ఖాట్మాండూ: నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రస్తుత ప్రధాని కేపీ ఓలి, ప్రతిపక్ష పార్టీల సంకీర్ణ కూటమి నేతలు వేర్వేరుగా దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారి తలుపుతట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలంటూ ఓ వైపు ఓలి, మరో వైపు ప్రతిపక్షాలు తమ లేఖలను బిద్యా దేవికి పంపారు. ఇందులో ఓలి తనకు 121 మంది తన పార్టీ సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని సంతకాలు చేసి అధ్యక్షురాలికి పంపారు.
మరోవైపు ప్రతిపక్ష సంకీర్ణ కూటమి తమకు 149 మంది చట్ట సభ్యుల మద్దతు ఉందంటూ సంతకాలు చేసి దేశ అధ్యక్షురాలు భండారీకి లేఖ పంపింది. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రతిపక్షాలకు బిద్యాదేవి సూచించారు. దీంతో ప్రతిపక్షాలు తమ మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి.
ఓలి తిరస్కరించడంతో..
ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలి తన బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో నేపాల్ రాజ్యాం గం ప్రకారం ఓలి తిరిగి ప్రధాని అయ్యారు. ఆయన నెల రోజుల్లోగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే తాను బలం నిరూపించుకోవడానికి సిద్ధంగా లేనంటూ ఓలి ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చివర్లో ఉన్నట్టుండి ఓలి ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏకమైన ప్రతిపక్షాలు..
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మరో అవకాశం రావడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దుబాను ప్రధానిగా అంగీకరిస్తూ పలు పార్టీలు సంయుక్త సంతకాల పత్రాన్ని అధ్యక్షురాలికి పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన పార్టీల్లో నేపాలీ కాంగ్రెస్ (61 మంది సభ్యులు), సీపీఎన్ (48), జేఎస్పీ (13) ఉన్నాయి. షేర్ బహదూర్ గతంలో ప్రధానిగా పని చేశారు. ఇప్పుడు ఎవరిచేత ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వ్యవహారం అధ్యక్షురాలి చేతిలో ఉంది. ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా, నెల రోజుల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 275 సీట్లు ఉన్న ప్రతినిధుల సభలో 136 సీట్లు పొందిన వారికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది.
చదవండి: Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
Comments
Please login to add a commentAdd a comment