ఇంటర్‌కామ్ ద్వారా తల్లి, భార్యతో మాట్లాడుతతున్న జాధవ్
భారత్ గూఢచారిగా ముద్రపడి 22 నెలలనుంచి పాకిస్తాన్ చెరలో మగ్గుతున్న కులభూషణ్ జాధవ్‌ను ఎట్టకేలకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ కలుసుకోగలిగారు. ఎక్కడో ఇరాన్‌కు వెళ్లి వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నవాడు ఉన్నట్టుండి మాయం కావడం, పాకిస్తాన్ అతన్ని బంధించి గూఢచారిగా ఆరోపించడం ఆ కుటుంబాన్ని ఎంత కలవరపరిచి ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఇదింకా తీరకముందే ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువయ్యాయని, వాటిని ఆయనే ఒప్పుకున్నాడని పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ప్రకటించి అందుకు ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పునివ్వడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనలో పడేసింది. మన ప్రభుత్వం వెనువెంటనే స్పందించి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్వీకరించి మరణశిక్షపై స్టే విధించింది. అప్పటినుంచీ జాధవ్ సజీవంగానే ఉన్నాడన్న ఊరట లభించింది తప్ప ఆయన మాత్రం ఒంటరి చెరలో ఉరితాడు నీడన బతుకీడుస్తున్నాడు.
జాధవ్ ఎన్నడో భారత నావికాదళం నుంచి రిటైరయ్యాడని, ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న అతడితో ప్రభుత్వానికి సంబంధం లేదని మన దేశం చెప్పింది. అందుకు భిన్నంగా బలూచిస్తాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నాడని పాక్ ఆరోపించింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి తమ దౌత్యవేత్తలను అనుమతించాలన్న మన ప్రభుత్వ వినతుల్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. చివరకు తమ జాతిపిత జిన్నా జయంతి సందర్భంగా ‘ఇస్లామిక్ సంప్రదాయాలు, మానవతా దృక్పథం’ అనుసరించి జాధవ్ తల్లి, భార్య కలుసుకునే ఏర్పాటు చేస్తామంది. కారణమేదైనా పాకిస్తాన్ వైఖరి మార్చుకున్నందుకు అందరూ సంతోషించారు. అయితే సోమవారం ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలో జరిగిన ఆ భేటీ అందరికీ నిరాశే మిగిల్చింది.
జాధవ్‌ను అయినవారు కలుసుకోవడానికి అనుమతించడాన్ని మానవతా దృక్పథమని చెప్పుకున్న పాకిస్తాన్ తీరా వారు వచ్చాక గాజు తెరను అడ్డంగా పెట్టి ఇంటర్‌కామ్ ద్వారా మాత్రమే మాట్లాడే వీలు కల్పించడం, వారి మధ్య ఆత్మీయతా స్పర్శకు వీలు కల్పించకపోవడం ఎవరికైనా చివుక్కుమనిపిస్తుంది. అంతకన్నా ముందు అవంతి, చేతాంకుల్ పట్ల అక్కడి భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు కూడా సమర్ధనీయమైనది కాదు. జాధవ్‌పై గూఢచారి అన్న ముద్రేశారు సరేగానీ... ఆయన తల్లి, భార్యను సైతం అలాగే పరిగణించడం సబబేనా? వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం, మెడలో ఉన్న మంగళసూత్రాలను, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాధవ్‌తో మాతృభాషలో సంభాషించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడంలాంటివి విస్మయం కలిగిస్తాయి. చివరకు జాధవ్ భార్య మంగళసూత్రాలు,ఆమె బూట్లు వెనక్కి ఇవ్వలేదు. వాటిల్లో ఏదో అమర్చుకుని వచ్చారని రేపో మాపో యాగీ చేసినా చేయొచ్చు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరికీ తెలి యని విషయం కాదు. కనుక అవతలి దేశానికి చెందిన పౌరుల్ని అనుమాన దృక్కులతో చూడటం కూడా సర్వసాధారణం. కానీ ప్రభుత్వాలు ముందే మాట్లాడుకుని ఈ భేటీని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకూడదు.
పైగా భౌతిక తనిఖీల అవసరం లేకుండా వ్యక్తుల వద్ద అవాంఛనీయమైనవి ఉంటే క్షణంలో పట్టిచ్చే అత్యాధునిక పరికరాలు వచ్చాయి. వారు ఏం మాట్లాడుకుంటారోనన్న అనుమానాలుంటే దుబాసీలను నియ మించుకోవచ్చు. వీటన్నిటినీ కాదని జాధవ్ తల్లి, భార్య పట్ల అంత మొరటుగా వ్యవహరించడం వల్ల సాధించిందేమిటి? అంతేకాదు... ముందుగా అనుకున్న దానికి భిన్నంగా వారిద్దరి సమీపానికి పాకిస్తాన్ మీడియా ప్రతినిధులు వచ్చి దూషించడానికి ఆస్కారం కలగజేయడం సైతం పాక్ చెప్పుకుంటున్న మానవతా దృక్పథాన్ని సందేహాస్పదం చేస్తుంది. దాని చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అంతేకాదు...కుటుంబసభ్యులతోపాటు మన డిప్యూటీ హై కమిషనర్‌ను కూడా జాధవ్‌ను కలుసుకోవడానికి అనుమతిస్తామని పాక్ చెప్పింది. తీరా వెళ్లాక డిప్యూటీ హైకమిషనర్‌ను విడిగా వేరేచోట కూర్చోబెట్టారు. ఆయన సంబంధిత అధికా రులతో పదే పదే మాట్లాడాక మాత్రమే అనుమతించారు. అప్పుడు కూడా జాధవ్ కుటుంబసభ్యులకూ, ఆయనకూ మధ్య గాజు తెర బిగించారు. ఇంతా అయ్యాక ‘మాట్లాడుకోవడానికి మేం ముందు అరగంట వ్యవధి మాత్రమే ఇచ్చినా, పెద్ద మనసుతో మరో పది నిమిషాలు పొడిగించాం... మరిన్నిసార్లు కలిసేందుకు అను మతిస్తామ’ని చెప్పడం వింతగా అనిపిస్తుంది.
మరోపక్క జాధవ్, అతని కుటుంబసభ్యుల భేటీకి కొద్దిరోజుల ముందునుంచీ భారత్–పాక్ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉదంతాలు అందరికీ కలవరం కలిగించాయి. ఎలాంటి కవ్వింపూ లేకుండా పాకిస్తాన్ దళాలు రాజౌరీ జిల్లాలోని సరిహద్దుల వద్ద జరిపిన కాల్పుల్లో మన దేశానికి చెందిన మేజర్‌తోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారు. మన దళాలు సోమవారం సాయంత్రం పూంచ్ సెక్టార్ వద్ద అధీన రేఖ దాటుకుని పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముగ్గురు పాక్ సైనికులను హతమార్చడంతోపాటు ఒక పోస్టును ధ్వంసం చేశారు. గత ఏడాది ఇదే తరహాలో మన సైనిక దళాలు సర్జికల్ దాడులు నిర్వహించాయి. ఒకపక్క జాధవ్‌ను కలిసేందుకు కుటుంబసభ్యుల్ని అనుమతించి తన సుహృద్భావాన్ని ప్రపంచానికి చాటడానికి ప్రయత్నించడం...అదే సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి అక్కడ భారత్ కారణంగా తప్పులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కలగ జేయడానికి చూడటం వల్ల అంతిమంగా తనకు ఒరిగేదేమిటో పాక్ ఆలోచించు కోవాలి. ఇరు దేశాల మధ్యా జటిలమైన సమస్యలున్న మాట వాస్తవం. ఇద్దరూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే అవి పరిష్కారమవుతాయి. వాటిని మరింత సంక్లిష్టంగా మార్చాలని చూస్తే నష్టం రెండు వైపులా ఉంటుంది. పాకిస్తాన్ దాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment