అవినీతి టేపులు! | Niira Radia tapes: Supreme Court tells CBI to probe 14 issues | Sakshi
Sakshi News home page

అవినీతి టేపులు!

Published Sat, Oct 19 2013 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

Niira Radia tapes: Supreme Court tells CBI to probe 14 issues

నాలుగేళ్లక్రితం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతిపరిచిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించింది. వేలం విధానాన్ని కాదని, నిబంధనలన్నీ చాపచుట్టి నచ్చినవారికి అడ్డగోలుగా స్పెక్ట్రమ్ లెసైన్స్‌లు సంతర్పణచేసి దేశ ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిన ఉదంతమది. అందులో సైడ్ షోగా వెల్లడైందే నీరా రాడియా టేపుల వ్యవహారం. టాటా, రిలయన్స్ సంస్థలకు కార్పొరేట్ లాబీయిస్టుగా ఉంటూ పలువురు పారిశ్రామికవేత్తలతో, రాజకీయ నాయకులతో, జర్నలిస్టులతో నీరా రాడియా సాగించిన సంభాషణలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని మించి సంచలనాన్ని కలిగించాయి.

మూడేళ్ల వ్యవధిలోనే రూ. 300 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన నీరా రాడియా గురించి ఆరా తీయమని, ఆమె ఫోన్‌పై నిఘా పెట్టి ఉంచమని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖనుంచి ఆదాయపు పన్ను శాఖకు అందిన ఆదేశాల పర్యవసానంగా ఈ టేపులు తయారయ్యాయి. ఇవన్నీ పలు సందర్భాల్లో, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆమె సాగించిన ఫోన్ సంభాషణల రికార్డులు. ఆమె గురించిన ఆరా అవసరమని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు భావించకపోయినా, 2జీ స్పెక్ట్రమ్ స్కాం బయటపడకపోయినా నీరా రాడియా బహుశా ఇప్పటికీ దేశ రాజధానిలో చక్రం తిప్పుతుండేవారు.
 
అయితే, కేవలం ఆమె ఆదాయ వనరుల ఆనుపానులను కనుక్కోవడానికి మాత్రమే పరిమితం కావాల్సిన ఈ నిఘా వ్యవహారం చాలా దూరం నడిచింది. ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయంలో నాలుగు గోడలమధ్య ఉండి పోవాల్సిన సంభాషణలు బజారుకెక్కాయి. అవి బయటకు ఎలా పొక్కాయో, వాటిని బయటపెట్టడంలో మీడియా ప్రదర్శించిన ఉత్సాహంలోని నైతికత ఏపాటిదో అన్న అంశాలపై కూడా అప్పట్లో చర్చ సాగింది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యతకూ, ప్రజలకున్న తెలుసుకునే హక్కుకూ మధ్య పోటీగా ఇది పరిణమించింది. ఆ సంభాషణలన్నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకో, వ్యక్తుల సాన్నిహిత్యానికో సంబంధించిన వైతే వెల్లడించాలని చూడటం మర్యాద కాదు. అయితే అవి ఆ పరిధిని దాటాయి.

సంభాషణలనిండా కేంద్ర కేబినెట్ నిర్మాణం, దేశభద్రతలాంటి అంశాలే కాదు... న్యాయవ్యవస్థలో ఉన్న వ్యక్తుల గురించి, వారి తీరు గురించిన వ్యాఖ్యానాలున్నాయి. మనకు దృఢమైన వ్యవస్థగా కనబడుతున్నదంతా ఎంత డొల్లగా ఉన్నదో చెప్పే సంభాషణలవి. ఎవరు ఎవరితో ఏ అవసరం కోసం కలిశారో, కలుస్తున్నారో... ఎవరిని కలిస్తే ఏ పని సులభంగా అవుతుందో ఆ సంభాషణలు చెప్పాయి. ఫలానా వ్యక్తికి కేంద్రంలో మంత్రి పదవి దక్కాలంటే ఎవరి పలుకుబడి పనిచేస్తుందో, ఇంకొకరికి రాకుండా చేయాలంటే ఎవరిని కలవాలో చర్చించుకున్న సంభాషణలవి. అయితే సంభాషణలు బహిర్గతం కావడంవల్ల తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందనీ, అందుకు కారకులెవరో ఆరాతీయించి, ఇకపై వెల్లడికాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు తర్వాత రాడియా టేపులు వెల్లడికావడం ఆగిపోయింది.
 
నీరా రాడియా టేపుల్లోని అంశాలు కేవలం వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమైలేవని, అందులో అవినీతి పొరలున్నాయని, ఉన్నతస్థాయిలో సాగుతున్న కుమ్మక్కు వ్యవహారాలున్నాయని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత సంభాషణలను మాత్రం పరిహరించి, మిగిలినవన్నీ బయటపెట్టాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్యవసానంగా ఈ టేపుల్లో ఉన్నవాటిలో 8,000 సంభాషణలను రాయించి తీసుకురావాలని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వెనువెంటనే అన్నీ సాధ్యంకాలేదు గనుక ముఖ్యమని భావించిన సంభాషణలను సీబీఐ తన రహస్య నివేదికలో పొందుపరిచింది.

వీటిలో కొన్ని అంశాలపై దర్యాప్తు జరపవలసిన అవసరం ఉన్నదని న్యాయమూర్తులు భావించారు. రెండు నెలల్లో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించమని సీబీఐని ఆదేశించారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వాధికారులతో కుమ్మక్కయి అవినీతికి పాల్పడ్డారని, ఇందువల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతిన్నాయని న్యాయమూర్తులు భావించారు. ఇందులో న్యాయవ్యవస్థకు సంబంధించి, కొన్ని ట్రిబ్యునల్స్‌కు సంబంధించి ఉన్న అంశాల్లో ఏంచేయాలో తేల్చడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం ముందుంచారు. సుప్రీంకోర్టుకు చెందిన ఒక రిటైర్డ్ న్యాయమూర్తినుంచి న్యాయం కొనుక్కోవడానికి రూ.9 కోట్లు చేతులు మారాయని ఒక వ్యక్తి నీరా రాడియాకు చెప్పడం ఆ సంభాషణల్లో ఉన్నదంటున్నారు.
 
రాడియా ఉదంతం మన వ్యవస్థలో కార్పొరేట్, రాజకీయ, మీడియా సంబంధాలు ఏ స్థాయికి చేరాయో, అవి ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయో తెలిపాయి. 2జీ స్పెక్ట్రమ్‌ను, అందులో జరిగిన అవినీతినీ కదిలిస్తే దాని వేళ్లు ఎక్కడెక్కడి వరకూ పాకుతూ పోయాయో వెల్లడైంది. ఎవరో ఒక్కరిని దోషిగా చూపి, అంతా ఆయనవల్లనే జరిగిందన్న అభిప్రాయాన్ని కలిగించి ఇందులో నుంచి తేలిగ్గా బయటపడవచ్చుననుకున్న యూపీఏ పెద్దలకు ఇది ఊహించని పరిణామం. ఇంతకూ నీరా రాడియా టేపులు కేవలం 2008-09 మధ్య నడిచిన సంభాషణలకు సంబంధించినవి మాత్రమే.

ఒక ఏడాది వ్యవధిలోనే ఇన్ని విషయాలు వెల్లడైతే... అధికార సౌధాల్లో లోలోపల నిత్యం ఇంకేమేమి చోటుచేసుకుంటున్నాయో ఊహించుకుంటేనే భయం కలుగుతుంది. యూపీఏ అధికారం చేపట్టాక ముసురుకున్న కుంభకోణాల పరంపరలో ఈ రాడియా టేపులు కీలకమైనవి. అందులో  అన్నీ వాస్తవాలే ఉంటాయని అనుకోనక్కరలేదు. ఉబుసుపోని కబుర్లు, పొల్లు మాటలు, స్వోత్కర్షలు ఉండవచ్చు. కానీ, నిజమైన క్విడ్ ప్రోకోల ఆనుపానులు, రాజకీయ దందాలు కూడా వాటిద్వారా తెలుస్తాయి. దేశం దళారుల పాలవుతున్న వైనం కళ్లకు కడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఇలాంటి పోకడల మూలాలను పట్టుకుని, వాటి నివారణకు దోహదపడితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement