మళ్లీ ‘రాజద్రోహం’! | International human rights organization | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘రాజద్రోహం’!

Published Wed, Aug 17 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

International human rights organization

నిండా ఆర్నెల్లు పూర్తి కాకుండానే మరోసారి ‘రాజద్రోహం’ తెరపైకి వచ్చింది. ఈసారి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌పై ఆ నింద పడింది. స్వాతంత్య్ర దినోత్సవానికి రెండురోజుల ముందు ఆ సంస్థ ఆధ్వర్యాన బెంగళూరులో నిర్వహించిన సదస్సులో దేశ వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు హోరెత్తాయన్నది ఆ నింద సారాంశం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు పెట్టారు. ఇది జరిగిన రెండురోజులకే ఆమ్నెస్టీకి వస్తున్న నిధులపై దర్యాప్తు జరుపుతామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొన్న ఫిబ్రవరిలో ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌పైనా, మరికొందరు ఇతర విద్యార్థి నాయకులపైనా రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టుచేశారు. ఆ తర్వాత రాజద్రోహానికి సంబంధించిన భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఏ పై సమగ్ర సమీక్ష జరపమని లా కమిషన్‌ను కోరామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజూ ప్రకటించారు. రాజద్రోహానికి చట్టం చెబుతున్న నిర్వచనం విస్తృతమైనది కావడంవల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరిపైనా దాన్ని ప్రయో గించే వీలున్నదని ఆ సందర్భంగా ఆయన అంగీకరించారు.


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యాభైయ్యేళ్లుగా ప్రపంచ దేశాలన్నిటా చురుగ్గా పని చేస్తున్న సంస్థ. అందువల్లే అఫ్ఘాన్‌లో తాలిబన్ ఆగడాలైనా, ఇరాక్, సిరియాల్లో ఐఎస్ ఘాతుకాలైనా ప్రపంచానికి వెల్లడయ్యాయి. బలూచిస్తాన్‌లో, ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని సవివరంగా బయటపెట్టింది కూడా ఆమ్నెస్టీయే. అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల అణిచి వేతనూ, పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుషాలనూ ఈ సంస్థ నివేదికలు ప్రశ్నించాయి. ప్రపంచ భద్రతకు ముప్పు తెస్తున్న అగ్రరాజ్యాల ఆయుధ వ్యాపా రాన్నీ, మహిళలపై వివిధ దేశాల్లో అనేక రూపాల్లో సాగుతున్న హింసనూ ఆమ్నెస్టీ ప్రపంచం దృష్టికి తెచ్చింది. బెంగళూరు సదస్సు కూడా మానవ హక్కుల ఉల్లం ఘనలకు, బాధిత కుటుంబాలకు న్యాయం లభించకపోవడంవంటి అంశాలకు సంబంధించిందే. సైన్యం చేతుల్లో మాయమైన, కాల్పుల్లో మరణించిన కశ్మీర్ యువకులకు చెందిన కుటుంబాలవారు ఈ సదస్సులో తమ అనుభవాలనూ, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులనూ వివరించారు. వారితోపాటు కశ్మీరీ పండిట్‌ల ప్రతినిధి ఆర్.కె. మట్టూ కూడా పాల్గొని కశ్మీర్ లోయలో తమ మానవ హక్కులకు భంగం కలుగుతున్న వైనాన్ని చెప్పారు.


కేవలం ఒకవైపు వారి వాదననే వినిపిస్తే, వారికి మద్దతుగా మాత్రమే సదస్సు నిర్వహిస్తే ఆమ్నెస్టీకి ఉద్దేశాలను ఆపాదించడాన్ని అర్ధం చేసుకోవచ్చు. సదస్సులో మాట్లాడిన ఒక వక్త 2010నాటి మాఛిల్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో ఒక యువకుడి తండ్రి. ఆ కేసులో నిరుడు మన సైనిక న్యాయస్థానం  కల్నల్, కెప్టెన్‌లతోసహా అయిదు గురు సైనిక సిబ్బందికి యావజ్జీవ శిక్ష విధించింది. బాధిత కుటుంబాలు చెప్పినవి తమ అనుభవాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులే తప్ప వేర్పాటువాదానికి లేదా మిలిటెంట్ చర్యలకు అనుకూలంగా కాదు. సదస్సులో జాతి వ్యతిరేక ప్రసంగాలు చేశారని, నినాదాలిచ్చారని ఆరోపణలొచ్చిన ఆమ్నెస్టీ ప్రతినిధి, అధ్యాపకురాలు సింధుజా అయ్యంగార్ ఆ సదస్సులోనే పాల్గొనలేదు.  సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా బాధిత కుటుంబాలు చెబుతున్నదేమిటో సదస్సుకు వివరించారు తప్ప ఆమె విడిగా ప్రసంగించలేదు. మరొకరు తారా రావు కశ్మీర్‌పై 2015నాటి ఆమ్నెస్టీ నివేదికలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావించారు. ఆ కార్యక్రమం ఆద్యం తమూ వీడియో, సీసీ టీవీ ఫుటేజ్‌లలో రికార్డయింది. సదస్సు ముగిసిన సమ యంలో ప్రేక్షకులుగా వచ్చినవారు ఆజాదీ నినాదాలిచ్చారని సంస్థ కూడా అంగీ కరిస్తోంది. అయితే ఒక మాటో, నినాదమో, ప్రసంగమో హింసకు కారణమ య్యాయని రుజువైన పక్షంలో తప్ప వాటిని రాజద్రోహ నేరాలుగా పరిగణించడా నికి వీల్లేదని ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. బెంగళూరు సదస్సు తర్వాత అలాంటి హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. ఆమ్నెస్టీ నిర్వాహకులపై దాఖలైన కేసులో ఎటూ దర్యాప్తు జరుగుతుంది. కానీ యావజ్జీవ శిక్షకు ఆస్కారమిచ్చే స్థాయి తీవ్రమైన చట్టాన్ని సరైన ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ప్రయోగించడం సరైందేనా? ఈ కేసులో దర్యాప్తు పూర్తయితే తప్ప ముందస్తు అరెస్టులుండవని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రకటిస్తున్నారు.


ఆ రకంగా కర్ణాటక ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందన్నట్టు చెబుతున్నారు. కానీ ఈ చట్టాన్ని విచక్షణారహితంగా ప్రయోగించడంలో కాంగ్రెస్ చరిత్ర తక్కువేమీ కాదు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించడంవల్ల కావొచ్చు... ఎక్కువసార్లు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఆ పార్టీకే దక్కింది! ముంబైలో నాలుగేళ్ల క్రితం కార్టూనిస్టు ఆసీమ్ త్రివేది ఉదంతానికి ముందూ, వెనకా ఎన్నిసార్లు ఆ చట్టాన్ని ఎవరెవరిపై అక్రమంగా, అన్యాయంగా బనాయించారో అందరికీ గుర్తుంది.


బ్రిటిష్ వలసపాలకులు 1870లో రాజద్రోహ నేరాన్ని శిక్షాస్మృతిలో చేర్చారు. దేశంలో స్వాతంత్య్ర భావనలను, ఆకాంక్షలను చిదిమేయడం కోసమే ఈ దుర్మా ర్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను 1908లో ఈ చట్టంకిందే శిక్షించారు. మహాత్మాగాంధీ 1922లో ఈ చట్టానికి బాధితుడు. స్వతంత్ర భారతంలో వాస్తవానికి ఇలాంటి చట్టానికి చోటుండకూడదు. కానీ మన పాలకులు దాన్ని యధావిధిగా కొనసాగించారు. దుర్వినియోగం చేయడానికి అనువుగా ఎంతో అస్పష్టమైన నిబంధనలతో రూపొందిన ఈ చట్టాన్ని కనీసం మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరిద్దామన్న ఆలోచన కూడా వారికి లేక పోయింది. ఆమ్నెస్టీ చరిత్ర, దాని కృషి తెలిసినవారు ఈ మాదిరి కేసులు పెట్టడాన్ని హర్షించలేరు. రాజద్రోహం సెక్షన్‌పై లా కమిషన్ వీలైనంత త్వరలో సముచిత నిర్ణయం తీసుకుంటుందని, భావ ప్రకటనాస్వేచ్ఛకు హారతులు పడుతుందని ఆశించాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement