చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒక బిల్లును చట్టసభ ఆమోదించడం సాధారణ మైన విషయమే. కానీ మంగళవారం రాజ్యసభ ఆమోదించిన జువనైల్ జస్టిస్ చట్టం సవరణ బిల్లు తీరే వేరు. నిర్భయ ఉదంతంలో మూడేళ్ల శిక్ష పూర్తిచేసుకున్న బాల నేరస్తుడి విడుదల సందర్భంగా మొదలైన ఆందోళనలూ, వాదోపవాదాలూ ఇంత కాలంనుంచి పెండింగ్‌లో ఉన్న ఆ సవరణ బిల్లు హడావుడి ఆమోదానికి దారి తీశాయి. కాంగ్రెస్‌తోసహా వివిధ పక్షాలు తమ వైఖరులను చివరి నిమిషంలో సవరించుకోవడంవల్ల బిల్లు ఆమోదం సులభమైంది. ఇది చట్టమైతే బాలురలో పెరిగిపోతున్న నేర స్వభావానికి అడ్డుకట్టవేయడం సాధ్యమవుతుందని బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ అభిప్రాయపడ్డారు.
కఠిన చట్టాలనేవి సమాజంలో నేర నిరోధానికి తోడ్పడతా యన్నది నిజమే కావొచ్చుగానీ...వాటికవే ఒక మంచి సమాజాన్ని నెలకొల్పలేవు. అది సుసాధ్యం కావడానికి దోహదపడే ఎన్నో అంశాల్లో చట్టాలు ఒక భాగం. ముఖ్యంగా అలాంటి నేరాలకు దోహదపడుతున్న అవిద్య, పేదరికం, మహిళలను కించపరిచే ధోరణుల వంటివాటిని నియంత్రించడం... క్రిమినల్ కేసుల్లో సత్వర విచారణ జరిగి నేరస్తులకు శిక్షపడేలా చూడటం ఎంతో ముఖ్యం. అత్యాచారం విష యమై భారీయెత్తున ఆందోళన జరగడం ఇటీవలికాలంలో ఒక్క నిర్భయ ఉదంతం లో మాత్రమే సంభవించింది. ఆ స్థాయి ఉద్యమమైనా మన వ్యవస్థల్లో చురుకు దనం తీసుకురాలేదని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఢిల్లీలోని వివిధ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో మహిళలపై, బాలికలపై నేరాలకు సంబంధించి మూడేళ్లుగా 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మహిళపై జరిగే నేరాల్లో 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి.
ఢిల్లీలో పరిస్థితి కాస్త మెరుగు. అక్కడ 42 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఇలాంటి అంశాల్లో లోతైన చర్చ జరిగి కేసులు పెండింగ్‌లో ఉండటానికీ, నేరస్తులు తప్పించుకోవడానికీ దోహదపడుతున్న కారణాలను నిగ్గుదేల్చి సరిదిద్దితే ఫలితం ఉంటుంది. ఇలాంటి అంశాలపై దృష్టి సారించకుండా మహిళల సంరక్ష ణకూ, బాలల హక్కులకూ మధ్య పోటీపెట్టే స్థితి ఏర్పడటం దురదృష్టకరమైనది. నిర్భయ ఉదంతంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సైతం లైంగిక నేరాలను అదుపు చేయడానికి అలాంటి కేసుల సత్వర విచారణ మాత్రమే తోడ్పడు తుందని స్పష్టంగా చెప్పింది. బాల నేరస్తుల వయసును సవరించాలన్న వాదనతో ఆ కమిటీ ఏకీభవించలేదు.
మూడేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న ప్పుడే అందులో పాలుపంచుకున్న బాలుడి గురించి విస్తృతంగా చర్చ జరిగింది. మిగిలిన నలుగురు నిందితులకూ ఉరిశిక్షలు పడగా, బాల నేరస్తుణ్ణి మూడేళ్లపాటు రిమాండ్ హోంకు పంపారు. మిగిలిన నేరస్తులకు ఏమాత్రం తీసిపోకుండా నేరంలో పాలుపంచుకున్న ఆ బాలుడికి అంత తక్కువ శిక్షతో సరిపెట్టడం న్యాయం కాదని అప్పట్లోనే కొందరు మహిళా సంఘాల నేతలూ, న్యాయవాదులూ వాదించారు. ఇప్పుడూ అలాంటి వాదనలే ముందుకొచ్చాయి. అతని విడుదలను అడ్డుకోవ డానికి ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి, సుప్రీంకోర్టులో ఢిల్లీ మహిళా కమిషన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అనుసరించి అతడి విడుదలను అడ్డుకోవడం సాధ్యపడదని రెండు కోర్టులూ తీర్పునిచ్చాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన తేదీనుంచి కొత్త చట్టం అమలవుతుంది గనుక నిర్భయ కేసు నిందితుడికి తాజా చట్టం కూడా వర్తించదు.
రాజ్యసభలో జువనైల్ చట్టంపై జరిగిన చర్చను ప్రస్తావించుకోవాలి. బిల్లులోని అంశాలపై పలువురు కాంగ్రెస్ సభ్యులు మొదట్లో సంశయాలను వ్యక్తంచేశారు. జువెనైల్ నేరాలు పెరిగిపోతున్నాయన్న మేనకాగాంధీ వాదనను తిప్పికొడుతూ మొత్తం నేరాల్లో బాల నేరస్తుల ప్రమేయం ఉన్నవి 1.2 శాతం మాత్రమేనని చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్నదే తమ వాదన అయినా, మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆ వైఖరిని మార్చుకున్నామని గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. చట్టాల రూపకల్పనలో అయినా, విధానపరమైన నిర్ణయాల్లో అయినా సహేతుకత ప్రాతిపదిక కావాలి తప్ప భావోద్వేగాలది పైచేయి కాకూడదు. జువనైల్ చట్ట సవరణ బిల్లు ఆమోదంలో భావోద్వేగాలపాలు ఎక్కువైందని చెప్పక తప్పదు. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదనను అర్ధం చేసుకోవచ్చు. ఉన్నత చదువులు చదివిన కుమార్తె ఉన్నట్టుండి ఉన్మాదుల దుండగానికి బలైపోవడం అత్యంత విషాదరకమైనది. వారు జీర్ణించుకోలేనిది. ఆ నేరగాళ్లను ఉరి తీసి చంపాల్సిందేనని వారు పట్టుబట్టడాన్నీ ఎవరూ తప్పుబట్టరు. బాధితుల వేదన ఆ స్థాయిలోనే ఉం టుంది. రాజ్యసభలో తృణమూల్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఈ ఆవేదనకే అద్దం పట్టారు. నిర్భయ స్థానంలో తన కూతురు ఉంటే అందుకు కారకులైన దుండ గులను కాల్చిచంపేవాడినన్నారు. వ్యక్తుల్లో ఉండే ఈ ప్రతీకారేచ్ఛ వ్యవస్థకు ఉం డదు. నేరస్తులను దారి తప్పినవారిగా గుర్తించి వారిని సంస్కరించాలని చూస్తుంది.
జువనైల్ వయసు 16కు తగ్గించడంవల్ల నేరాలు ఏమేరకు తగ్గుతాయన్న విషయాన్నలా ఉంచి, దానివల్ల వచ్చే దుష్పరిణామాలను, అది దుర్వినియో గమయ్యే ప్రమాదాన్ని పెద్దల సభ పరిగణనలోకి తీసుకోలేదు. టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు అన్నట్టు మన జువనైల్ హోంలు బాల నేరస్తుల్ని సంస్కరించడానికి బదులు వారిని మరింతగా రాటుదేలుస్తున్నాయి. అలాగే తెలిసీ తెలియని వయసులో ఆడ, మగ పిల్లలు ఇల్లొదిలి వె ళ్లిన సందర్భాల్లో బాలుడిపై కక్ష తీర్చుకోవడం కోసం పిల్ల తల్లిదండ్రులు అత్యాచారం కేసులు పెడుతున్నారని వెల్లడైంది. ఈ తరహా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టంలో ఎలాంటి ఏర్పాట్లూ లేవు. నిందితుడైన బాలుడు చేసిన నేరం ఎలాంటిదో జువనైల్ జస్టిస్ బోర్డులోని మానసిక నిపుణులు నిర్ణయించాకే కఠిన శిక్ష విధింపు ఉంటుందన్న మేనకాగాంధీ వాదనలో పసలేదు. ఇవాళ చట్టం చేయడానికి దోహదపడిన భావోద్వేగాలు రేపన్న రోజున జువనైల్ జస్టిస్ బోర్డులను ప్రభావితం చేయవన్న గ్యారెంటీ ఏం లేదు. మున్ముందైనా ఈ చట్టం అమలు తీరు ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులకు సిద్ధపడాలి.
నేరము-శిక్ష
Published Thu, Dec 24 2015 12:12 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement