పిల్లలకు ఆటలంటే ఎంతో ఇష్టమనే సంగతి మనందరికీ తెలిసిందే. కొందరు పిల్లలు ఇండోర్ గేమ్స్‌ను ఇష్టపడతారు. మరికొందరు పిల్లలు బయట ఆడుకుంటారు. అయితే టైమ్ పాస్ కోసం బ్యాంకును కొల్లగొట్టిన చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఎప్పుడు ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆట ఆడే వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత కేసు వెలుగు చూసింది.
ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలులు కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న గ్రీన్‌పాయింట్ ప్రాంతంలోని వెల్స్ ఫార్గో బ్యాంక్‌కు వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తరువాత వారు బ్యాంకులోని డబ్బు కొల్లగొట్టి, అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి మైక్ ష్నైడర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్‌కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారు. తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు దొంగల(పిల్లల) చిత్రాలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాలలో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment