ఉన్నత విద్యకు తూట్లు | higher education in trouble | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు తూట్లు

Published Mon, Aug 17 2015 2:47 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

ఉన్నత విద్యకు తూట్లు - Sakshi

ఉన్నత విద్యకు తూట్లు

సందర్భం
 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ పార్లమెంటు సభ్యులు ఎమ్ నారాయణ రెడ్డి రాస్తున్న బహిరంగ లేఖలలో ఇది అయిదవది. తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థకు గతంలో జరిగిన అన్యాయాన్ని సోదాహరణం గా వివరిస్తూ ఆయన రాసిన లేఖ సంక్షిప్త పాఠాన్ని అందిస్తున్నాం.

ప్రియమైన చంద్రశేఖరరావు గారూ, ఇది నేను మీకు రాసి పంపుతున్న అయిదవ ఉత్తరం. ప్రస్తుతం విద్యా శాఖలు, విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్ర చర్చకోసం ఈ ఉత్తరంలో ప్రతిపాదిస్తున్నాను.

1. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలతో కూడిన ప్రాంతీ య కమిటీ మనకు ఉండేది. తెలంగాణ ప్రాంతంలో విద్యా వ్యవహారాలపై ఆ కమిటీ 1974 వరకు ఒక వాచ్ డాగ్‌లా పనిచేసేది. అయితే 1973లో జరిగిన జై ఆంధ్ర ఆందోళన తర్వాత ఆ కమిటీని 1974లో రద్దుచేశారు. ఆనాటి నుంచి ఆంధ్రపాలకులు చూపిస్తూ వచ్చిన వివక్ష, ప్రాంతీయ పక్షపాతం కారణంగా తెలంగాణ ప్రాంతంలో విద్య ఘోరంగా వెనుకంజ వేసింది.

2(ఎ). ఆంధ్రా పాలకుల తీవ్ర వివక్ష, ప్రాంతీయ పక్ష పాతాన్ని వివరించడానికి తెలంగాణలో ప్రైవేట్ ఎయి డెడ్ కళాశాలలకు సంబంధించిన చక్కటి ఉదాహరణను నేను ప్రస్తావిస్తాను. 2012లో రాష్ట్రంలోని మొత్తం ఎయి డెడ్ కళాశాలల సంఖ్య 170. వీటిలో తెలంగాణలోని 9 జిల్లాల్లో 21 కళాశాలలు మాత్రమే ఉండగా, 149 ఎయిడెడ్ కళాశాలలు ఆంధ్రాలో ఉండేవి.

బి. ఇక 2011-12 సంవత్సరానికి గాను రెండు ప్రాం తాలకు అందించిన వార్షిక ధనసహాయం(గ్రాంట్ ఇన్ ఎయిడ్)కి సంబంధించి పరిశీలిస్తే ఎంత ఘోరమైన వివక్ష ప్రదర్శించారో తెలుస్తుంది:
 పై పట్టికను పరిశీలిస్తే ఆంధ్రా కాలేజీలకు రూ. 348 కోట్ల వార్షిక ధనసహాయం అందించగా, తెలంగా ణ కాలేజీలకు ముట్టింది రూ. 29 కోట్లు మాత్రమే.

సి.కోస్తాంధ్రలోని నాలుగు జిల్లాల్లోని ఎయిడెడ్ కళాశాలలకు 2011-12 సంవత్సరాల్లో రూ.214 కోట్ల ను వార్షిక గ్రాంటుగా అందజేశారు. వాటి వివరాలు :
1. గుంటూరు- రూ. 103 కోట్లు, 2. కృష్ణా - రూ. 52 కోట్లు, 3. పశ్చిమ గోదావరి - రూ. 39 కోట్లు, 4. తూర్పు గోదావరి- రూ. 30 కోట్లు.

3. తెలంగాణలో ఎయిడెడ్ మహిళా కళాశాలలు మూడు మాత్రమే ఉండగా, ఆంధ్రాలో 13 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2011-12కు గాను ఆంధ్రా ఎయిడెడ్ మహిళా కళాశాలలకు రూ.30.42 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకటించగా, తెలంగాణ కళాశాలలకు అదే ఏడాది రూ.3.50 కోట్లు మాత్రమే మంజూరు చేశారు.

4. విద్యాపరంగా వెనుకబడిన తెలంగాణకు మరిన్ని నిధులను మంజూరు చేయడానికి బదులుగా ఆంధ్రా పాలకులు తెలంగాణ అదనపు నిధులను తమ ప్రాం తానికి మళ్లించుకున్నారు. డి.శ్రీనివాస్ ఉన్నత విద్యా మంత్రిగా ఏపీ శాసనసభలో జరిగిన ఒక ముఖ్య ఘట నను ప్రస్తావిస్తాను. నిజామాబాద్‌లోని మహిళా కళాశాలకు వార్షిక గ్రాంట్ మంజూరు చేయడంపై తెలం గాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి ఒక ప్రశ్న లేవనెత్తారు.

ఆ కళాశాల తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నప్పటికీ దానికి సహాయం చేయడంలో ఉన్నత విద్యా మంత్రి తన నిస్సహాయత ను వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆంధ్రా మంత్రు లు తమ తమ నియోజకవర్గాల్లోని ఎయిడెడ్ కాలేజీలకు భారీ మొత్తంలో నిధులను కేటాయించడానికి తమ అధికారాలను పూర్తిగా ఉపయోగించుకున్నారు. పిన్న మనేని వెంకటేశ్వరరావు ఉన్నత విద్యామంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రాంతంలోని ఎయిడెడ్ కళాశాలలకు కేటాయింపులను పెంచారు.  

5. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ : తెలంగాణ కాలేజీలకు జరుగు తున్న అన్యాయానికి సాక్ష్యంగా ఎయిడెడ్ కళాశాలల సమస్యను టీఆర్‌ఎస్‌తో పాటు తదితర సంస్థలు కూడా 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు లేవనెత్తాయి.  జరిగిన అన్యాయాన్ని కమిటీ తన పరిశీలనలో కనుగొని దానిని తన నివేదికలో నమోదు చేసింది. తెలంగాణ ఎయిడెడ్ కళాశాలలకు తగినన్ని నిధులను మంజూరు చేయడం ద్వారా ఈ సమస్యను సరిదిద్ద వచ్చని కమిటీ  సిఫార్సు చేసింది కూడా. కానీ ఆంధ్రా పాలకులు దీన్ని కూడా అమలు చేయలేదు. కాబట్టి సీఎంగా మీరు 2006నాటి జీఓ నంబర్ 35తోపాటు ఉన్నత విద్యాశాఖ లోని తెలంగాణ వ్యతిరేక జీవోలన్నింటినీ రద్దు చేయడ మే కాకుండా తెలంగాణ ఎయిడెడ్ కాలేజీలకు పూర్తి స్థాయి గ్రాంట్‌లను అందించగలరు.

నాలుగు దశాబ్దాలైపైగా కేంద్రప్రభుత్వ విధానాలు విద్యారంగంలో మౌలిక సంస్కరణలను ప్రతిపాదిస్తూ వచ్చాయి. 1968నాటి తొలి పాలసీ విద్యలో మౌలిక పునర్వవస్థీకరణను కోరుకోగా, 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతగా ప్రతిపాదించారు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం విద్యలో వ్యత్యాసాలను తొలగించి అందరికీ సమానా వకాశాలను కల్పించాలని ప్రకటించింది. ఇక 1993లో ఏపీలో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసును విచారించిన సుప్రీంకోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించడానికి విద్య ప్రాథమికహక్కు అంటూ చరిత్రాత్మక తీర్పును ప్రకటించింది.

2005లో యూపీఏ హయాంలో విద్యా హక్కు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇలా అన్ని విధానాలూ విద్యారంగంలో మౌలిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతూ వచ్చాయి కానీ ఆంధ్రా పాలకులు మాత్రం వాటికి అనుగుణంగా ఒక్కటంటే ఒక్క చర్యను కూడా తీసుకోలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి సంబంధించి అన్ని అవకా శాలను తెలంగాణ ప్రాంతం కోల్పోయింది.

ముగింపుః తెలంగాణలోని వేలాది విద్యాసంస్థల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత విద్యాశాఖ పాలనా వ్యవస్థ మౌలిక మార్పుకు గురికా వలసి ఉంది. విశ్వవిద్యాలయాలలో వలే విద్యాశాఖకు ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను, భారతీయ 2వ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా విద్యాశాఖలో జాయింట్ సెక్రటరీల స్థానంలో ప్రొఫెషనల్స్, మేనేజ్‌మెంట్ నిపుణులను నియమించాలి. కళాశాల విద్యలో సమూల మార్పునకు సంబంధించి మీరు తగు చర్యలు చేపట్టగలరని ఆశిస్తున్నాను.
 
 - ఎం. నారాయణరెడ్డి
(వ్యాసకర్త మాజీ పార్లమెంటు సభ్యులు)
 మొబైల్ 7702941017

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement