vidyadevi Bhandari
-
Nepal: కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
ఖాట్మాండూ: నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రస్తుత ప్రధాని కేపీ ఓలి, ప్రతిపక్ష పార్టీల సంకీర్ణ కూటమి నేతలు వేర్వేరుగా దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారి తలుపుతట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలంటూ ఓ వైపు ఓలి, మరో వైపు ప్రతిపక్షాలు తమ లేఖలను బిద్యా దేవికి పంపారు. ఇందులో ఓలి తనకు 121 మంది తన పార్టీ సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని సంతకాలు చేసి అధ్యక్షురాలికి పంపారు. మరోవైపు ప్రతిపక్ష సంకీర్ణ కూటమి తమకు 149 మంది చట్ట సభ్యుల మద్దతు ఉందంటూ సంతకాలు చేసి దేశ అధ్యక్షురాలు భండారీకి లేఖ పంపింది. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రతిపక్షాలకు బిద్యాదేవి సూచించారు. దీంతో ప్రతిపక్షాలు తమ మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఓలి తిరస్కరించడంతో.. ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలి తన బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో నేపాల్ రాజ్యాం గం ప్రకారం ఓలి తిరిగి ప్రధాని అయ్యారు. ఆయన నెల రోజుల్లోగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే తాను బలం నిరూపించుకోవడానికి సిద్ధంగా లేనంటూ ఓలి ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చివర్లో ఉన్నట్టుండి ఓలి ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏకమైన ప్రతిపక్షాలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మరో అవకాశం రావడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దుబాను ప్రధానిగా అంగీకరిస్తూ పలు పార్టీలు సంయుక్త సంతకాల పత్రాన్ని అధ్యక్షురాలికి పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన పార్టీల్లో నేపాలీ కాంగ్రెస్ (61 మంది సభ్యులు), సీపీఎన్ (48), జేఎస్పీ (13) ఉన్నాయి. షేర్ బహదూర్ గతంలో ప్రధానిగా పని చేశారు. ఇప్పుడు ఎవరిచేత ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వ్యవహారం అధ్యక్షురాలి చేతిలో ఉంది. ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా, నెల రోజుల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 275 సీట్లు ఉన్న ప్రతినిధుల సభలో 136 సీట్లు పొందిన వారికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది. చదవండి: Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే -
నేపాల్ పీఎంగా మళ్లీ ఓలి
కఠ్మాండూ: నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయి, విశ్వాసపరీక్షలో విఫలమవడంతో నాలుగు రోజుల కిందటే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, విపక్ష పార్టీలు మెజారిటీ సాధించే విషయంలో విఫలం కావడంతో గురువారం రాష్ట్రపతి విద్యాదేవి భండారీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేపీ శర్మ ఓలీని కోరారు. దాంతో, రాష్ట్రపతి భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఓలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజుల్లోగా ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే, రాష్ట్రపతి పాలన విధించి, 6 నెలల్లోగా ఎన్నిక లు నిర్వహించే అవకాశముంటుంది. ఓలి గత మంత్రి వర్గాన్నే కొనసాగించనున్నారు. ప్రచండ యూ టర్న్: సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ మద్దతుతో మెజారిటీ సాధించి ప్రధాని పదవి చేపడ్తానన్న ఆశతో గురువారం వరకు నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూ దేవ్బా ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో ప్రచండ కేపీ శర్మ ఓలీతో సమావేశమై దేవ్‌బాకు మద్దతిచ్చే విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. 271 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ఓలి పార్టీ సీపీఎన్–యూఎంఎల్‌కు 121 మంది సభ్యులున్నారు. మెజారిటీకి 136 మంది సభ్యుల మద్దతు అవసరం. -
మళ్లీ మొదటికొచ్చిన నేపాల్
మన పొరుగునున్న నేపాల్‌కూ, రాజకీయ అస్థిరతకూ ఏదో చుట్టరికం ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారంలోకొచ్చినా పట్టుమని ఏడాది కూడా అధికారంలో కొన సాగలేకపోతోంది. తొమ్మిది నెలలక్రితం ప్రధాని బాధ్యతలు చేపట్టిన కె.పి. ఓలీ... విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం చర్చ మొదలు కావడానికి కొన్ని గంటలముందు రాజీనామా సమర్పించారు. ఏకాభిప్రాయాన్ని సాధించి వారం వ్యవధిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయమని రాజకీయ పక్షాలన్నిటికీ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ విజ్ఞప్తి చేశారు. నేపాల్ రాజకీయ పక్షాల నేపథ్యాన్ని, వాటి నడవడిని గమనిస్తే ఇదేమంత సులభం కాదని అర్ధమవుతుంది. 2008లో దేశం రాజరికాన్ని విడనాడి గణతంత్ర రిపబ్లిక్‌గా అవతరించినప్పటినుంచి అది ప్రసవవేదన పడుతూనే ఉంది. రాజ్యాంగ నిర్ణాయక సభకు ఆ ఏడాది మేలో ఎన్నికలు జరిగి మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ 2008 ఆగస్టులో ప్రధాని బాధ్యతలు చేపట్టగా ఆ మరుసటి ఏడాది మే నెలలోనే వైదొలగవలసి వచ్చింది. ఆ తర్వాత దాదాపు 10కిపైగా ప్రభుత్వాలు వచ్చిపోయాయి. నిరుడు సెప్టెంబర్‌లో నూతన రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకుని లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా అవతరించినా ఆ దేశం రాజకీయ సుస్థిరతను సాధించలేకపోయింది. రాజ్యాంగ రచన పూర్తయి దాన్ని ఆవిష్కరించుకొనే దశలోనే అక్కడ ఆందోళనలు చెలరేగాయి. తమకు అన్యాయం జరిగిందని తెరై ప్రాంతంలో ఉండే మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమబాట పట్టాయి. రహదారులు దిగ్బంధం చేశాయి. ఉద్య మిస్తున్న జాతులతో సంప్రదింపులు జరపాలని, అటు తర్వాతే నూతన రాజ్యాం గాన్ని అమల్లోకి తీసుకురావాలని మన దేశం సూచించింది. అయితే నేపాల్ దీన్ని పట్టించుకోకపోగా ఆందోళన చేస్తున్న మాధేసిల వెనక భారత్ హస్తం ఉన్నదని ఆరోపించింది. ఆ ఆందోళన కారణంగా నేపాల్ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని సాకుతో సరుకు రవాణాను, ఇంధన సరఫరాను ఆపేసి తమను భారత్ శిక్షిస్తున్నదని కూడా ఆ దేశ హోంశాఖ ప్రతినిధి అప్పట్లో నిందించారు. మాధేసిలు రహదార్లను దిగ్బంధం చేసినందువల్లనే తమ ట్రక్కులు నేపాల్ భూభాగంలోకి ప్రవేశించలేకపోతున్నాయన్న భారత్ వాదనను కొట్టిపడేశారు. చిత్రమేమంటే ఇప్పుడు కూడా పదవినుంచి వైదొలగుతూ ఓలీ ఇలాంటి ఆరోపణే చేశారు. మాధేసిల ఆందోళనలు, ఇతర సందర్భాల్లో తమ సర్కారు తీసుకున్న చర్యలపై అసంతృప్తిగా ఉన్న కొన్ని ‘విదేశీ శక్తులు’ కావాలని ప్రభుత్వాన్ని కూల్చాయని ఆయన అభియోగం మోపారు. అడపా దడపా ప్రభుత్వాలు కూలిపోవడం రివా జుగా మారిన నేపాల్‌లో... సర్కారు పడిపోవడానికి ‘విదేశీ శక్తుల’ను కారణంగా చూపడం ఇదే తొలిసారి. అంతక్రితం భారత్ అనుకూలుడిగా ఉన్న ఓలీ ప్రధాని పదవి చేపట్టాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం. మాధేసిల ఆందోళన సమ యంలో చైనాతో రవాణా ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు అనంతర కాలంలో ఆ దేశంపై ప్రత్యేక దృష్టి పెడుతూ విదేశాంగ విధానం తీరుతెన్నులను మార్చారు. పర్యాటక నగరంగా పేరున్న పొఖారాలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఒడంబడిక కుదుర్చుకున్నారు. మరికొన్ని నెలల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ సందర్శనకు రావాల్సి ఉంది. రాజకీయ అస్థిరత సద్దుమణిగితే తేదీలు ఖరారు చేసుకోవాలని అనుకున్నారు. ఈలోగానే ప్రభుత్వం కూలిపోయింది. నేపాల్‌కు ఉత్తరాన చైనా ఉంటే తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాల సరిహద్దుల్లో భారత్ భూభాగం ఉంది. భౌగోళికంగా ఉండే అనేక ఇబ్బందుల కారణంగా చైనాతో వాణిజ్యం నేపాల్‌కు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినా భారత్ తనపట్ల పెద్దన్న వైఖరి ప్రదర్శిస్తున్నదని, తరచు ఇబ్బందులకు గురిచేస్తున్నదని నేపాల్ కినుక వహించింది. ఇందులో మన దేశం తప్పిదం కూడా లేకపోలేదు. ఇప్పటికే మన ఇరుగుపొరుగు దేశాలతో చెలిమి చేస్తూ, అనేక విధాల ఆ దేశాలను దువ్వుతున్న చైనా చాన్నాళ్లుగా నేపాల్‌పై కూడా కన్నేసింది. ఆ దేశంలో భారత్ పట్ల అసంతృప్తి పెల్లుబికితే దాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. మన దేశం ఈ సంగతిని సరిగా పరిగణనలోకి తీసుకుని తన వంతుగా సహకారాన్ని పెంపొందించ డానికి తగిన చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. అంతమాత్రాన ఇప్పుడు రాజకీయ అస్థిరతకు భారత్‌ను దోషిగా చూపుతున్న ఓలీ మాటలు నమ్మనవసరం లేదు. పదవి కోల్పోయిన ఉక్రోషంలో కూడా ఆయనలా అని ఉండొచ్చు. నిరుడు వచ్చిన పెను భూకంపంలో ఇళ్లు కోల్పోయినవారికి గృహాలు నిర్మించి ఇస్తామని, ధ్వంసమైన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలుపు కోవడంలో సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చుకుంటున్నట్టు మొన్న మే నెలలో మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ ప్రకటించారు. అప్పట్లో ఓలీ ఆయనకు సర్దిచెప్పి ఒప్పించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదంటూ ఆ పార్టీ ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకుంది. ఈ సంక్షో భంనుంచి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నంతలోనే కూటమిలోని మరో రెండు పార్టీలు వైదొలగుతున్నట్టు ప్రకటించాయి. ఇక ఓలీకి రాజీనామా తప్ప గత్యంతరం లేక పోయింది. ఇప్పుడు నేపాలీ కాంగ్రెస్, మావోయిస్ట్టుల కూటమి అధికారంలోకి రావొచ్చునని, ప్రచండ మళ్లీ ప్రధాని అవుతారని ఊహాగానాలొస్తున్నాయి. నేపాల్ దశాబ్ద కాల నేపథ్యాన్ని గమనిస్తే అక్కడ ఏమైనా జరగొచ్చునని అర్ధమవుతుంది. అయితే అలా ఏర్పడే ప్రభుత్వం మళ్లీ ఎంతకాలం నిలుస్తుందన్నదే ప్రశ్న. ఏ అంశంపైనా నిలకడగా, నిబద్ధతగా వ్యవహరించలేని పార్టీలు నేపాల్‌కు శాపంగా పరిణమించాయి. ఇప్పటికైనా స్వీయ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ ప్రగతికోసం, మెరుగైన భవిష్యత్తు కోసం అన్ని పక్షాలూ కృషిచేయాలి. రాజ రికమే మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే అది తమకే సిగ్గుచేటని గుర్తించాలి. -
నేపాల్‌కు తొలి అధ్యక్షురాలు
-
నేపాల్‌కు తొలి అధ్యక్షురాలు
కమ్యూనిస్టు విద్యాదేవిని ఎన్నుకున్న పార్లమెంట్ కఠ్మాండూ: నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు విద్యాదేవి భండారీ బుధవారం ఎన్నికయ్యారు. నేపాల్ రిపబ్లిక్ తొలి రాజ్యాంగం అవతరించిన కొద్ది వారాలకే విద్యాదేవి అధ్యక్షురాలిగా ఎన్నికకావడం విశేషం. 54 ఏళ్ల విద్యాదేవి సీపీఎన్-యూఎంఎల్ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె కమ్యూనిస్టు ప్రముఖుడు దివంగత మదన్ భండారీ సతీమణి. ఆమె ఎన్నికను పార్లమెంటు స్పీకర్ ఒన్సారీ ఘర్తీ మగర్ ప్రకటించారు. ఆమె నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత కుల్‌బహదూర్ గురంగ్‌పై 113 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నేపాల్ తొలి అధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ తర్వాత ఈ అత్యున్నత పీఠానికి విద్యాదేవి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షురాలు విద్యాదేవి మాట్లాడుతూ నేపాల్ కొత్త రాజ్యాంగం దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు, స్వేచ్ఛకు దోహదపడేలా తన హయాంలో కృషిచేస్తానని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలీకి ఆమె స్నేహితురాలు. ఆమె వామపక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విద్యార్థి ఉద్యమాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని 1979లో ప్రారంభించారు. ఆమె రెండుసార్లు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.