మన పొరుగునున్న నేపాల్‌కూ, రాజకీయ అస్థిరతకూ ఏదో చుట్టరికం ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారంలోకొచ్చినా పట్టుమని ఏడాది కూడా అధికారంలో కొన సాగలేకపోతోంది. తొమ్మిది నెలలక్రితం ప్రధాని బాధ్యతలు చేపట్టిన కె.పి. ఓలీ... విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం చర్చ మొదలు కావడానికి కొన్ని గంటలముందు రాజీనామా సమర్పించారు. ఏకాభిప్రాయాన్ని సాధించి వారం వ్యవధిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయమని రాజకీయ పక్షాలన్నిటికీ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ విజ్ఞప్తి చేశారు.
నేపాల్ రాజకీయ పక్షాల నేపథ్యాన్ని, వాటి నడవడిని గమనిస్తే ఇదేమంత సులభం కాదని అర్ధమవుతుంది. 2008లో దేశం రాజరికాన్ని విడనాడి గణతంత్ర రిపబ్లిక్‌గా అవతరించినప్పటినుంచి అది ప్రసవవేదన పడుతూనే ఉంది. రాజ్యాంగ నిర్ణాయక సభకు ఆ ఏడాది మేలో ఎన్నికలు జరిగి మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ 2008 ఆగస్టులో ప్రధాని బాధ్యతలు చేపట్టగా ఆ మరుసటి ఏడాది మే నెలలోనే వైదొలగవలసి వచ్చింది. ఆ తర్వాత దాదాపు 10కిపైగా ప్రభుత్వాలు వచ్చిపోయాయి.
నిరుడు సెప్టెంబర్‌లో నూతన రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకుని లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా అవతరించినా ఆ దేశం రాజకీయ సుస్థిరతను సాధించలేకపోయింది. రాజ్యాంగ రచన పూర్తయి దాన్ని ఆవిష్కరించుకొనే దశలోనే అక్కడ ఆందోళనలు చెలరేగాయి. తమకు అన్యాయం జరిగిందని తెరై ప్రాంతంలో ఉండే మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమబాట పట్టాయి. రహదారులు దిగ్బంధం చేశాయి. ఉద్య మిస్తున్న జాతులతో సంప్రదింపులు జరపాలని, అటు తర్వాతే నూతన రాజ్యాం గాన్ని అమల్లోకి తీసుకురావాలని మన దేశం సూచించింది.
అయితే నేపాల్ దీన్ని పట్టించుకోకపోగా ఆందోళన చేస్తున్న మాధేసిల వెనక భారత్ హస్తం ఉన్నదని ఆరోపించింది. ఆ ఆందోళన కారణంగా నేపాల్ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని సాకుతో సరుకు రవాణాను, ఇంధన సరఫరాను ఆపేసి తమను భారత్ శిక్షిస్తున్నదని కూడా ఆ దేశ హోంశాఖ ప్రతినిధి అప్పట్లో నిందించారు. మాధేసిలు రహదార్లను దిగ్బంధం చేసినందువల్లనే తమ ట్రక్కులు నేపాల్ భూభాగంలోకి ప్రవేశించలేకపోతున్నాయన్న భారత్ వాదనను కొట్టిపడేశారు. చిత్రమేమంటే ఇప్పుడు కూడా పదవినుంచి వైదొలగుతూ ఓలీ ఇలాంటి ఆరోపణే చేశారు. మాధేసిల ఆందోళనలు, ఇతర సందర్భాల్లో తమ సర్కారు తీసుకున్న చర్యలపై అసంతృప్తిగా ఉన్న కొన్ని ‘విదేశీ శక్తులు’ కావాలని ప్రభుత్వాన్ని కూల్చాయని ఆయన అభియోగం మోపారు. అడపా దడపా ప్రభుత్వాలు కూలిపోవడం రివా జుగా మారిన నేపాల్‌లో... సర్కారు పడిపోవడానికి ‘విదేశీ శక్తుల’ను కారణంగా చూపడం ఇదే తొలిసారి.
అంతక్రితం భారత్ అనుకూలుడిగా ఉన్న ఓలీ ప్రధాని పదవి చేపట్టాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం. మాధేసిల ఆందోళన సమ యంలో చైనాతో రవాణా ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు అనంతర కాలంలో ఆ దేశంపై ప్రత్యేక దృష్టి పెడుతూ విదేశాంగ విధానం తీరుతెన్నులను మార్చారు. పర్యాటక నగరంగా పేరున్న పొఖారాలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఒడంబడిక కుదుర్చుకున్నారు. మరికొన్ని నెలల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ సందర్శనకు రావాల్సి ఉంది. రాజకీయ అస్థిరత సద్దుమణిగితే తేదీలు ఖరారు చేసుకోవాలని అనుకున్నారు. ఈలోగానే ప్రభుత్వం కూలిపోయింది. నేపాల్‌కు ఉత్తరాన చైనా ఉంటే తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాల సరిహద్దుల్లో భారత్ భూభాగం ఉంది. భౌగోళికంగా ఉండే అనేక ఇబ్బందుల కారణంగా చైనాతో వాణిజ్యం నేపాల్‌కు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినా భారత్ తనపట్ల పెద్దన్న వైఖరి ప్రదర్శిస్తున్నదని, తరచు ఇబ్బందులకు గురిచేస్తున్నదని నేపాల్ కినుక వహించింది.
ఇందులో మన దేశం తప్పిదం కూడా లేకపోలేదు. ఇప్పటికే మన ఇరుగుపొరుగు దేశాలతో చెలిమి చేస్తూ, అనేక విధాల ఆ దేశాలను దువ్వుతున్న చైనా చాన్నాళ్లుగా నేపాల్‌పై కూడా కన్నేసింది. ఆ దేశంలో భారత్ పట్ల అసంతృప్తి పెల్లుబికితే దాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. మన దేశం ఈ సంగతిని సరిగా పరిగణనలోకి తీసుకుని తన వంతుగా సహకారాన్ని పెంపొందించ డానికి తగిన చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. అంతమాత్రాన ఇప్పుడు రాజకీయ అస్థిరతకు భారత్‌ను దోషిగా చూపుతున్న ఓలీ మాటలు నమ్మనవసరం లేదు. పదవి కోల్పోయిన ఉక్రోషంలో కూడా ఆయనలా అని ఉండొచ్చు.
నిరుడు వచ్చిన పెను భూకంపంలో ఇళ్లు కోల్పోయినవారికి గృహాలు నిర్మించి ఇస్తామని, ధ్వంసమైన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలుపు కోవడంలో సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చుకుంటున్నట్టు మొన్న మే నెలలో మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ ప్రకటించారు. అప్పట్లో ఓలీ ఆయనకు సర్దిచెప్పి ఒప్పించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదంటూ ఆ పార్టీ ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకుంది. ఈ సంక్షో భంనుంచి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నంతలోనే కూటమిలోని మరో రెండు పార్టీలు వైదొలగుతున్నట్టు ప్రకటించాయి. ఇక ఓలీకి రాజీనామా తప్ప గత్యంతరం లేక పోయింది. ఇప్పుడు నేపాలీ కాంగ్రెస్, మావోయిస్ట్టుల కూటమి అధికారంలోకి రావొచ్చునని, ప్రచండ మళ్లీ ప్రధాని అవుతారని ఊహాగానాలొస్తున్నాయి. నేపాల్ దశాబ్ద కాల నేపథ్యాన్ని గమనిస్తే అక్కడ ఏమైనా జరగొచ్చునని అర్ధమవుతుంది. అయితే అలా ఏర్పడే ప్రభుత్వం మళ్లీ ఎంతకాలం నిలుస్తుందన్నదే ప్రశ్న.
ఏ అంశంపైనా నిలకడగా, నిబద్ధతగా వ్యవహరించలేని పార్టీలు నేపాల్‌కు శాపంగా పరిణమించాయి. ఇప్పటికైనా స్వీయ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ ప్రగతికోసం, మెరుగైన భవిష్యత్తు కోసం అన్ని పక్షాలూ కృషిచేయాలి. రాజ రికమే మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే అది తమకే సిగ్గుచేటని గుర్తించాలి.
మళ్లీ మొదటికొచ్చిన నేపాల్
Published Tue, Jul 26 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement
Advertisement