంధీ, సోద రుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించే అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పనిచేసిన అను భవం మాత్రమే ఆమెకుంది. నాలుగు నెలలక్రితం ప్రియాంకకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కట్ట బెట్టి, తూర్పు యూపీ బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ తగినన్ని స్థానాలు గెల్చుకోవడం మాట అటుంచి, కనీసం ఓట్ల శాతం గణనీయంగా పెంచుకోగలిగినా పార్టీ లోపలా, బయటా ప్రియాంక ప్రాధాన్యత పెరుగుతుంది. వాస్తవానికి ఆమె రాకతో యువత, మహి ళలు మరింత చేరువవుతారని కాంగ్రెస్ అంచనా వేసినా ఆ స్థాయిలో స్పందన లభించలేదు.
అయితే ప్రధాని మోదీ చేసే విమర్శలకు ప్రియాంక దీటుగా బదులిస్తున్నారు. ఆయన ముమ్మ రంగా చేస్తున్న విదేశీ పర్యటనల గురించి, విదేశీ బ్యాంకుల్లోని నల్లడబ్బు తీసుకొచ్చి దేశ పౌరులకు ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రు. 15 లక్షలు జమ చేస్తానని 2014లో ఇచ్చిన హామీ గురించి ప్రశ్ని స్తున్నారు. ఇవన్నీ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి పనికొస్తాయి. ప్రజల్ని ఎంతోకొంత ఆలోచిం పజేస్తాయి. కానీ ఇవి మాత్రమే ఓట్లు రాల్చవు. వాస్తవానికి ప్రియాంకను క్రియాశీల రాజకీయాల్లోకి దించడం వెనక కాంగ్రెస్‌కు వేరే వ్యూహముంది. రాష్ట్రంలో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సారథ్య బాధ్యతలు ఆమెకు అప్పగించాలన్నది రాహుల్‌గాంధీ ఆంతర్యం. ఇప్పుడు ఎటూ ఓడిపోయే వారణాసిలో ఆమెను ప్రత్యర్థిగా నిలపడం వల్ల ఆ వ్యూహం దెబ్బ తింటుంది. నిజానికి వారణాసిలో పోటీ చేయడం విషయంలో ప్రియాంకే ఊహాగానాలకు తెరలే పారు. సోనియా స్థానంలో ఈసారి మీరు పోటీ పడే అవకాశం ఉన్నదంటున్నారు... నిజమేనా అని అడిగినప్పుడు, ‘అక్కడే ఎందుకు పోటీ చేయాలి. వారణాసిలో చేయకూడదా? పార్టీ ఆదేశించాలే గానీ ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తాన’ని ఆమె ఇచ్చిన జవాబుతో ఈ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. మెజారిటీ ఎంత ఉండొచ్చునన్న అంచనాలు తప్ప గెలుపు గురించి సంశయమే లేని మోదీకి ప్రత్యర్థిగా ఆమె బరిలో నిలబడటం కాంగ్రెస్ భవిష్యత్తు వ్యూహానికి ఏమాత్రం తోడ్పడదు కనుకనే నామమాత్రపు పోటీ నిచ్చే అజయ్‌రాయ్‌నే ఎంపిక చేశారని భావించవచ్చు. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ–ఎస్‌పీ– బీఎస్‌పీల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసినా అనూహ్యంగా ఎస్‌పీ, బీఎస్‌పీలు ఒక ఒప్పందానికొచ్చి తమతో జాట్ వర్గంలో పలుకుబడి ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ను చేర్చుకుని కూటమిని ఏర్పరిచాయి. కాంగ్రెస్‌ను ఏకాకిని చేశాయి. ఫలితంగా బీజేపీకి, ఈ కూటమికి మధ్యే హోరాహోరీ యుద్ధం జరగబోతోంది. ఈ మూడు ప్రాంతీయ పార్టీల కలయిక బీజేపీని ఏమేరకు దెబ్బతీయగలదన్నదే ప్రధాన ప్రశ్న. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి 22 లోక్‌సభ స్థానాలు గెల్చుకుంది. అప్పట్లో కల్యాణ్‌సింగ్ బీజేపీ నుంచి బయటకొచ్చి ఎస్‌పీ మద్దతు పలకడంతో ముస్లింలంతా అలిగి కాంగ్రెస్‌కు మద్దతు పలి కారు. కనుకనే కాంగ్రెస్‌కు అన్ని స్థానాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడా పరిస్థితులు లేవు.
ఎస్‌పీ–బీఎస్‌పీల కూటమి గురించి బీజేపీ పైకి ఏం చెప్పినా దాని భయాలు దానికున్నాయి. రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఎస్‌పీ, బీఎస్‌పీ, కాంగ్రెస్‌ల నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు 50మందిని బీజేపీ చేర్చుకుంది. సిట్టింగ్ ఎంపీల పట్ల జనంలో వ్యతిరేకత ఉన్నదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో వారిని కొనసాగించకతప్పదన్న నిర్ణయానికొచ్చింది. పర్యవసానంగా అయిదారుగురు మినహా మిగిలినవారందరికీ మళ్లీ పార్టీ టిక్కెట్లు లభించాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు, జాతీయ భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలే బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలయ్యాయి. అదే సమయంలో అటు ఎస్‌పీ, బీఎస్‌పీలు కూడా అఖిలేష్, మాయావతిలను చూపించి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఏతావాతా అటు బీజేపీగానీ, ఇటు కూటమిగానీ అభ్యర్థుల ఊసెత్తకపోవడం గమనించదగ్గ విషయం. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పినా, ప్రత్యర్థులపై ఎంతగా నిప్పులు చెరిగినా అంతిమంగా పార్టీల కార్యాచ రణ ఎలా ఉందన్నదే కీలకమవుతుంది. మోదీపై విమర్శలు గుప్పిస్తూ, ఈసారి కేంద్రంలో తామే అధి కారంలోకొస్తామని చెబుతున్న ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమిగానీ, కాంగ్రెస్‌గానీ ఆయన పోటీ చేసే చోట కనీసం బలమైన అభ్యర్థిని నిలపడంలో విఫలమయ్యాయి. నామమాత్రపు పోటీనిచ్చే స్థానిక అభ్య ర్థులకే వారణాసిని వదిలిపెట్టాయి. పైగా, జాతీయస్థాయిలో ఎన్‌డీఏకు దీటుగా బలమైన కూటమిని నిర్మించలేకపోయాయి. మాటలకూ, చేతలకూ పొంతన ఉన్నప్పుడే జనం విశ్వాసాన్ని గెలుచుకోగల మని విపక్షాలు గ్రహించాలి.
వారణాసి పోరు
Published Fri, Apr 26 2019 12:38 AM | Last Updated on Fri, Apr 26 2019 5:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment