police Clues Team
-
బ్యాంకును కొల్లగొట్టిన పిల్లలు!
పిల్లలకు ఆటలంటే ఎంతో ఇష్టమనే సంగతి మనందరికీ తెలిసిందే. కొందరు పిల్లలు ఇండోర్ గేమ్స్‌ను ఇష్టపడతారు. మరికొందరు పిల్లలు బయట ఆడుకుంటారు. అయితే టైమ్ పాస్ కోసం బ్యాంకును కొల్లగొట్టిన చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఎప్పుడు ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆట ఆడే వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలులు కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న గ్రీన్‌పాయింట్ ప్రాంతంలోని వెల్స్ ఫార్గో బ్యాంక్‌కు వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తరువాత వారు బ్యాంకులోని డబ్బు కొల్లగొట్టి, అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి మైక్ ష్నైడర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్‌కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారు. తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు దొంగల(పిల్లల) చిత్రాలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాలలో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు. -
అమృత్‌పాల్ సింగ్: సినిమాను మించిన ట్విస్ట్.. వేషం మార్చుకుంటూ..
అమృత్‌పాల్ సింగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఖలిస్తాన్ వేర్పాటువాది అయిన అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మామూలుగా ప్రయత్నించడం లేదు. సినిమా రేంజ్లో నిందితుడు.. పోలీసులు కళ్లుగప్పి వేషాలు మారుస్తూ తప్పించుకుంటున్నాడు. హాలీవుడ్ సినిమాలో ఛేజింగ్ సీన్స్‌ను తలపిస్తూ అమృత్‌పాల్ పంజాబ్ నుంచి బయటపడినట్టు సమాచారం. ఇక, దశావతారం సినిమాలో గేటప్స్ మార్చినట్టు అమృత్‌పాల్ వేషధారణ మార్చుకుంటూ కార్లు నుంచి బైక్.. బైక్ నుంచి వివిధ వాహనాలు మార్చుకుంటూ పోలీసుల వ్యూహాలకే చెక్ పెడుతున్నాడు. అమృత్‌పాల్ సింగ్ ఇప్పటి వరకు దాదాపు ఐదుకు పైగా వేషాలు మారుస్తూ బయట తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడి ఫొటోలు కూడా బయటకు రిలీజ్ చేశారు. ఈ ఫొటోలు చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదేవిధంగా ఇతరులు గుర్తుపట్టకుండా అతను తన మత దుస్తులకు బదులు చొక్కా, ప్యాంటు ధరించినట్లు పోలీసు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. 🇮🇳 #Watch | 'Waris Punjab De' chief #AmritpalSingh was seen escaping in an SUV in Jalandhar on March 18. He is still on the run. (CCTV visuals) #india #mostliked pic.twitter.com/9LPIeuFdZ6 — Imminent Global News (@imminent_news) March 21, 2023 ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌ను దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ కారులో టోల్గేట్ దాటిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమృత్‌పాల్ చివరిసారిగా మెర్సిడెస్ ఎస్యూవీ వాహనంలో తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను మారుతీ సుజికీ బ్రిజా కారులో జలంధర్‌లోని టోల్‌గేట్‌ను దాటుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇక, చివరగా బైక్‌పై తన మద్దతుదారులతో వెళ్తున్న పుటేజీ కూడా బయటకు వచ్చింది. #BREAKING #Trending #Viral #CCTVFootage of #fugitive #AmritpalSingh fleeing on a bike after changing clothes from a Gurudwara in nangal Ambian village . @PunjabPoliceInd #PunjabPolice #Khalistan #Khalistanis #AmritpalMisleadingPunjab #Amritpal_Singh #PunjabNews #Sikhs pic.twitter.com/BmCGEscP2s — Sumedha Sharma (@sumedhasharma86) March 21, 2023 ఇది కూడా చదవండి: 80వేల మంది పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. పాక్ ఏజెంట్‌గానే సూసైడ్ ఎటాక్స్‌కు ప్లాన్ -
వివాహేతర సంబంధం: యువకుడు దారుణ హత్య
సాక్షి,మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెంలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జాడి ప్రవీణ్(32) స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఊళ్లోకి వెళ్లిన అతడు 10 దాటిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. ఎంతకూ రాకపోగా తెల్లవారేసరికి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ బోనాల కిషన్‌తోపాటు ఇతర అధికారులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పదునైన ఆయుదంతో తల వెనక, ముందు భాగంలో పొచిడి హత్య చేసిన ఆనవాళ్లను గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.కాగా, సదరు యువకుడికి గ్రామానికి చెందిన ఓ వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వివాహిత సంబంధికులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తమ్ముడు సుదర్శన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. అదుపులో నిందితులు? ప్రవీణ్‌ను హత్య చేశారని అనుమానిస్తున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో ఈ హత్య చేశారని భావిస్తున్న పోలీసులు.. మరికొంత మంది యువకులను అవసరమైతే పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించినట్లు తెలిసింది. -
‘పంచాయతీ’కి సై
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో మూడు విడతలుగా 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు, సిబ్బందికి శిక్షణా తరగతులు పూర్తి చేసిన అధికారులు.. ఇక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై దృష్టి సారించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లయింది. తొలి దశ ఎన్నికలు జనవరి 21వ తేదీన, రెండో దశ 25వ తేదీన, మూడో దశ ఎన్నికలు జనవరి 30వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్.. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టతనిచ్చింది. ఈనెల 7న తొలివిడత ఎన్నికలకు సంబంధించి నోటీసు జారీ చేస్తారు. ఆరోజు నుంచి 9వ తేదీ వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 11వ తేదీన ఆయా పదవులకు పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైతే తగిన ఆధారాలతో రెవెన్యూ డివిజనల్ అధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 12న ఈ తరహా దరఖాస్తులపై సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. అదేరోజు ఆయా పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. తొలిదశ ఎన్నికలు జిల్లాలోని 188 గ్రామ పంచాయతీలకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలింగ్ బూత్‌లు, అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బందిని సిద్ధం చేశారు. 21వ తేదీన మొదటి విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. జిల్లాలో మొదటి విడతగా ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, కామేపల్లి, కూసుమంచి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో 204 జీపీలకు.. ఇక రెండో విడతలో 204 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 11వ తేదీన జారీ చేయనున్నారు. 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 14వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. 15న ఆయా పదవులకు పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైతే దానిపై తగు ఆధారాలతో రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. 16వ తేదీన దీనిపై సంబంధిత అధికారులు నిర్ణయం ప్రకటించే గడువు ఇచ్చారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్.. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడతలో ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కారేపల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 192 జీపీలకు.. ఇక మూడో విడత జిల్లాలోని 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రఘునాథపాలెం, కొణిజర్ల, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల పరిధిలోని గ్రామ పంచాయత్లీల్లో ఎన్నికలు జనవరి 30న నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. 19వ తేదీన నామినేషన్ పరిశీలన చేసి నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నామినేషన్లు అర్హత పొందాయో జాబితాను ప్రదర్శిస్తారు. 20వ తేదీన నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు రెవెన్యూ డివిజనల్ అధికారులకు తమ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే గడువుగా విధించారు. 21న సంబంధిత అధికారులు వీటిపై నిర్ణయం ప్రకటించనున్నారు. 22న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శిస్తారు. 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడించగానే ఉప సర్పంచ్ పదవికి సైతం ఎన్నిక నిర్వహిస్తారు. ఉప సర్పంచ్‌ను గెలుపొందిన వార్డు సభ్యుల్లోని మెజార్టీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు ఎన్నికలకు సంబంధించి ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. పంచాయతీలవారీగా రిజర్వేషన్లు సైతం పూర్తి కావడంతో ఇక పోలింగ్ ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేశారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించే ఎన్నికలకు 4,870 పోలింగ్ బాక్స్‌లను సిద్ధం చేశారు. 5,338 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 5,800 మంది ఉద్యోగులు మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కుతోంది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా.. పార్టీ గుర్తులేవీ ఈ ఎన్నికల్లో ఉండకపోయినా.. గ్రామాల్లో మాత్రం పంచాయతీ రాజకీయం ఊపందుకుంటోంది. సర్వం సిద్ధం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 584 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, విధులు నిర్వహించే ఉద్యోగులకు శిక్షణ పూర్తి చేశాం. బ్యాలెట్ బాక్స్‌లను సైతం సిద్ధం చేశాం. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. -
పాదముద్రలు పట్టించేనా?
తాడేపల్లి రూరల్/సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణ గ్రామాల్లో జరిగిన దహనకాండపై పోలీసుల క్లూస్ టీం మంగళవారం నుంచి దర్యాప్తును ముమ్మరం చేసింది. సంఘటన స్థలంలో లభ్యమైన పాదముద్రల ఆధారంగా వివరాల సేకరణకు నడుంకట్టారు. తాడేపల్లిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, గతంలో ఉండవల్లి, పెనుమాక పంచాయతీల పరిధిలో చిన్నచిన్న గొడవల్లో తలదూర్చిన యువకులను, వీరితో పాటు రైతులను సైతం తాడేపల్లి పోలీసుస్టేషనుకు పిలిపించారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్ర ఆధారంగా, దానికి సరిపోలి ఉండే వారి పాదముద్రలు సేకరించారు. ఎందుకు పిలిపించారో తెలియక రైతులు ఒకింత అసహనానికి గురయ్యారు. రౌడీషీటర్లతోపాటు తమ పాదముద్రలు కూడా సేకరించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు జరిగిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా విచారణ పేరుతో ప్రతిరోజూ ఇలా పోలీసుస్టేషనుకు పిలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఇలా ప్రతిరోజూ స్టేషనుకు పిలిపించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే తమకు చావు తప్ప వేరేమార్గం లేదంటున్నారు. మూడు రోజుల క్రితం పెనుమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, సంఘటనలో తాను పాల్గొన్నట్టు తెలిపి చివరకు పోలీసులను అయోమయానికి గురిచేశాడు. అతను అబద్ధాలు చె్డపుతున్నట్టు తేలడంతో తిరిగి విచారణ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కొందరిని పిలిపించిన పోలీసులు వారు చెప్పిన ఆధారాల ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన నిపుణులతో ఇద్దరు నిందితులకు సంబంధించిన ఊహా చిత్రాలు సిద్ధం చేశారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై ఆగని పోలీసుల వేధింపులు... దుశ్చర్యకు పాల్పడిన నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పోలీసులు పలువురు అనుమానితులను స్టేషన్లకు పిలిచి విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అనేక మంది వైఎస్సార్సీపీ వర్గీయులను విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. టీడీపీ వర్గీయుల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్ సీపీకి సంబంధించిన వారినే టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్స్టేషన్లలో కూర్చోబెడుతుండటంతో గ్రామాల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇప్పటికైనా పోలీసులు వివక్ష మాని విచారణ పారదర్శకంగా జరపాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దహన కాండకు పాల్పడిన ఆ ఇద్దరూ ఎవరు..? రాజధాని ప్రాంతంలోని పొలాల్లో దహన కాండకు పాల్పడింది ఇద్దరు వ్యక్తులేనని మొదటి నుంచి పోలీసులు చెబుతున్నప్పటికీ ఆ ఇద్దరూ ఎవరనేది తేలడంలేదు. కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం చూసినా ఇద్దరు వ్యక్తులే ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు మాత్రం పక్కా పథకం ప్రకారం సెల్‌ఫోన్, వాహనాలు వినియోగించకుండా జాగ్రత్తపడినట్లు అర్థమవుతోంది. ఈ కేసులో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.